Begin typing your search above and press return to search.

ప్రజల్ని మోసం చేయడానికే ఫేక్ కలెక్షన్స్ ప్రకటనలు: సి.కళ్యాణ్

By:  Tupaki Desk   |   20 Sep 2021 11:15 AM GMT
ప్రజల్ని మోసం చేయడానికే ఫేక్ కలెక్షన్స్ ప్రకటనలు: సి.కళ్యాణ్
X
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఈరోజు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు - డీవీవీ దానయ్య - సి.కల్యాణ్ తో పాటుగా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ వ్యవహారం - టికెట్ ధరల పెంపు వంటి అంశాలతో పాటుగా పలు విషయాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. ఈ సందర్భంగా సినిమాల ఫేక్ కలెక్షన్స్ గురించి నిర్మాత సి. కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం అన్ని వందల కోట్లు అని ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్స్ వదిలి వారిని మోసం చేస్తున్నామని సి. కళ్యాణ్ అన్నారు. ''ప్రతి ఒక్క పోస్టర్ లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్.. 200 కోట్లు, 600 కోట్లు, 2000 కోట్లు కలెక్షన్స్ అంటూ పేపర్ ప్రకటనలు ఇచ్చేది ప్రజల్ని మోసం చేయటానికే సార్. అబ్బో ఈ సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అనే భావన కలిగించటానికే అలాంటివి చేస్తుంటాం. సినిమా అనే కలర్ ఫుల్ మాయలో అదొక మాయ. 'జాతి రత్నాలు' వంటి చిన్న సినిమాలు కూడా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేశాయి'' అని మంత్రి పేర్ని నానికి స్పష్టం చేశారు నిర్మాత కళ్యాణ్. అరుదైన తక్కువ బడ్జెట్ హిట్ సినిమాలను చూస్తూ ఎగ్జిబిషన్ రంగంపై ప్రభుత్వం భారం మోపకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సి. కళ్యాణ్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా మంత్రి తో సమావేశం అనంతరం సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి భరోసా లభించిందని.. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని తామే అడిగామని చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉందని.. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. 'ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం గతంలో ఉండేది. అయితే అప్పట్లో ఆప్షన్ గా ఉండేది. ఇప్పుడు కంపల్సరీ చేయాలని మేమే కోరాం. ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. థియేటర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు'' అని అన్నారు.

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత సినిమా వాళ్లతో ఈ తరహా సమావేశం జరగడం తొలిసారి. ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మడం వల్ల ఇబ్బందేమీ లేదు. ఇప్పుడు బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకుంటారు. టిక్కెట్ల ధరల పెంపుపై చర్చే జరగలేదు. థియేటర్ల నిర్వహణ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం'' అని తెలిపారు.