Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ఫిలింక్రిటిక్స్ 2.0 రీబూట్

By:  Tupaki Desk   |   26 May 2019 5:30 PM GMT
ట్రెండీ టాక్‌: ఫిలింక్రిటిక్స్ 2.0 రీబూట్
X
వందేళ్ల భార‌త‌దేశ సినిమా చ‌రిత్ర‌లో టాలీవుడ్ ప్రాతినిధ్యం 88 ఏళ్లు. అందులో 50ఏళ్లుగా ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ యాక్టివ్ గా ఉంది. అయితే ఇటీవ‌ల కొంత‌కాలంగా అత్యంత‌ కీల‌క‌మైన అసోసియేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంపైనా.. న‌వ‌త‌రం జ‌ర్న‌లిస్టుల్ని స‌భ్యులుగా చేర్చుకోక‌పోవ‌డంపైనా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ క్ర‌మంలోనే రెండేళ్ల కోసారి ఎల‌క్ష‌న్ నిర్వ‌హించేలా తాజాగా నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. తాజాగా ఫిలింక్రిటిక్స్ క‌మిటీ రీయాక్టివేష‌న్ చేయ‌డ‌మే గాక‌.. రీబూట్ చేసిన అసోసియేష‌న్ క‌మిటీ ని హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో ప్ర‌క‌టించారు.

50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా `సంతోషం` మ్యాగ‌జైన్ అధినేత‌.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సురేష్ కొండేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్- సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన సమావేశంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి- ప్రధాన కార్యదర్శిగా ఇ. జనార్ధన రెడ్డి- ఉపాధ్యక్షులుగా డి.జి. భవాని- సజ్జా వాసు- సంయుక్త కార్యదర్శులుగా మాడూరి మధు- పర్వతనేని రాంబాబు- కోశాధికారిగా ఎం.ఎన్. భూషణ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సాయి రమేష్- బత్తుల ప్రసాద్- నారాయణరావు- పి. హేమసుందర్- ఆర్.డి.ఎస్. ప్రకాష్- ముత్యాల సత్యనారాయణ- పి. మురళీకృష్ణ- రమేష్ చిన్నమూల- సునీతా చౌదరి- జిల్లా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ సభ్యులు లక్ష్మణరావు- ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు- ప్రభు ఈ ఎన్నికలను సమన్వయం చేశారు.

ఈ సంద‌ర్భంగా కొత్త అధ్య‌క్షుడు మాట్లాడుతూ రెండేళ్ల‌కోసారి ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. క్రిటిక్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా కృషిచేస్తామ‌ని.. తెలుగు సినిమా రంగంలో ఈ అసోసియేషన్ కు ఉన్న‌ ప్రాధాన్యం ఎనలేనిద‌ని అన్నారు. అసోసియేషన్ కు తన వంతు విరాళంగా లక్ష రూపాయలను ప్రకటించారు. సభ్యులకు ఇళ్ల స్థలాల సాధన- హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సమస్యలపై తమ కమిటీ తక్షణమే కార్యరంగంలోకి దిగుతుందని అన్నారు. ఇక తెలుగు సినిమా హిస్ట‌రీకి సంబంధించిన వ‌ర‌కూ అతిపెద్ద ఏకైక అసోసియేషన్ ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ అంటూ ఇటీవ‌ల వెబ్ టీవీ జ‌ర్న‌లిస్టుల‌కు చెందిన `న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేషన్` ప్రారంభోత్స‌వంలో ప్రెస్ అకాడెమీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ కీర్తించారంటే ఆ ఆసోసియేష‌న్ ప్రాధాన్య‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఫిలింక్రిటిక్స్ లో డివైడ్ ఫ్యాక్ట‌ర్ నేప‌థ్యంలో ఏర్ప‌డిన కొత్త అసోసియేష‌న్ `న్యూస్ కాస్ట‌ర్స్` ఆరంభ‌మే ఎంతో దూకుడుగా త‌మ ల‌క్ష్యాన్ని సాధించుకుంది. స‌భ్యుల‌కు హెల్త్ ఇన్సూరెన్సులు.. హెల్త్ కార్డులు స‌హా యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్సులు .. జీవ‌నోపాధి త‌దిత‌ర విష‌యాల్లో భ‌రోసాని క‌ల్పించింది. ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల నుంచి ల‌క్ష‌ల్లో డొనేష‌న్ల‌ను సాధించింది. తాజాగా రీబూట్ అయిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ అదే త‌ర‌హాలో సేవ‌లందిస్తారా? అంత యాక్టివ్ గా ప‌నులు చేస్తారా? అన్న చ‌ర్చా మొద‌లైంది. 50 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన క్రిటిక్స్ అసోసియేష‌న్ కి.. కొత్త అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు.. క‌మిటీ స‌భ్యులంద‌రికీ ``శుభాకాంక్ష‌లు`` చెబుతూ విషెస్ వెల్లువెత్తాయి. టాలీవుడ్ లో ప్ర‌త్య‌క్షంగా 150 మంది జ‌ర్న‌లిస్టులు ఉండ‌గా.. ప‌రోక్షంగా మ‌రో 200 మంది డెస్కుల్లో నిరంత‌రం ప‌ని చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే.