Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. ఫిబ్ర‌వ‌రి 10న టాలీవుడ్ పై మ‌రో పిడుగు!

By:  Tupaki Desk   |   4 Jan 2022 3:52 AM GMT
#గుస‌గుస‌.. ఫిబ్ర‌వ‌రి 10న టాలీవుడ్ పై మ‌రో పిడుగు!
X
టాలీవుడ్ కి గ‌డ్డుకాలం కొన‌సాగుతోంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ రూపంలో పెద్ద పిడుగు మీద ప‌డింది అనుకుంటే.. దాంతో పాటే ఏపీలో టికెట్ ధ‌ర‌ల ర‌గ‌డ అంత‌కుమించిన పెద్ద స‌మ‌స్య‌గా మారింది. స‌జావుగా ఏదీ సాగ‌డం లేద‌న్న ఆవేద‌న అన్ని వ‌ర్గాల్లోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.

సినిమా టికెట్ రేట్ల‌ను స‌వ‌రిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35తో సినీప‌రిశ్ర‌మ‌పై పెద్ద బాంబ్ ప‌డింది. ఈ జీవోని స‌మ‌ర్థించే ఒక వ‌ర్గం జ‌గ‌న్ వెంట న‌డుస్తుంటే.. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం కోర్టుల‌కు వెళ్లింది. అయితే స‌వ‌రించిన ధ‌ర‌లు స‌రికాద‌ని పాత ధ‌ర‌లు కొన‌సాగించుకోమ‌ని సింగిల్‌ జడ్జి ఉత్త‌ర్వులు ఇచ్చాక‌.. తిరిగి ఆ పంచాయితీ డివిజ‌న్ ఎంచ్ కు వెళ్లింది. అక్క‌డ ర‌క‌ర‌కాల మ‌లుపుల అనంత‌రం టికెట్ ధ‌ర‌ల అంశంపై జాయింట్ క‌లెక్టర్ ముందు ప్ర‌తిపాద‌న‌లు ఉంచాల‌ని కోర‌డం తెలిసిందే. అనంత‌రం ఒక క‌మిటీని వేసి దీనిపై ప‌రిశీలిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు క‌మిటీ వేసిన‌ట్టు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏజీ) ఎస్‌.శ్రీ‌రామ్ వెల్లడించారు. ఈ క‌మిటీ స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది.

అయితే అంతిమంగా టికెట్ ధ‌ర‌ల‌పై ఈ క‌మిటీ ఏదో ఒక‌టి తేల్చాల్సి ఉండ‌గా.. కీల‌క స‌మావేశాన్ని ఫిబ్ర‌వ‌రి 10 నాటికి వాయిదా వేసింది. ప్ర‌స్తుతానికి బంతి ఈ క‌మిటీ చేతిలోనే ఉంది. టికెట్ ధ‌ర‌ల్ని ఏ ప్రాతిపాదిక‌న నిర్ణ‌యించాలి అన్న‌ది క‌మిటీ పెద్ద‌లే తేల్చాల్సి ఉంటుంది. స్టార్ హీరోలు ద‌ర్శ‌కులు పారితోషికాలే బ‌డ్జెట్ లో 70శాతం ఉంటున్నాయి. అవి త‌గ్గించుకుంటే నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు త‌గ్గుతుంది. త‌క్కువ టికెట్ కే అప్పుడు జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించవ‌చ్చు! అంటూ ఏపీ ప్ర‌భుత్వం వాదిస్తోంది. కానీ దీనికి సినీప‌రిశ్ర‌మ పెద్ద‌లు స‌సేమిరా అంటున్నారు. ఈ వాదోప‌వాదాలు ఎలా ఉన్నా కానీ ఫిబ్ర‌వ‌రి 10 టెన్ష‌న్ ప‌రిశ్ర‌మ‌ను అలుముకుంది. ఇప్ప‌టి ధ‌ర‌ల‌తో థియేట‌ర్ల రంగం మ‌నుగ‌డ సాగించ‌డం క‌ష్టమ‌న్న వాద‌న బ‌లంగా ఉంది. పాత ధ‌ర‌ల‌నే తెస్తారా? లేక ఇప్ప‌టి స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు ధ‌ర‌ల్ని నిర్ణ‌యిస్తారా అన్న‌ది చూడాలి. థియేట‌ర్ల‌లో తినుబండారాలు కూల్ డ్రింక్స్ పార్కింగ్ ఫీజు ధ‌ర‌ల‌పైనా ఇదే స‌మావేశంలో క్లారిటీ వ‌చ్చే వీలుంది.