Begin typing your search above and press return to search.

'బ్యాచ్ లర్'లో పండగలాంటి పిల్ల .. ఫరియా అబ్దుల్లా!

By:  Tupaki Desk   |   2 Oct 2021 5:34 AM GMT
బ్యాచ్ లర్లో పండగలాంటి పిల్ల .. ఫరియా అబ్దుల్లా!
X
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో ఫరియా అబ్దుల్లా ఒకరు. 'జాతిరత్నాలు' సినిమా ద్వారా ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది. మంచి హైటూ .. .. చక్కని కనుముక్కు తీరు .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంది. తెరలు .. తెరలుగా మైకం తెప్పించే మత్తునవ్వు ఈ పిల్ల సొంతం. ప్రభాస్ .. మహేశ్ .. గోపీచంద్ వంటి పొడగరి హీరోల సరసన అయితే ఈ అమ్మాయి బాగుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఈ సుందరిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నట్టుగా అనిపించడం లేదు.

సాధారణంగా పొడగరి అమ్మాయిలు మోడలింగ్ రంగంలో ఎక్కువగా రాణిస్తారు. సినిమాల్లో పొడగరి హీరోల సరసన అవకాశాలు దొరకడం కొంచెం కష్టమైన విషయమే. అందువల్లనే ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించవు. జాతిరత్నాలు' భారీ విజయాన్ని సాధించినప్పటికీ, ఫరియా అబ్దుల్లా మరో సినిమాలో చోటు దక్కించుకున్న దాఖలాలైతే లేవు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా ట్రైలర్ లో మెరిసి షాక్ ఇచ్చింది. ఈ అమ్మాయిని చూడగానే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడం ఖాయమని అనుకుంటున్నారు.

నిజానికి 'జాతిరత్నాలు' సినిమా విడుదల కావడానికి ముందే ఫరియా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేయడానికి అంగీకరించింది. అందువలన అప్పటికి ఫరియాకి హిట్ కానీ .. క్రేజ్ కానీ లేవు. ఈ కారణంగానే ఆ స్థాయికి తగిన పాత్ర చేసి ఉంటుందని అనుకోవాలి. సరే పాత్ర ఏదైతేనేం .. పండుగలాంటి పిల్ల మళ్లీ తెరపై కనిపించడమే పదివేలు అనుకుంటున్నారు. 'దీపం ఎక్కడ పెట్టినా వెలుతురునే గదా ఇస్తుంది' అనుకుంటూ వెయిట్ చేస్తున్నారు. ఇంతగా క్రేజ్ లేనపుడు చేసిన సినిమా కనుక, 'బ్యాచ్ లర్' ఫరియాకు ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చెప్పలేం గానీ, ఈ సినిమాకి ఆమె ప్లస్ అవుతుందని బల్లా తన్నేసి మరీ చెప్పచ్చు.

అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ముఖ్యమైన పాత్రలో ఈషా రెబ్బా కనువిందు చేయనుంది. ఈ ఇద్దరు భామలు ట్రైలర్ లో కనిపించినదానికంటే, ఫరియా కనిపించినప్పుడు వస్తున్న స్పందన వేరుగా ఉంది. అందువల్లనే ఈ సినిమాకి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రవితేజ సరసన ఫరియాకి అవకాశం లభించిందనీ .. నాగశౌర్య సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదనే విషయం అర్థమైంది. ఫరియా కెరియర్ ఊపందుకోవాలని ఆమెను అభిమానించే వాళ్లంతా కోరుకుంటున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఆమె ముందుకు వెళ్లలేకపోతోంది. అయితే ఒక బాలీవుడ్ హీరోయిన్ కి ఉండవలసిన లక్షణాలన్నీ ఉండటం వలన, ఆమె అక్కడ రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫరియా ఏం చేస్తుందో చూడాలి.