Begin typing your search above and press return to search.

పవన్ విషయంలో చిత్రపరిశ్రమ చేయకూడని తప్పులు చేస్తుందా?

By:  Tupaki Desk   |   27 Feb 2022 5:00 PM IST
పవన్ విషయంలో చిత్రపరిశ్రమ చేయకూడని తప్పులు చేస్తుందా?
X
పెద్ద పోరు జరుగుతున్నప్పుడు.. మధ్యలో మనకెందుకు? అనుకోవటం తప్పేం కాదు. ఎందుకంటే.. లేని రచ్చల్లోకి పోయి ఉన్న టెన్షన్లు సరిపోక.. కొత్తవి తెచ్చుకోవాల్సిన ఖర్మేంటని ఫీల్ కావటాన్ని తప్పు పట్టలేం. ఎందుకంటే.. పేరు ప్రఖ్యాతులకు.. ఆస్తిపాస్తులకు కొదవ లేనప్పుడు.. ఉన్న వ్యాపారాలను రాజకీయాల కోసం తగలెట్టుకోవటం ఏ మాత్రం సరైన తీరు కాదన్న వాదనను తెలివితేటలు తమకు మాత్రమే సొంతమనే కొందరు భావిస్తుంటారు.

ఇలాంటి వారిని అవకాశవాదులుగా కూడా పలువురు అభివర్ణిస్తుంటారు. తాజాగా పవన్ కల్యాన్ ఎపిసోడ్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా ఇదే ధోరణిని అనుసరిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు తప్పని తెలిసినా.. తమకు అన్యాయం జరుగుతుందని భావించినా నోరెత్తి మాట్లాడే ధైర్యం చేయని తీరు చూస్తే.. రీల్ లో చెలరేగిపోయి హీరోయిజాన్ని టన్నుల కొద్దీ పండించే నటులంతా రియల్ లైఫ్ లో ఎంత బలహీనులన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

నిజమే.. జగన్మోహన్ రెడ్డి లాంటి పవర్ ఫుల్ ముఖ్యమంత్రిని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. అలా అని.. ఎంత జరుగుతున్నా పట్టనట్లు ఉండటం సరికాదు కూడా.

దీనివల్ల ఇప్పటికిప్పుడు ముప్పు వాటిల్లకపోవచ్చు. కానీ.. కాల క్రమంలో ఇలాంటి పరిస్థితే తమకు ఎదురైతే.. తమ పక్షాన మాట్లాడేందుకు ఎవరూ రారు కదా? అన్న చిన్న లాజిక్ ను చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎందుకు మిస్ అవుతున్నట్లు? చరిత్రలోకి వెళితే.. భారత్ విషయంలో ఉక్రెయిన్ అనుసరించే విధానాలు గురించి ఇప్పుడు తెలుసుకుంటే ఒళ్లు మండక మానదు.

కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్ లోనూ భారత్ పక్షాన కాకుండా.. పాకిస్తాన్ వాదనకు అనుకూలంగా ఓటేసిన ఉక్రెయిన్ తాజా పరిస్థితి ఏమిటి?

ఉక్రెయిన్ మీద సైనిక దాడి షురూ చేసిన రష్యా దెబ్బకు బెంబెలెత్తిపోతున్న ఆ దేశం ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు ఉన్న దారుల్ని వెతుకుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేయటం.. సాయం కోసం అభ్యర్థించటం చూసినప్పుడు..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా చేస్తుంది.

తమ వరకు వచ్చేసరికి సాయం చేయాలని భారత్ ను అర్థిస్తున్న ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు.. ఇప్పటివరకు భారత్ ప్రయోజనాలకు తామెప్పుడు మద్దతు ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

కట్ చేస్తే.. ఈ రోజున పవన్ మీద కోపంతో ఏపీ సర్కారు ఆయన్ను.. ఆయన సినిమాల విషయంలో వేధింపులకు గురి చేస్తున్న తీరు తమకు ఏ మాత్రం సంబంధం లేనిదిగా పలువురు అనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రతికూలతను ఎదుర్కొంటున్న పవన్ కు పోయేదేమీ లేదు.

ఇంతకంటే ముంచుకొచ్చే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అంటే మిగిలిన టాలీవుడ్ ప్రముఖులకే. ఎందుకంటే.. జగన్ సర్కారు కత్తి.. ఇప్పటికే పవన్ చిత్రాలు పడటం.. ఆదాయం దెబ్బ పడటం తెలిసిందే. దీన్ని ఎదుర్కొంటున్న ఆయన.. కొత్తగా పోయేదేమీ లేదు.

ఇప్పుడు అసలుసిసలు టెన్షన్ మొత్తం మిగిలిన చిత్ర పరిశ్రమకు మాత్రమే ఉంది. ఎందుకంటే.. వారంతా సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నంలో పవన్ ను పట్టించుకోవటం.. ఆయనకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎవరు నైతిక మద్దతును ఇచ్చినట్లుగా కూడా లేదు. ఇలాంటి వేళలో.. వారంతా మర్చిపోతున్న విషయం మరొకటి ఉంది.

ఇవాళ పవన్ కు వచ్చిన నష్టం రేపొద్దున ఇంకొందరికి రాకుండా పోదు. ఆ రోజు.. ఇప్పుడు ఎలా అయితే ఉక్రెయిన్ భారత్ ను సాయం కోసం ఆర్థిస్తుందో.. ఆ రోజున పవన్ ను సాయం అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అదే జరిగినప్పుడు పవన్ మంచితనం లాంటి మాటల్ని పట్టించుకోకుండా సరైన పాఠం నేర్పించాల్సి ఉంటుంది.

అయితే.. పవన్ కు ఇలాంటివి బొత్తిగా ఇష్టం ఉండదు కావట్టి.. కష్టంలో ఉన్నామని నాలుగు గోడల మధ్య ప్రాధేయపడితే సరిపోతుందని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అనుకోవచ్చు.

కానీ.. తనకు తగిలిన దెబ్బల్ని పవన్ అంత త్వరగా మర్చిపోతారా? అదే జరిగితే.. ఇప్పుడు పరీక్షల్ని పవన్ ఎదుర్కోవచ్చు. రాబోయే కాలమంతా పరీక్షలకు సిద్ధం కావాల్సిన వారు క్యూలో నిలుచోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది.