Begin typing your search above and press return to search.

ఆ నింద అవసరమా జగన్... ?

By:  Tupaki Desk   |   26 Nov 2021 1:30 AM GMT
ఆ నింద అవసరమా జగన్... ?
X
కరోనా అనంతర పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, భారతీయ సినీ రంగమే పెను సంక్షోభంలో ఉంది. దాని కంటే ముందు చూస్తే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల సినిమా థియేటర్ కి ఉన్న సీక్రెసీ, ఆ బ్యూటీ, ఆ ఎంజాయ్ అన్నది మటు మాయం అయింది. చేతిలో స్మార్ట్ ఫోనే ఒక సినిమా హాలుగా మారిన నేపధ్యం ఉంది. దాంతో సమస్త కష్టాలూ సినిమా రంగం అనుభవిస్తోంది. ఇక టాలీవుడ్ సీన్ ఎలా ఉందీ అంటే అటు బాలీవుడ్ కి ఉన్న పాన్ ఇండిలా లెవెల్ కి ఎదగలేక ఇటు ప్రాంతీయ స్థాయిలో స్క్రీన్ ని పంచుకుని మనుగడ సాగించలేక సతమతం అవుతోంది. కరోనా వచ్చి మొత్తం పరిస్థితిని తారు మారు చేసింది. ఓటీటీలదే రేపటి యుగం అని అంతా భయపడుతూ చెబుతున్న జోస్యం.

ఈ నేపధ్యంలో సినీ పరిశ్రమ మునుపటి కళను కట్టడం అంటే ఇపుడున్న స్థితిలో అసాధ్యమే. అలా పరిశ్రమ దాని బాధ ఏదో అది పడుతోంది. ఈ టై, లో ప్రభుత్వాలు చేస్తే చేతనైన సాయం చేయాలి, లేకపోతే అలా చూడనట్లుగా వదిలేయాలి తప్ప సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తున్నట్లుగా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. ఆన్ లైన్ టికెటింగ్ విధానం మంచిదే అని అంతా బయటకు చెబుతున్నా ఎవరి భయాలు వారికి ఉన్నాయి. ఇక దీని వల్ల మంచి జరుగుతుందా లేక మరోలా మారుతుందా అంటే ఎవరూ చెప్పలేరు.

అయినా సరే ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ తెచ్చింది. సరే అది పారదర్శకం అని అనుకున్నా బెనిఫిట్ షోలను రద్దు చేసి నాలుగు ఆటలే ఆడించాలని నిబంధలను తెచ్చింది. ఇక్కడే టాలీవుడ్ ని కెలికినట్లుగా ఉంది అంటున్నారు. బెనిఫిట్ షోలు వేసినా అవి కేవలం స్టార్ హీరోల సినిమాలకే పరిమితం. ఆయా హీరోల మీద మోజు ఉంటేనే వేయి రెండు వేల రూపాయలు పెట్టినా టికెట్లు తెగుతాయి. మరి అది ఫ్యాన్స్ కి స్టార్ హీరో కి మధ్య ఉన్న ప్రేమాభిమానాలకు సంబంధించినది. ఇందులో దోపిడీ అని ప్రభుత్వం అంటోంది. కానీ తాము వాలంటరీగా ఎక్కువ ధర పెట్టి తమ హీరో ఇమేజ్ కోసం ఇదంతా చేస్తున్నామని ఫ్యాన్స్ అంటారు. ఇక ఈ డబ్బు ఎక్కడికి పోతోంది అంటే దాని మీద చెకింగ్ ఉంచుకుంటే సరిపోతుంది.

కానీ మొత్తం బెనిఫిట్ షోలను రద్దు చేయడం వల్ల పెద్ద సినిమాల మనుగడను ప్రశ్నార్ధకం చేయడం దారుణం అన్న విమర్శలు వస్తున్నాయి. ఇపుడున్న స్థితిలో ఒక సినిమా గట్టిగా అడితే వారం పది రోజులు మాత్రమే థియేటర్లో ఆడుతుంది. నెల రోజులలో అది ఓటీటీకి వస్తే మరో నెలలో టీవీల్లో వస్తుంది. ఇక పైరసీ భూతం పుణ్యమాని ఉదయం ఆటతోనే సినిమా మొత్తం బయటకు వచ్చేస్తోంది. ఇలా ఏ మాత్రం గుట్టు లేకుండా సినిమా అన్ని రకాలుగా బట్టబయలు అవుతున్న దుస్థితి ఉంది. అలాంటి దానికి కొన్ని రోజులు బెనిఫిట్ షోలు వేసుకుని మేకర్స్ తమ సొమ్ముని వెనక్కు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్పేముంది అన్న వాదన కూడా ఉంది.

ఇక ఆన్ లైన్ టికెటింగ్ పెట్టినా థియేటర్ల వద్ద జరిగే బ్లాక్ మెయిలింగ్ ని ఎవరూ ఆపలేరు కదా అన్న చర్చ కూడా వస్తోంది. మరి దేని కోసం ఇదంతా చేయడం అన్న ప్రశ్న వస్తోంది. టికెట్ ధరలను బీ, సీ సెంటర్లతో పాటు వీలైన చోట్ల పెంచాలని సినీ రంగం కోరుతోంది. మరి ఆ డిమాండ్ పక్కన పెట్టేసి ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏదీ లేకపోగా లేనిపోని నిందలు వేసుకున్నట్లు అవుతుంది అంటున్నారు. సినిమా అన్నది చితికిపోయి ఉంది. మహా అయితే మరి కొద్ది ఏళ్ళు మాత్రమే ఆ మ్యాజిక్ సాగనుంది. ఆ మీదట సినిమాకు పూర్తి ఇబ్బందులు వస్తాయి. అలాటపుడు సినిమా ఫలానా ప్రభుత్వం వల్లనే ఇబ్బందులు పడుతోంది అన్న నిందలు తెచ్చుకోవడం అవసరమా జగన్ అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా సినీ రంగానికి పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి కోరినట్లుగా టికెట్ల రేట్లను పెంచే విషయంలో ఆలోచించడంతో పాటు సినీ పెద్దలతో సుహృద్భావ వైఖరి అవలంబించడం వైసీపీ సర్కార్ కే మంచిది అన్న సూచనలు అందుతున్నాయి.