Begin typing your search above and press return to search.

కాళ్ళపై పడడాలు..నిజమా..సెటప్పా?

By:  Tupaki Desk   |   24 Sept 2019 7:00 AM IST
కాళ్ళపై పడడాలు..నిజమా..సెటప్పా?
X
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. కలల ప్రపంచం. బయటనుంచి చూసేవారికి ఒక్కోసారి ఏది నిజమో.. ఏది అబద్ధమో అర్థం కాదు. అప్పట్లో ఒక సౌత్ హీరోకు జపాన్ లో ఫ్యాన్ ఉన్నాడు.. మలేషియాలో ఫ్యాన్ ఉన్నాడు.. స్టార్ హీరో కోసం ఆ ఫ్యాన్ ఇండియాకు వచ్చాడు అంటే అదో పెద్ద ఘనత అని ప్రేక్షకులు అనుకునేవారు. కానీ ఈమధ్య హీరోల క్రేజ్ పెంచేందుకు మేనేజర్లు ఇలాంటివి సెటప్ చేస్తున్నారని.. మీడియాలో తమ హీరో క్రేజ్ హైలైట్ అయ్యేలా ఇలాంటివి ప్లాన్ చేస్తారని టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే ఈమధ్య ఫిల్మీ ఈవెంట్లు జరుగుతుంటే ఫ్యాన్స్ సెక్యూరిటీని దాటి వచ్చి హీరోల కాళ్ళపై పడడం.. బౌన్సర్లు వచ్చి వారిని పక్కకు తీసుకుపోవడానికి ప్రయత్నించడం.. హీరోలు ఆ సెక్యూరిటీవారిని వారించడం.. సదరు ఫ్యాన్ ను కౌగిలించుకోవడం చాలా సాధారణంగా మారింది. అయితే ఈ సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయా.. లేక హీరోల మేనేజర్లు.. ఈవెంట్ ఆర్గనైజర్లు హైప్ కోసం ఇలా 'సెటప్' చేస్తున్నారా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ అది 'సెటప్' కాకుండా ఫ్యాన్స్ సెక్యూరిటీని ఛేదించుకొని స్టార్ల దగ్గరకు రావడం నిజమే అయితే అది మరోరకంగా ఇబ్బంది. ఎందుకంటే అలా జరగడం ఈవెంట్ లో సెక్యూరిటీ ఫెయిల్యూర్ అవుతుంది. ఒకవేళ ఫ్యాన్ ముసుగులో ఎవరైనా వ్యక్తి స్టేజ్ పైకి వచ్చి సెలబ్రిటీకి హాని చేయాలని ప్రయత్నిస్తే అప్పుడు జరిగే పరిణామాలు ఊహించడం కూడా కష్టం. ఏదేమైనా ఒక ఈవెంట్ కు సెక్యూరిటీగా వ్యవహరించేవారు.. బౌన్సర్లు.. అత్యుత్సాహం చూపించే ఫ్యాన్స్ తో జాగ్రత్తగానే ఉండాలి.