Begin typing your search above and press return to search.

ఆ దర్శకులు అడ్రస్ లేకుండా పోయారే..

By:  Tupaki Desk   |   7 April 2016 5:30 PM GMT
ఆ దర్శకులు అడ్రస్ లేకుండా పోయారే..
X
ఒకప్పుడు తెలుగు సినిమాపై తమదైన ముద్ర వేసిన కొందరు దర్శకులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. మళ్లీ ఆ దర్శకుల నుంచి ఇంకో సినిమా వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ దర్శకుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు వైవీఎస్ చౌదరిదే. లాహిరి లాహిరి లాహిరిలో.. సీతయ్య.. దేవదాసు లాంటి సెన్సేషనల్ మూవీస్ తో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన చౌదరి.. ‘రేయ్’ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయాడు. దాదాపు ఏడాదిగా అతడి ఆచూకీ లేదు. మధ్యలో ఏదో ప్రేమకథ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది కూడా పట్టాలెక్కలేదు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన చౌదరి మళ్లీ ఇంకో సినిమా తీయడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక కంత్రి.. బిల్లా లాంటి సినిమాలతో టాలీవుడ్ ఫ్యూచర్ డైరెక్టర్లలో ఒకడవుతాడనిపించిన మెహర్ రమేష్.. శక్తి-షాడో సినిమాలతో పాతాళానికి పడ్డాడు. అతడితో ఇంకో సినిమా చేయడానికి ఏ నిర్మాత సాహసించే పరిస్థితి లేకపోవడంతో అతనూ కనుమరుగైపోయాడు.

ఇక అభిరుచి ఉన్న దర్శకులుగా పేరు తెచ్చుకున్న మరికొందరు డైరెక్టర్లదీ ఇదే పరిస్థితి. ఇక్కడ ముందు తలుచుకోవాల్సింది శేఖర్ కమ్ములనే. ఆనంద్.. గోదావరి.. హ్యాపీడేస్ లాంటి సినిమాలతో టాలీవుడ్ పై బలమైన ముద్ర వేసిన కమ్ముల.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్-అనామిక సినిమాల దెబ్బకు లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడు. ‘ప్రస్థానం’ సినిమాతో గొప్ప పేరు సంపాదించిన దేవా కట్టా.. ఆటోనగర్ సూర్య-డైనమైట్ సినిమాల పుణ్యమా అని అవకాశాల్లేని స్థితికి వచ్చేశాడు. ‘తొలిప్రేమ’ ఫేమ్ కరుణాకరన్ కూడా ఎందుకంటే ప్రేమంట.. చిన్నదాన నీకోసం తర్వాత కనిపించకుండా పోయాడు. ‘ఒంగోలు గిత్త’ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితీ ఇంతే. తమిళంలో ‘బెంగళూరు డేస్’ రీమేక్ కూడా ఆడకపోవడంతో భాస్కర్ చరిత్ర ముగిసినట్లే కనిపిస్తోంది.