Begin typing your search above and press return to search.

ఈ ఫిలిం సిటీ బ్రాండింగ్ ఏంటి బాబోయ్..

By:  Tupaki Desk   |   19 May 2016 3:30 PM GMT
ఈ ఫిలిం సిటీ బ్రాండింగ్ ఏంటి బాబోయ్..
X
రామోజీ ఫిలిం సిటీ.. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియోగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన ఘనత దీని సొంతం. సినిమా షూటింగులకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో.. మనదేశంలోనే మరెక్కడా లేని సదుపాయాలు ఫిలిం సిటీ సొంతం. ఈ సంగతి మన టాలీవుడ్ కే కాదు.. మిగతా ఇండస్ట్రీల వాళ్లకు కూడా బాగానే తెలుసు. ఇప్పుడు కొత్తగా ఫిలిం సిటీ గొప్పదనం గురించి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. సామాన్య జనాలకు దీని గురించి పదే పదే గుర్తు చేయాల్సిన పని లేదు. అయినప్పటికీ ఫిలిం సిటీ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ఏమాత్రం తగ్గదు ఆ గ్రూప్.

‘ఈనాడు’ పత్రికకు ఎవరైనా ప్రముఖులు ఇంటర్వ్యూ ఇచ్చారంటే చాలు.. వాళ్లు కచ్చితంగా ఫిలిం సిటీ గొప్పదనం గురించి చెప్పి తీరాల్సిందే అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. ఫిలిం సిటీలో తమ సినిమా షూటింగ్ చేసి ఉంటే.. వాళ్లు కచ్చితంగా ‘ఫిలిం సిటీ గురించి మీ అభిప్రాయమేంటి’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఆ ప్రశ్న ఇంటర్వ్యూలో ప్రముఖంగా ఓ బాక్సులో పబ్లిష్ కావాల్సిందే. ఆల్రెడీ ‘బాహుబలి’ విడుదల సమయంలో ప్రచురితమైన ప్రతి ఇంటర్వ్యూలోనూ ఫిలిం సిటీ ప్రత్యేకతల గురించి చాలా చదివారు పాఠకులు. మధ్యలో మరెన్నో ఇంటర్వ్యూల్లో దీని ప్రస్తావన వచ్చింది.

తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించి ఈ బ్రాండ్ ప్రమోషన్ బాగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఫిలిం సిటీలో 15 సెట్టింగ్స్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి. ఈ సెట్టింగుల గురించి ఒకరోజు అరపేజీ కేటాయించారు ఈనాడు పత్రికలో. తాజాగా పీవీపీ.. శ్రీకాంత్ అడ్డాల ఇంటర్వ్యూలు వేశారు. వాటిలోనూ ఫిలిం సిటీ విశేషాల గురించి ప్రశ్నలున్నాయి. రామోజీ గ్రూప్ తాపత్రయమేంటో కానీ.. జనాలకు మాత్రం ప్రతిసారీ ఈ ఫిలిం సిటీ బాకా ఏంటి బాబోయ్ అని విసుగొస్తోంది. అయినా ఈ బ్రాండ్ ప్రమోషన్ ఆపే ఉద్దేశాలేమీ రామోజీ గ్రూప్ కు ఉన్నట్లు లేవు.