Begin typing your search above and press return to search.

24 శాఖ‌ల మెరుపు స‌మ్మె.. నిర్మాత‌లూ త‌గ్గేదే లే!

By:  Tupaki Desk   |   21 Jun 2022 3:26 PM GMT
24 శాఖ‌ల మెరుపు స‌మ్మె.. నిర్మాత‌లూ త‌గ్గేదే లే!
X
`పుష్ప` ఏ ముహూర్తాన త‌గ్గేదేలే! అంటూ డైలాగ్ చెప్పాడో కానీ ఈ డైలాగ్ అన్ని సంద‌ర్భాల‌కు ప‌ర్ఫెక్ట్ గా అతుకుతోంది. ఓ వైపు రోజువారీ భ‌త్యాలు పెంచాలంటూ 24 శాఖ‌ల కార్మికులు (ఫెడ‌రేష‌న్) ఆక‌స్మిక‌ బంద్ కి దిగుతుంటే మ‌రోవైపు ఎవ‌రు ఎలాంటి స్ట్రైక్ లు చేసినా త‌గ్గేదేలే ! అంటూ నిర్మాత‌లు కూడా భీష్మించుకుని కూచుంటున్నార‌ని తెలిసింది. రేప‌టి (ఈ బుధ‌వారం) నుంచి షూటింగుల నిర‌వ‌ధిక బంద్ కి ఫెడ‌రేష‌న్ పిలుపునిచ్చింది. 2018 లో బంద్ కంటే తీవ్ర‌మైన నిర్ణ‌యం ఇప్పుడు తీసుకోవ‌డంతో కార్మికులు త‌గ్గేదేలే అని ఫిక్స‌యిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది.

అయితే  నువ్వా నేనా? అంటూ ఇప్పుడు నిర్మాత‌లు కూడా త‌గ్గేదే లే! అంటున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కుముందే నిర్మాత‌ల గిల్డ్ పెద్ద‌లంతా ఛాంబ‌ర్ లో స‌మావేశ‌మై దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిసింది. ఒక‌వేళ కార్మిక బంద్ కొన‌సాగితే ఇంత‌కుముందు లానే చెన్నై వెళ్లి అక్క‌డి నుంచి కార్మికుల‌ను ర‌ప్పించేందుకు కూడా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే సినీప‌రిశ్ర‌మ ప‌రిస్థితి బాలేదు.

నిర్మాత‌కు ఆర్థిక భారం పెరిగింది. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇలాంట‌ప్పుడు ఇలా కార్మికులు బంద్ చేయ‌డం స‌రికాద‌నే అభిప్రాయం గిల్డ్ స‌భ‌లో వ్య‌క్త‌మైంది. భ‌త్యాల పెంపు అంటే ఆర్థికంగా నిర్మాత‌పై పెను భారం ప‌డుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే వారు త‌గ్గ‌క‌పోతే మేం కూడా త‌గ్గేదేలే అంటున్న‌ట్టు తెలిసింది. స్ట్రైక్ కి వెళితే వెళ్ల‌నివ్.. వెన‌క్కి త‌గ్గేదేలే! అన్న‌ట్టు వెల్ల‌డైంది.

ఈ బంద్ వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం? అంటే .. అంద‌రికీ న‌ష్ట‌మే. ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డం వ‌ల్ల ముప్పు పెద్ద‌గానే ఉంటుంద‌ని అంచ‌నా. కార్మికుల‌కు తిండి ఉండ‌దు.. నిర్మాత‌ల‌కు ప‌ని ఉండ‌దు. అద‌న‌పు  వ్య‌యం త‌ప్ప‌దు. ఇక తెలుగు సినిమాల సంగ‌తేమో కానీ.. హైద‌రాబాద్ ని న‌మ్ముకుని తన భారీ సినిమా షూటింగు చేస్తున్న సల్మాన్ ఖాన్ కి బిగ్ పంచ్ ప‌డ‌నుంద‌ని చెబుతున్నారు.

మూవీ షూటింగ్ ని అర్థాంత‌రంగా ఆపేయాల్సి ఉంటుంద‌నేది ఫిలింన‌గ‌ర్ టాక్. స‌ల్మాన్ భాయ్ సెట్స్ లో రోజుకు 2000 నుంచి 3000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు డ్యాన్స‌ర్లు హైద‌రాబాద్ లో షూటింగులో పాల్గొంటున్నారు. వీళ్లంద‌రికీ కూడా పంచ్ ప‌డిపోతుంది. అయితే ఎవ‌రూ త‌గ్గేదేలే అంటూ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. స‌మ‌స్య తీవ్రత‌ర‌మ‌వుతోందే కానీ త‌గ్గేట్టు లేదు.

ఇక నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉండి రిలీజ్ కి రెడీగా ఉన్న‌వాటి ప‌రిస్థితేంటి? అంటే.. చాలా మంది చెన్నైకి వెళ్లి ఈ ప‌నుల‌న్నీ కానిచ్చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. కొంద‌రు నిర్మాణానంత‌ర ప‌నుల‌లో పెండింగ్ ల‌ను ఇవాళే పూర్తి చేసేయాడానికి గ‌ట్టిగా ల్యాబుల్లో  శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికి గోపిచంద్ న‌టించిన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` వ‌ర‌కూ సేఫ్. ఇత‌రులు అంతా చెన్నైకి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. నాగ‌చైత‌న్య థాంక్యూ స‌హా ఇత‌రుల‌కు ఇబ్బందేన‌ని.. నిర్మాత‌ల‌కు ఆ మేర‌కు అద‌న‌పు భారం త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు.