Begin typing your search above and press return to search.

భరత్ కోసం వచ్చిన రాక్ ఆన్ సింగర్

By:  Tupaki Desk   |   31 March 2018 5:59 AM GMT
భరత్ కోసం వచ్చిన రాక్ ఆన్ సింగర్
X
ఇది నిజంగా మహేష్ ఫాన్స్ చాలా ప్రత్యేకంగా చెప్పుకునే వార్త. భరత్ అనే నేను టైటిల్ ట్రాక్ ఇప్పటికే విడుదలై సంచలనం రేపగా రేపు రిలీజ్ కానున్న ఐ డోంట్ నో అనే పాటకు చాలా ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు-దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఈ పాట పాడటమే ఆ స్పెషాలిటీ. రాక్ ఆన్ - భాగ్ మిల్కా భాగ్ సినిమాల ద్వారా మనవాళ్ళకు కూడా సుపరిచితుడైన ఫర్హాన్ అక్తర్ తెలుగు సినిమాకు గొంతు కలపడం అంటే విశేషమే. ఇప్పటికే దీని గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఓ రేంజ్ లో ఊరిస్తున్నారు. ప్రిన్స్ ఫాన్స్ ఈ పాట ఏ రేంజ్ లో ఉండబోతోందో అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ మంచి గాయకుడు. జిందగీ నా మిలేగీ దోబారా-వజీర్- షాది కే సైడ్ ఎఫెక్ట్స్ లాంటి సినిమాల ద్వారా సింగర్ గా అవార్డులు కూడా గెలుచుకున్నాడు. అలాంటి టాలెంటెడ్ సింగర్ భరత్ అనే నేను టీంలో కలవడం అంటే కిక్కిచ్చే న్యూస్ కాక ఏమవుతుంది.

భరత్ అనే నేను ఆడియో వేడుకకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 7న జరగనున్న ఈ సంబరానికి మహేష్ ఫాన్స్ భారీ ఎత్తున తరలి రానున్నారు. పైన చెప్పిన పాటను స్పెయిన్ లో షూట్ చేసినట్టుగా సమాచారం. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు విశ్వరూపం ఇందులో చూడొచ్చని యూనిట్ చాలా ధీమాగా చెబుతోంది. సమ్మర్ సీజన్ ని రంగస్థలం గ్రాండ్ గా ఓపెన్ చేసిన నేపధ్యంలో భరత్ అనే నేను మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కైరా అద్వాని హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రిన్స్ తండ్రిగా శరత్ కుమార్ - అపోజిషన్ లీడర్ గా ప్రకాష్ రాజ్ - పార్టీలు మార్చే వాడిగా పోసాని కృష్ణమురళి నటిస్తున్నట్టు సమాచారం. మరో ఇరవై రోజులు మాత్రమే టైం ఉండటంతో భరత్ అనే నేను విడుదల కోసం ఫాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ లాంటి టాప్ బాలీవుడ్ టాలెంట్ మ్యూజిక్ కి తోడయ్యింది అన్న వార్త వైరల్ గా మారింది.