Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల‌పై ఫిల్మ్ ఛాంబ‌ర్ సెక్ర‌ట‌రీ సంచ‌ల‌న కామెంట్స్

By:  Tupaki Desk   |   26 July 2022 11:30 AM GMT
స్టార్ హీరోల‌పై ఫిల్మ్ ఛాంబ‌ర్ సెక్ర‌ట‌రీ సంచ‌ల‌న కామెంట్స్
X
స్టార్ హీరోలు మాత్ర‌మే బాగుప‌డ్డార‌ని, మిగ‌తా వాళ్లంతా మునిగిపోయారంటూ సంచ‌ల‌న కామెంట్ లు చేశారు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్‌ కామ‌ర్స్ సెక్ర‌ట‌రీ ముత్యా ర‌మేష్‌. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త కొంత కాలంగా క‌రోనా వ‌ల్ల షూటింగ్ లు ఆగిపోయి, నిర్మాణ వ్య‌యం పెరిగిపోయి నిర్మాత‌లు చాలా వ‌ర‌కు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఓటీటీల ప్ర‌భావం పెరిగిపోవ‌డంతో ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు రాని ప‌రిస్థితి. టికెట్ రేట్లు పెరిగిపోవ‌డం వ‌ల్ల సినిమా థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు.

బ‌డ్జెట్ లు త‌గ్గించుకుని సినిమాలు చేయాలంటే స్టార్ హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు రెమ్యున‌రేష‌న్ ల‌ని భారీగా పెంచేశారు. వాటిని అదుపు చేయ‌డం నిర్మాత‌ల‌కు భారంగా మారుతోంది. అంతే కాకుండా ఇత‌ర అన‌వ‌రం ఖ‌ర్చులు కూడా పెరిగిపోవ‌డంతో సినిమాల బ‌డ్జెట్ లు హ‌ద్దులు దాటేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజా స‌మ‌స్య‌ల‌న్నింటినీ ఓ కొలిక్కి తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌తో ప్రొడ్యూస‌ర్స్ ఆగ‌స్టు 1 నుంచి సినిమాల షూటింగ్ ల‌ని నిర‌వ‌ధికంగా బంద్ చేయాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చాయి.

దీనిపై సోమ‌వారం నిర్మాత‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర భేటీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఓటీటీ లో సినిమాల రిలీజ్ ల‌తో పాటు సినిమా టికెట్ ల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. అయితే చాలా మంది నిర్మాత‌లు మాత్రం ఓటీటీల్లో సినిమాల రిలీజ్ ల‌పై ఏకాభిప్రాయానికి రాలేద‌ని వార్త‌లు వినిపించాయి. దీంతో 27న మ‌రోసారి నిర్మాత‌ల మండ‌లి స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టింది.

ఈ నేప‌థ్యంలో ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సెక్ర‌ట‌రీ ముత్యాల ర‌మేష్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా స్టార్ హీరోల‌పై ఆయ‌న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఫేక్ క‌లెక్ష‌న్ ల వ‌ల్ల రెమ్యున‌రేష‌న్ లు పెంచుతూ కేవ‌లం స్టార్ హీరోలు మాత్ర‌మే హ్యాపీగా వున్నార‌న్నారు. వాటాదారులంతా బాధ‌ప‌డుతున్నార‌ని, థియేట‌ర్లు ఇంకా వున్నాయి కాబ‌ట్టి ఏదో ఒక వ్యాపారం చేయాల‌ని చేస్తున్నాం అన్నారు.

ఇండ‌స్ట్రీ స‌ర్వ‌నాశ‌నం అయింద‌ని, డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా త‌ప్పుడు క‌లెక్ష‌న్ లు ఇవ్వ‌డం ఆపాల‌ని ముత్యాల ర‌మేష్ మండిప‌డ్డారు. మ‌రి దీనిపై 27న జ‌ర‌గ‌నున్న మీటింగ్ లో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌నుందో వేచి చూడాల‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.