Begin typing your search above and press return to search.

మాస్‌ రాజాని మిల్క్‌ తో సరిపెట్టారు

By:  Tupaki Desk   |   21 Aug 2015 6:05 PM GMT
మాస్‌ రాజాని మిల్క్‌ తో సరిపెట్టారు
X
అభిమానం ఇంధనం వంటిది. అది సరిగ్గా వినియోగిస్తే ధనంగా మారుతుంది. కుదరకపోతే మంటై మండుతుంది. ఇటీవలి కాలంలో అభిమానులు తమ హీరోకి కేవలం కటౌట్లు కట్టి పూలదండలతో అలంకరించడం ఒక్కటే కాదు. ఏకంగా మేకపోతుల్ని బలివ్వడం, బీర్‌ తో అభిషేకం చేయడం వంటి చిలిపి పనులు కూడా చేస్తున్నారు.

అప్పట్లో ప్రభాస్‌ అభిమానులు బాహుబలి రిలీజ్‌ సందర్భంగా ఏకంగా మేకపోతును బహిరంగ ప్రదేశంలో వికారాబాద్‌ లోని ఓ థియేటర్‌ వద్ద బలిచ్చారు. ఆ రక్తంతో పోస్టర్‌ కి అభిషేకం చేశారు. అదో పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. ఆ తర్వాత మహేష్‌ అభిమానులు శ్రీమంతుడు పోస్టర్‌ కు బీరాభిషేకం చేశారు. అదేనండీ.. బీర్‌ తో అభిషేకించి తమ ముచ్చట తీర్చుకున్నారు. ఈ రెండు ఉదంతాలు సోషల్‌ మీడియాలో విస్త్రతంగా చర్చకొచ్చాయి.

ఇప్పుడు మాస్‌ మహారాజ్‌ రవితేజ కిక్‌2 రిలీజైంది. అతడి అభిమానులు మాత్రం కాసింత సాత్వికులు .. గొంతు కొయ్యకుండా, వైన్‌ పొంగించకుండా కేవలం పాలతో తమ అభిమాన స్టార్‌ ని అభిషేకించారు. మిల్క్‌ తో మాస్‌ రాజా పోస్టర్‌ ని పునీతం చేశారు. ఎలా చేసామన్నది కాదన్నయ్యా.. చేశామా లేదా? అన్నదే ముఖ్యం. కిక్కో కిక్కు.