Begin typing your search above and press return to search.

బంద్ కి చెక్! ఆగ‌స్టు ఊపుకు సెప్టెంబ‌ర్ ఊపు కంటిన్యూ!

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:19 AM GMT
బంద్ కి చెక్! ఆగ‌స్టు ఊపుకు సెప్టెంబ‌ర్ ఊపు కంటిన్యూ!
X
గ‌డిచిన నెల‌రోజులుగా షూటింగుల బంద్ తో సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయిన సంగతి తెలిసిందే. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్- ఫిల్మ్ ఛాంబర్ - ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షూటింగ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ స‌మ‌యంలో సినీప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై నిర్మాత‌లు ఇత‌ర సెక్టార్ల‌తో క‌లిసి సుదీర్ఘంగా చ‌ర్చించారు.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ర‌క‌ర‌కాల మార్గాల‌ను అన్వేషించారు. ఎట్ట‌కేల‌కు బంద్ ముగియ‌నుంద‌ని ప్ర‌క‌టించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వివిధ రంగాలకు భారీ ఊరట కలిగించే విధంగా సెప్టెంబర్ ఒక‌టి నుండి సినిమా షూటింగ్ లు పూర్తి స్థాయిలో పునఃప్రారంభమవుతాయని నిర్మాతల మండలి - ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించాయి.

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొనసాగుతున్న సమస్యల పరిశీలనకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ.. తొంబై శాతం సమస్యలకు పరిష్కారం లభించిందని ప్రకటించింది. మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని నిర్మాతలు తెలిపారు. ఆగస్ట్ 25 నుంచి నిర్మాతల మండలి అనుమతితో ప్యాచ్ వర్క్స్ .. ఫారిన్ షూటింగ్ షెడ్యూల్స్ ప్రారంభించేందుకు అనుమతి ఉంది. మరో దఫా చర్చలు జరిపి పూర్తి వివరాలను ఆగస్టు 30న తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.

నిర్మాత‌లు వ‌ర్సెస్ కార్మికులు..!

నిజానికి నిర్మాత‌ల గిల్డ్ బంద్ పిలుపున‌కు ముందే కార్మికుల స‌మాఖ్య బంద్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌మ భ‌త్యాల‌ను పెంచాల‌ని పెరిగిన ధ‌ర‌ల‌తో ఆర్థిక భారం కుటుంబ స‌మ‌స్య‌గా మారింద‌ని కార్మికులంతా నివేదించారు. కానీ దీనికి నిర్మాత‌లు విభేధించారు.

కాస్ట్ కంట్రోల్ లేక‌పోవ‌డం వ‌ల్ల ప్రొడ‌క్ష‌న్ అతి భారంగా మారింద‌ని నిర్మాత‌లు త‌మ‌వైపు నుంచి స‌మ‌స్య‌ల‌ను నివేదించారు. అంతేకాదు.. అదుపు త‌ప్పిన ప‌రిస్థితుల‌ను దారికి తెచ్చేందుకు నిర్మాత‌లే బంద్ ని ప్ర‌క‌టించ‌డంతో నెల‌రోజుల పాటు షూటింగుల‌కు ప్ర‌తిష్ఠంభ‌న కొన‌సాగింది.

కార్మికుల‌తో నిర్మాత‌ల‌కు చాలా ఏళ్లుగా ఈ స‌మ‌స్య అలానే అప‌రిష్కృతంగా ఉంది. ప్ర‌తిసారీ కార్మిక స‌మాఖ్య (ఫెడ‌రేష‌న్) బంద్ కి దిగుతూనే ఉంది. కానీ వారి స‌మ‌స్య అప‌రిష్కృతంగానే మిగిలిపోతోంది. ఇక నిర్మాత‌ల వైపు నుంచి ఆలోచిస్తే వారికి ఉన్న వెత‌లు అన్నీ ఇన్నీ కావ‌ని విశ్లేషిస్తున్నారు. హిట్స్ తో ఆగ‌స్టుకి ఊపొచ్చింది.. షూట్స్ తో సెప్టెంబ‌ర్ కి ఊపు తెస్తార‌నే ఆశిద్దాం. ఆగ‌స్టులో వ‌చ్చిన బింబిసార‌- సీతారామం - కార్తికేయ 2 పెద్ద హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే.