Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కి రిలీఫ్ నిచ్చే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్?

By:  Tupaki Desk   |   24 Jun 2022 8:30 AM GMT
బాలీవుడ్ కి రిలీఫ్ నిచ్చే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్?
X
వ‌రుస ప‌రాజ‌యాల‌తో బాలీవుడ్ నీర‌సించింది. స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ లేక అగ్ర హీరోలంతా ఆవురావురంటూ అల‌మ‌టిస్తున్నారు. ఇప్పుడు ఖాన్ ల త్ర‌యం స‌హా ఇత‌ర పెద్ద హీరోలు ఎవ‌రూ ఉత్త‌రాది ద‌ర్శ‌కుల‌ను వారి క‌థ‌ల‌ను న‌మ్మ‌డం లేదు. నేరుగా సౌత్ కి వ‌చ్చి ఇక్క‌డి ట్యాలెంట్ ని వెతుక్కుంటున్నారు. ఈ స‌న్నివేశం అనూహ్య‌మైన‌ది. పాన్ ఇండియా హిట్లు కొట్టాలంటే సౌత్ మ‌సాలాని యాడ‌ప్ చేసుకోవాల‌న్న జ్ఞానం ఇప్పుడు ఉత్త‌రాది స్టార్ల‌కు పెరిగింది. ఇది ఊహాతీత‌మైన‌ది.

ఇటీవ‌ల విడుద‌లైన కార్తీక్ ఆర్య‌న్ 'భూల్ భుల‌యా 2' కొంత రిలీఫ్ ని ఇచ్చినా ఇది స‌రిపోదు. పెద్ద స్టార్ల నుంచి భారీ హిట్లు కావాలి. ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ పెద్ద‌న్న అనీల్ క‌పూర్.. జూనియ‌ర్ స‌ల్మాన్ గా పాపుల‌రైన వ‌రుణ్ ధావ‌న్ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకుంటార‌ని గుస‌గుస వినిపిస్తోంది. పైగా ఈ సినిమాని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించ‌డంతో దీనిపై ఫోక‌స్ కూడా ఎక్కువే ఉంది.

అయితే ధ‌ర్మాధినేత క‌ర‌ణ్ జోహార్ ఈసారి హిట్టిస్తారా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. జగ్‌జగ్ జీయో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌. ఇందులో వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతూ కపూర్- కియారా అద్వానీ- మనీష్ పాల్ - ప్రజక్తా కోలి త‌దిత‌రులు నటించారు. ప్ర‌తి ఫ్రేమ్ వ‌ర్ణ‌రంజితంగా తెర‌కెక్కింద‌ని విజువ‌ల్స్ చెబుతున్నాయి.

ఇంత‌లోనే కోర్టు కేసుల‌తో చిక్కులు!ధర్మ ప్రొడక్షన్స్ కి వ్యతిరేకంగా విశాల్ ఎ.సింగ్ అనే రచయిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీంతో తాజా మూవీ 'జగ్ జగ్ జీయో' న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అత‌డి పిటిషన్ లో కరణ్ జోహార్ అత‌డి బృందం కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించాడు. సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు ఈ చిత్రం పెద్ద స్క్రీన్ లలోకి రావడానికి ఒక రోజు ముందు రాంచీ కోర్టు కేసును కొట్టివేసింది. నేటి (జూన్ 24 న) రిలీజ్ కి అడ్డంకిని తొల‌గించింది.

విడుదల తేదీని మార్చ‌క‌పోవ‌డంతో ధర్మ ప్రొడక్షన్స్ ఊపిరి పీల్చుకుంది. తీర్పు గురించి ప్రొడక్షన్ హౌస్ కి సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ ఇలా వెల్ల‌డించింది. కాపీరైట్ ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ రోజు ఓపెన్ కోర్టులో తీర్పు ప్ర‌కారం.. గౌరవనీయ రాంచీ వాణిజ్య న్యాయస్థానం .. కరణ్ జోహార్ కి వ్య‌తిరేకంగా దాఖ‌లు చేసిన‌ విశాల్ సింగ్ దరఖాస్తును కొట్టివేసింది. ధర్మ ప్రొడక్షన్స్ వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జగ్‌జగ్ జీయో విడుదలపై నిషేధం కోరినా అది వీలుప‌డ‌లేదు.. అని వెల్ల‌డించారు. అంతేకాదు ర‌చ‌యిత విశాల్ పై కరణ్ జోహార్ -ధర్మ ప్రొడక్షన్స్ చర్య తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ & కరణ్ జోహార్ నేరుగా విశాల్ సింగ్ పై పరువు నష్టం స‌హా నష్టపరిహారం కోసం దావా వేసే ప్రక్రియ కొన‌సాగుతోంది! అని వెల్ల‌డించారు.

కాపీరైట్ ఉల్లంఘన పై ప్ర‌స్థావిస్తూ 'జగ్ జగ్ జీయో' ట్రైలర్ విడుదలైన తర్వాత విశాల్ ఎ.సింగ్ ట్విట్టర్ లోకి వెళ్లారు. తన ట్వీట్ లో తాను కరణ్ జోహార్ అత‌డికి చెందిన‌ ధర్మ ప్రొడక్షన్స్ తో 'బన్నీ రాణి' అనే స్క్రిప్ట్ ను వినిపించాన‌ని.. అది విడాకులు కోరుకునే మధ్య వయస్కులైన జంట క‌థ‌తో రూపొందించాన‌ని పేర్కొన్నాడు. అతను ట్వీట్ ల‌లో నిర్మాణ సంస్థతో ఇమెయిల్ షేరింగ్ కి సంబంధించిన‌ స్క్రీన్ షాట్ లను కూడా షేర్ చేసాడు. జ‌గ్ జ‌గ్ జియో క‌థ- స్క్రిప్టు త‌న‌దేన‌ని అన్నారు. కానీ ధ‌ర్మ సంస్థ సినిమాని రిలీజ్ కి రెడీ చేసింది. కొన్ని వారాల క్రితం విశాల్ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ కోర్టును ఆశ్రయించారు. కానీ ఈ కేసు వీగిపోయింది. ర‌చ‌యిత ఓట‌మి పాల‌య్యారు. అత‌డిపై ధ‌ర్మ సంస్థ ప‌రువు న‌ష్టం దావా వేయ‌నుంది.