Begin typing your search above and press return to search.

అభిమానం ఓకే.. ఈ దురభిమానం ఏంది?

By:  Tupaki Desk   |   13 Jan 2017 5:26 AM GMT
అభిమానం ఓకే.. ఈ దురభిమానం ఏంది?
X
‘నాకు అనిపించింది చెబుతా? మనసుకు తట్టిందే మాట్లాడతా’ లాంటి మాటలు ఎవరైనా అంటే అరే.. ముక్కుసూటి మనిషిరా అనుకుంటాం. కానీ.. ఈ ముక్కుసూటితనం ఎదుటోడ్ని అదే పనిగా విమర్శించేటట్లు ఉండకూడదు. మామూలు పరిస్థితుల్లో కొంతలో కొంత అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ రెండుగా చీలిపోయినట్లుగా వ్యవహరిస్తూ.. తమ అభిమాన కథానాయకుడే మొనగాడు.. తోపుగాడు అంటూ ఫీలైపోతున్న వేళ.. చిన్న చిన్న మాటలు సైతం పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఒకరిపై అభిమానం తప్పేం కాదు. కానీ.. అది హద్దులు దాటకూడదు. ఒకరి మీద అభిమానం.. మరొకరి మీద చులకనభావం కలుగజేసేదిగా మారకూడదు. గతంలో అభిమానానికి ఫలానా అన్న ప్రాతిపదిక ఉండేది కాదు. మనసుకు నచ్చినోడి మీద అభిమానాన్ని ప్రదర్శించేవారు. కొద్దికాలంగా అభిమానం లెక్కల్లోకి కొన్ని దరిద్రాలు వచ్చి చేరాయి. తాము అభిమానించే వారు తమ వర్గానికి చెందిన వారో.. తమ కులానికి చెందిన వారినో కారణం కూడా ఒకటి వచ్చి చేరిపోయింది. కులాలు.. వర్గాలకు అతీతంగా అభిమానం ఉండాలి.

దురదృష్టవశాత్తు అందుకు భిన్నమైన పరిస్థితి. ఫలానా వ్యక్తి ఏ అనే కులానికి చెందిన వ్యక్తి అయితే.. ఏ కులానికి చెందిన హీరోలు ఉంటే వారి మీద ఎక్కువ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని తప్పుగా ఖండించలేని వారు కామ్ గా ఉంటే.. ఈ అభిమానం మరింత ముదిరిపోతోంది. తాము అభిమానించే వారిని ఆకాశానికి ఎత్తేసే వారంతా.. ఎదుటివారిని చులకనగా చూడటమే అసలు సమస్య. కులాల లెక్కలు ఒకటైతే.. ఫ్యాన్స్ పేరిట అభిమానులు పెంచుకుంటున్న స్పర్థలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

ఇది ఎంతవరకూ వెళుతుందంటే.. తాము ఎవరినైనా అభిమానిస్తామో వారు మాత్రమే గొప్ప అని.. వారి సినిమాలు మాత్రమే బాగుంటాయన్న ప్రచారం చేసుకునే వరకూ వెళ్లిపోతున్నాయి. నచ్చిన వ్యక్తిని అభిమానించటం తప్పేం కాదు. కానీ.. తాము ఒకరిని అభిమానిస్తున్నాం కాబట్టి.. వారితో పోటీకి వచ్చే వారు ఎవరైనా సరే వారిని వ్యతిరేకించాలి.. వారిని చిన్నబుచ్చేలా వ్యాఖ్యలు చేయాలన్నట్లుగా వ్యవహరించటంలోనే అసలు సమస్యంతా.

తెలుగునాట తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఈ విషయాలన్నీ ఇట్టే తెలిసిపోతాయి. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కావటం ఒక ఎత్తు అయితే.. ఈ రెండు సినిమాలు ఆయా హీరోల వ్యక్తిగత ప్రతిష్టలకు కీలకమైనవి కావటం నిజమే అయినా.. వాటిని అభిమానులు తమ భుజాల మీద మోస్తూ.. ఎదుటివారిని చిన్నబుచ్చటంతోనే అసలు సమస్యంతా. గతంలో నలుగురు కలిసినప్పుడు చర్చ జరగటం.. మంచైనా - చెడైనా అక్కడితో ఆగేది. టెక్నాలజీ పుణ్యమా అని అందరికి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా చేస్తున్న చెరుపు అంతాఇంతా కాదు. ఒకరు మనసుల్లో తట్టిన దరిద్రాన్ని.. అందరికి పంచుకోవటం.. దురభిమానంతో చెలరేగిపోయే వారికి ఇలాంటి అస్త్రాలుగా మారి అదే పనిగా ప్రచారం చేస్తూ.. తామే అసలుసిసలు అభిమానులుగా ఫీల్ అవుతున్న దుస్థితి. రోజులు గడిచే కొద్దీ అభిమానం విశాలం కావాల్సింది పోయి.. కుంచించుకుపోవటం సరికాదు. ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అని అనుక్షణం అనుకునే కన్నా.. తప్పులకు దూరంగా ఉండటం.. ఒప్పులకు దగ్గరగా ఉండటం లాంటి మైండ్ సెట్ చాలా అవసరం. కానీ.. అలాంటిది లేకుండా దురభిమానంతో తమ హీరోను ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతూ.. అవతలి హీరోలను పాతాళానికి తొక్కేసేలా వ్యాఖ్యలు చేసుకోవటంలోనే అసలు ఇబ్బందంతా.

నిజానికి పోటీ పడుతున్న ఇద్దరు అగ్రహీరోలు.. తమ సినిమాతో పాటు.. ఎదుటివారి సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లే ఓపెన్ గా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కానీ.. వారికి భిన్నంగా ఫ్యాన్స్ వ్యవహరిస్తున్న ధోరణే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తమ హీరో సినిమానే సూపర్ అని చెప్పుకోవటం తప్పేం కాదు. కానీ.. తమ ప్రత్యర్థి సినిమా బాగోలేదనో.. ఛండాలంగా ఉందనో తప్పుడు మాటలు చెప్పటంతోనే కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. నిజానికి ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలు విడుదలైతే అసలుసిసలు సినీ అభిమానులంతా పండగ చేసుకోవాలి. ఒక సినిమా స్థానే ఒకేసారి రెండు సినిమాలు చూసే చాన్స్ వచ్చినందుకు ఆనందపడాలి.

కానీ.. చౌకబారు మాటలతో చిన్నబుచ్చటం సరైన పద్ధతి కాదు. చిరు 150 మూవీ ఖైదీ.. బాలయ్య 100 మూవీ శాతకర్ణి రెండు సినిమాలు విడుదల కావటం.. రెండింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది సినిమా ఇండస్ట్రీకి పెద్ద శుభవార్త. సరైన విజయాలు లేని పరిశ్రమలో.. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవటంతో కలెక్షన్ల వర్షం కురవటం ఖాయం. దీంతో.. పరిశ్రమ కళకళలాడటమే కాదు.. కొత్త ప్రాజెక్టులు మరిన్ని తెర మీదకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఇలాంటి పాజిటివ్ పరిణామాల మధ్య.. హీరోల ఫ్యాన్స్ చేస్తున్న రచ్చే వేదనను కలిగిస్తుందని చెప్పాలి. ఎవరు గొప్ప అన్న చర్చను మరే పనే లేనట్లుగా మాట్లాడుకోవటం కాస్త తగ్గిస్తే మంచిది. తమ హీరో సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే.. తమకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఏ అభిమాని మర్చిపోకూడదు. పోటీపడుతున్న హీరోలు చక్కగా మాట్లాడుకుంటూ.. నేనూ.. మీరూ అందరం బాగుండాలని చెప్పుకుంటున్న వేళ.. వారి అభిమానులని చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు చించుకోవటంలో ఏమైనా అర్థముందా?



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/