Begin typing your search above and press return to search.

షారుఖ్ మళ్లీ మళ్లీ డాన్ కాబోతున్నాడు

By:  Tupaki Desk   |   20 Dec 2017 11:13 AM GMT
షారుఖ్ మళ్లీ మళ్లీ డాన్ కాబోతున్నాడు
X
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట వచ్చిన ‘డాన్’ సినిమా అమితాబ్ బచ్చన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని మోడర్నైజ్ చేసి 11 ఏళ్ల కిందట ‘డాన్’ పేరుతో రీమేక్ చేశాడు ఫర్హాన్ అక్తర్. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు డాన్-2 కూడా తీశాడు ఫర్హాన్. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో ‘డాన్’ సిరీస్‌ కు తెరపడినట్లే అని అంతా భావించారు. కానీ ఈ సిరీస్ లో మూడో సినిమా రాబోతోందని ఇప్పుడు షారుఖ్ ఖాన్ స్వయంగా వెల్లడించడం విశేషం.

డాన్-3 వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లబోతోందని.. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ ఈ చిత్ర స్క్రిప్టు పనిలో ఉన్నాడని షారుఖ్ వెల్లడించాడు. ‘దిల్ చాహ్తా హై’తో దర్శకుడిగా పరిచయమైన ఫర్హాన్.. ఆ తర్వాత దర్శకుడిగా మూణ్నాలుగు సినిమాలు తీసి బ్రేక్ తీసుకున్నాడు. ఆపై అతను నటుడిగా మారాడు. నటుడిగానే బిజీ అయ్యాడు. గత దశాబ్ద కాలంలో ఫర్హాన్ తీసిన సినిమా ‘డాన్-2’ మాత్రమే. ఇప్పుడు మళ్లీ ఈ సిరీస్ లోని కొత్త సినిమాకు అతను దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రాన్ని షారుఖ్-ఫర్హాన్ కలిసి ప్రొడ్యూస్ చేస్తారట. డాన్.. డాన్-2 సినిమాల్లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది. కానీ ఇప్పుడామె హాలీవుడ్ రేంజికి ఎదిగిపోయి మన ఫిలింమేకర్లకు దొరకట్లేదు. దీంతో ఆమె స్థానంలో మూడో ‘డాన్’ కోసం దీపికా పదుకొనేను కథానాయికగా తీసుకుంటారని సమాచారం. ఈ చిత్రంలో షారుఖ్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడట.