Begin typing your search above and press return to search.

త‌డ‌- తిరుప‌తిలో ఫిలింహ‌బ్ ప్లాన్?

By:  Tupaki Desk   |   20 May 2019 10:00 AM GMT
త‌డ‌- తిరుప‌తిలో ఫిలింహ‌బ్ ప్లాన్?
X
ఏపీ - తెలంగాణ డివైడ్ త‌ర్వాత కొత్త ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. మైద‌రాబాద్ ఇండ‌స్ట్రీకి ప్యార‌ల‌ల్ గా మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేయాల‌న్న ప్ర‌తిపాద‌న తెర‌పైకొచ్చింది. ఆ క్ర‌మంలోనే ఏపీలో కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు ఎక్క‌డ అనుకూలం? అంటూ ఆరాలు తీశారు. కొంద‌రు రాజ‌ధాని ఎక్క‌డ ఉంటే అక్క‌డే ప‌రిశ్ర‌మ ఉంటుంద‌ని.. అమ‌రావ‌తిలోనే ఏర్పాటు చేసే వీలుంద‌ని అన్నారు. ఆ టైమ్ లోనే ప‌లువురు సినీపెద్ద‌లు నెల్లూరు -త‌డ ఏరియాలో ప‌రిశ్ర‌మ ఏర్పాటు ఆలోచ‌న చేశార‌ని.. లేదు లేదు... బీచ్ సొగ‌సుల‌ వైజాగ్ లో అందుకు అనుకూలం అని అక్క‌డ‌నే కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది.

ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల ప‌రిణామాలు. మొద‌టిసారి ఏపీలో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ నంది అవార్డుల్ని ప్ర‌క‌టించిన‌ప్పుడు ఈ వేడుక‌ల పేరుతో త‌న‌ని క‌లిసిన‌ సినీపెద్ద‌లంద‌రికీ బాహాటంగానే ఏపీలో సినీప‌రిశ్ర‌మ ఏర్పాటుకు బాట‌లు వేస్తున్నామ‌ని అందుకు ప్ర‌భుత్వం నుంచి అన్నిర‌కాలుగా స‌హ‌క‌రిస్తుంద‌ని సీఎం చంద్ర‌ బాబు హామీ ఇచ్చేశార‌ని అన్నారు. ఆ త‌ర్వాత ఏపీ సినీ-టీవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌ డీసీ) అధ్య‌క్షుడిగా అంబికా కృష్ణ‌ను ప్ర‌క‌టించి కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయ‌మ‌ని ఏపీ ప్ర‌భుత్వం కోరింది. అనంత‌రం ఉగాది సెల‌బ్రేష‌న్స్ పేరుతో ల‌ఘు చిత్రాల పోటీని ఏర్పాటు చేసి అంబికా స‌మ‌క్షంలో విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అందించారు. ఏపీలో సినిమాల షూటింగుల అనుమ‌తులు స‌హా చిన్న సినిమాల‌కు బోన‌స్ లు ప్ర‌క‌టించింది ఏపీఎఫ్‌ డీసీ. స్థానికంగా సినిమాలు తీసే నిర్మాత‌ల‌కు చాలా విష‌యాల్లో ఏపీఎఫ్‌ డీసీ స‌హ‌కారం అందించింది.

ఆ త‌ర్వాత కాలంలో వైజాగ్ లో భారీగా సినీస్టూడియోల ఏర్పాటున‌కు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ‌- ప్ర‌యివేటు భాగ‌స్వామ్యంతో వీటి ఏర్పాటు ఉంటుంద‌ని ఏపీఎఫ్‌డీసీ త‌ర‌పున అధికారికంగా తెలుగు సినీమీడియాకి ప్రెస్ నోట్లు అందాయి. కానీ ఏం ఉప‌యోగం? ఇప్ప‌టికీ అందుకు సంబంధించిన ఎలాంటి క‌ద‌లికా లేదు. ప్ర‌త్యేక‌ ఏపీ ఏర్ప‌డ్డాక `హోదా` ద‌క్క‌కుండానే రెండో ద‌ఫా ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. తాజాగా మే 23న ఎన్నిక‌ల‌ ఫలితం తేల‌నుంది కాబ‌ట్టి మ‌రోసారి సినీస‌ర్కిల్స్ లో ఏపీ ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈసారైనా కొత్త ఇండ‌స్ట్రీని ఏర్పాటు చేస్తారా? లేదంటే ప్ర‌తియేటా 2500 కోట్ల ప‌న్ను టాలీవుడ్ నుంచి ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరాల్సి ఉండ‌గా ఆ మొత్తాన్ని ఏపీ న‌ష్ట‌పోతూనే ఉంది క‌దా! అని ఓ పెద్దాయ‌న ప్ర‌శ్నించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అంతేకాదు ఒక‌వేళ సినీప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తే ఎక్క‌డ ఏర్పాటు చేస్తారు? అన్న దానికి బెజ‌వాడ‌లో ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కం ఆర్టిస్టు ఇచ్చిన ఇన్ఫో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నెల్లూరు- త‌డ‌... తిరుప‌తి మ‌ధ్య కొత్త సినిమా జోన్.. ఫిలింహ‌బ్ ఏర్పాటు చేస్తే బావుంటుంద‌న్న ప్ర‌తిపాద‌న ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంద‌ని చెబుతున్నారు. ఏపీ ఎఫ్‌ డీసీ అధ్య‌క్షుడు అంబికా కృష్ణ ఆలోచ‌న అటువైపే సాగుతోంద‌ని నెల్లూరు-త‌డ ప‌రిస‌రాల్లో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ ఉంటే బావుంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకు ఓ ఆస‌క్తిక‌ర కార‌ణాన్ని విశ్లేషించారు. నెల్లూరు ఏరియాలో అంబికా కృష్ణ‌తో పాటు ప‌లువురు తేదేపా నాయ‌కుల‌కు భూములు ఎక్కువ‌గా ఉన్నాయి. అందుకే ఈ ఆలోచ‌న చేశార‌న్న వాద‌నా వినిపిస్తోంది.

త‌డ ఏ కోణంలో అనుకూలం? అని ప్ర‌శ్నిస్తే... త‌డ - శ్రీ‌సిటీ ప‌రిస‌రాల్లో సినీప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాల‌ని డి.సురేష్ బాబు లాంటి పెద్ద‌లు అప్ప‌ట్లో అన్నారు. చెన్న‌య్ కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండే ఈ చోటు సినిమాల నిర్మాణం స‌హా అన్నిటికీ అనుకూల‌మ‌ని అన్నారు. డ్యాన్స‌ర్లు.. ఫైట‌ర్లు ఇప్ప‌టికీ చెన్న‌య్ నుంచే వ‌స్తున్నారు. అంద‌రికీ జ‌ర్నీ ప‌రంగా సౌక‌ర్యంగా ఉంటుంద‌ని తెలిపారు. ఆయ‌నే మ‌రో కోణంలో విశ్లేషిస్తూ వైజాగ్ కి స్కోప్ ఉంద‌ని అక్క‌డ రామానాయుడు స్టూడియోస్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల చాలా షూటింగుల‌కు అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వైజాగ్ -అర‌కు బెల్ట్ షూటింగుల‌కు అనుకూలం. అత్య‌ధిక లొకేష‌న్లు అందుబాటులో ఉండే ఈ చోట ఇప్ప‌టికే 80శాతం షూటింగులు జ‌రుగుతున్నాయి. అక్క‌డ ప‌రిశ్ర‌మ ఏర్పాటు క‌లిసొస్తుంద‌ని అన్నారు. అయితే వైజాగ్ టాలీవుడ్ అని ప్ర‌క‌టించినా క‌ద‌లికే లేక‌పోవ‌డం వెన‌క కార‌ణాలెన్నో ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఏది చెప్పాల‌న్నా.. మే 23 రిజ‌ల్ట్ త‌ర్వాతనే. గెలుస్తామ‌ని బాబు ధీమాగా ఉన్నారు. అస‌లేం జ‌రుగుతోంది? మొన్న ఎన్నిక‌ల మేనిఫెస్టోల్లో అస‌లు కొత్త సినీప‌రిశ్ర‌మ గురించిన ప్ర‌స్థావ‌నే లేదు. ఏ పార్టీ అస‌లు కొత్త టాలీవుడ్ ఏర్పాటును ప‌ట్టించుకోలేదు. మే 23 రిజ‌ల్ట్ త‌ర్వాత ఎవ‌రు సీఎం అయినా ఇత‌ర రంగాల్లానే సినీరంగాన్ని గుర్తించి... కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి మాట్లాడ‌తారేమో చూడాలి.