Begin typing your search above and press return to search.

హీరోపై నోరు జారి ఇరుకున్నారు

By:  Tupaki Desk   |   19 Jan 2018 8:17 AM GMT
హీరోపై నోరు జారి ఇరుకున్నారు
X
చేతిలో మైకు - ఎదురుగా కెమెరా ఉంటే చాలు కొందరు టీవీ యాంకర్లకు ఒకోసారి పూనకాలు వస్తూ ఉంటాయి. తాము ఏం మాట్లాడుతున్నామో ఎవరిని ఉద్దేశించి అంటున్నామో సైతం మర్చిపోయి వాళ్ళు చేసే విపరీత కామెంట్లు లేని పోనీ చిక్కులు తెచ్చి పెట్టి ఆఖరికి భరించలేని తలనెప్పులుగా మారతాయి. తాజాగా సన్ మ్యూజిక్ ఛానల్ లో ఒక షో చేసే ఇద్దరు యాంకర్లు ఓవర్ యాక్షన్ చేయటమే కాదు స్టార్ హీరో సూర్య మీద సెటైర్లు వేయటం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాక బయట కూడా వివాదంగా మారింది. తమిళ్ లో బాగానే ఆడుతున్న గ్యాంగ్ మూవీలో సూర్య తన హైట్ గురించి ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తావనకు తీసుకువస్తాడు. నిజానికి అది సహజంగానే అధిక హైట్ ఉన్న నటుడు సురేష్ మీనన్ కి కౌంటర్ వేయడానికి దర్శకుడు విజ్ఞేశ్ శివన్ పెట్టించిన డైలాగ్'. దాన్ని ఇంకోలా తీసుకున్న ఈ యాంకర్లు చెత్త కామెంట్ ఒకటి చేయటంతో ఫాన్స్ తో తిట్లు తింటున్నారు.

సూర్య త్వరలో కెవి ఆనంద్ తో ఓ మూవీ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ ఇద్దరి కాంబోలో గతంలో వీడొక్కడే - బ్రదర్స్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు చేయబోయే కొత్త మూవీలో అమితాబ్ బచ్చన్ కు సరిపడా ఒక కీలకమైన పాత్ర కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. దాని గురించి ప్రస్తావించిన యాంకర్లు సింగంలో అనుష్కనే హైట్ తక్కువున్న సూర్య కాస్త కష్టపడి తల ఎత్తి చూసాడని - అలాంటిది అమితాబ్ కనక సూర్య సినిమాలో నటిస్తే స్టూల్ వేసుకుని చూడాల్సి వస్తుందేమో అనే తరహాలో కామెడీ చేసారు. దీంతో సూర్య ఫాన్స్ కి ఒళ్ళు మండింది. అసలు సూర్య హైట్ ప్రస్తావన ఇప్పటి దాకా ఎప్పుడూ రాలేదని, అలాంటిది ఇప్పుడు ఏదో కామెడీ కోసం ఇలా ఎగతాళి చేయటం బాలేదని ఫైర్ అవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కొత్తగా మొదలైన పైత్యం కాదు. గతంలో కూడా కొందరు యాంకర్లు అత్యుత్సాహంతో తమ టాలెంట్ ని గొప్పగా చూపించుకోవాలని నటీనటులను ఎద్దేవా చేయటం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడటం చూస్తూనే ఉన్నాం. ఏదైనా మాట అనేటప్పుడు ఎవరిని అంటున్నాం, వారి స్థాయి ఏమిటి అని ఆలోచించకుండా ఇలా మాట్లాడితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రేక్షకులను మెప్పించే వంక పెట్టుకుని ఏమైనా అంటాము అనడం కరెక్ట్ కాదు కదా.