Begin typing your search above and press return to search.

మంచు విష్ణు జోడీగా ఫరియా అబ్దుల్లా!

By:  Tupaki Desk   |   11 Nov 2021 2:30 AM GMT
మంచు విష్ణు జోడీగా ఫరియా అబ్దుల్లా!
X
తెలుగు తెరపై విరిసిన తెలుగు అందం ఫరియా అబ్దుల్లా. హైదరాబాదులో పుట్టిపెరిగిన ఈ అమ్మాయి, 'జాతిరత్నాలు' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఈ అమ్మాయి మంచి పొడగరి కావడం .. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆమె హైటు గురించి ప్రభాస్ ప్రస్తావించడంతో అందరి దృష్టి ఆ అమ్మాయి వైపు తిరిగింది. చక్కని కనుముక్కు తీరుతో ఈ బ్యూటీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక తెలుగు తెరపై ఆమె జోరు కొనసాగడం ఖాయమని అనుకున్నారు. అయితే ఆమె మాత్రం తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది.

ఇటీవల వచ్చిన 'మోస్ట్ ఏలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలో మెరిసిన ఈ అమ్మాయి, మరి కొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందనున్న 'డి అండ్ డి' సినిమాలో కథానాయికగా ఆమెను తీసుకున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు .. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. తాజాగా ప్రసారమైన 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "ప్రస్తుతం మూడు స్క్రిప్టులు రెడీ చేశాను. ఇక ఒకదాని తరువాత ఒకటిగా చేసుకుంటూ వస్తాను. ఈ మూడింటిలో ముందుగా 'డి అండ్ డి' పట్టాలెక్కుతుంది. 'డబుల్ డోస్' అనేది క్యాప్షన్. ఈ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమాలో మంచు విష్ణు హీరో .. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మిగతా స్టార్ కాస్టింగ్ ఎక్కువగానే ఉంటుంది. 'ఢీ'ని నిమించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులు నా నుంచి కామెడీ ఎక్కువగా కోరుకుంటారు. వాళ్ల అంచనాలకి తగ్గకుండా ఈ సినిమా ఉండేలా చూసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.

ఫరియా అబ్దుల్లాను చూసిన వారు ఈ అమ్మాయి పొడగరి హీరోల జోడీగా మాత్రమే సెట్ అవుతుందని అనుకున్నారు. ఇక విష్ణు మంచి హైటు కనుక .. తెరపై ఈ జోడీ బాగానే ఉంటుంది. విష్ణు విషయానికి వస్తే 'మోసగాళ్లు' తరువాత ఆయన మరో సినిమా చేయలేదు. కాజల్ ఆ సినిమాలో కథానాయిక కాకుండా హీరోకి సిస్టర్ కావడంతో ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధానమైన కారణమైంది. ఆ తరువాత ఆయన 'సన్నాఫ్ ఇండియా' నిర్మాతగా బిజీ అయ్యాడు. ఇక 'మా' ఎన్నికల కోసం కొంత సమయం తీసుకున్నాడు. ఇక రేపో మాపో 'డి అండ్ డి'తో సెట్స్ పైకి వెళతాడన్న మాట.