Begin typing your search above and press return to search.

బాహుబలీ.. ఎంత పని చేస్తున్నావయ్యా!

By:  Tupaki Desk   |   12 July 2015 2:48 AM GMT
బాహుబలీ.. ఎంత పని చేస్తున్నావయ్యా!
X
బాహుబలి సినిమా విషయంలో తెలుగునాట ఎలాంటి క్రేజ్‌ ఉందో.. టికెట్ల కోసం ఎంత రభస జరుగుతోందో మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం. బహుశా తెలుగు సినిమా చరిత్రలోనే ఏ సినిమాకు కూడా ఇలాంటి డిమాండ్‌ ఉండి ఉండదేమో! ఐతే మన ప్రేక్షకులు బాహుబలి టికెట్ల కోసం ఎగబడటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో క్రేజ్‌ పతాక స్థాయికి చేరిపోవడమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ముఖ్యంగా కన్నడనాట బాహుబలి టికెట్ల కోసం జరుగుతున్న గొడవలు చూసి అక్కడి జనాలకు మతిపోతోంది.

బెంగళూరులో తెలుగు సినిమాలకు ముందు నుంచే మంచి క్రేజ్‌ ఉందన్న సంగతి తెలిసిందే. ఐతే బాహుబలి విషయంలో అక్కడ జరుగుతున్న హంగామా మాత్రం మామూలుగా లేదు. నగరంలో ఉన్న యాభై శాతానికి పైగా థియేటర్లను బాహుబలి ఆక్రమించేసింది. మల్టీప్లెక్స్‌ల్లో అయితే వీకెండ్‌లో మెజారిటీ షోలు బాహుబలివే. హైదరాబాద్‌లో ఎంత హంగామా ఉందో అక్కడా అంతే సందడి నెలకొంది. ఐతే తెలుగువాళ్లు ఎక్కువుండే బెంగళూరు, బళ్లారి లాంటి ప్రాంతాల్లో క్రేజ్‌ ఉండటం ఓకే కానీ.. మైసూరు ప్రాంతంలో ఉండే పావగడ అనే రూరల్‌ ఏరియాలో కూడా బాహుబలి టికెట్ల కోసం పెద్ద గొడవ జరగడం.. ఓ థియేటర్‌ ధ్వంసం అయిపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పావగడలోని ఓ థియేటర్‌ దగ్గరికి శనివారం భారీగా జనాలు తరలి వచ్చారు. కానీ అందరికీ టికెట్లు దొరకలేదు. దీంతో అభిమానులు థియేటర్‌ దగ్గర పెద్ద గొడవ చేయడమే కాదు.. ఎంతో ఎత్తులో ఉన్న కిటికీల్ని ధ్వంసం చేసి.. థియేటర్‌ లోపలికి వెళ్లిపోయారు. చివరికి అందరినీ ఎలా మేనేజ్‌ చేశారో కానీ.. కర్ణాటకలోని ఓ రూరల్‌ ఏరియాలో ఓ తెలుగు సినిమా కోసం ఇంత హంగామా జరగడం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. బాహుబలి క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదేమో.