Begin typing your search above and press return to search.

ఇలా ఐతే జనాలు థియేటర్లకు ఎందుకొస్తారు..!

By:  Tupaki Desk   |   12 Nov 2022 10:30 AM GMT
ఇలా ఐతే జనాలు థియేటర్లకు ఎందుకొస్తారు..!
X
పాండమిక్ తర్వాత జనాలను థియేటర్లకు రప్పించడం ఫిలిం మేకర్స్ కు సవాలుగా మారిపోయింది. సరికొత్త కంటెంట్ తో పాటుగా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు - విజువల్ గ్రాండియర్స్ ను చూస్తున్నారు. అది కూడా ప్రమోషనల్ కంటెంట్ తో వారిని ఎగ్జైట్ చేస్తేనే.. సినిమా హాళ్లలో చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

ఓటీటీలలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ కు అలవాటు పడిపోయిన ప్రేక్షకులు.. అంతకుమించి ఏదైనా అదిరిపోయే కంటెంట్ ను చూపిస్తున్నామని హామీ ఇస్తేనే థియేటర్ వరకూ వస్తున్నారు. మిగతా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల తిరక్కండానే ఓటీటీలోకి వచ్చేస్తుండంతో.. ఇంట్లోనే హోమ్ స్క్రీన్ లో చూడొచ్చనే దోరణిలో ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ పెద్దలు ఆ మధ్య షూటింగ్స్ అన్నీ బంద్ చేసి మరీ చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓటీటీ కారణంగా థియేటర్ వ్యవస్థ మీదే ప్రభావం పడే ప్రమాదం ఉందంటూ.. సినిమా రిలీజైన 50 రోజులు తరువాత కానీ డిజిటల్ స్ట్రీమింగ్ చేయకూడదని షరతు విధించారు.

ఇకపై రిలీజైన 8 వారాల తరవాతే ఓటీటీలోకి వస్తుందని భావించగా.. రియాలిటీలో మాత్రం అది జరగలేదు. ఇంతకముందన్నా కనీసం నాలుగు వారాలకు డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేవి. కానీ ఇప్పుడు మూడు వారాలకు ముందే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. చిన్న సినిమాలే కాదు.. మీడియం రేంజ్ చిత్రాలు - పెద్ద హీరోల సినిమాలు కూడా ఎర్లీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

దసరా సందర్భంగా విడుదలైన సితారవారి 'స్వాతిముత్యం' సినిమా మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ అయింది. అలానే అదే సీజన్ లో వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

దీపావళి స్పెషల్ గా రిలీజైన 'ఓరి దేవుడా' సినిమా ఇరవై రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ అయింది. నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ కూడా నలభై రోజుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి రాబోతోంది.

ఇప్పటికే జనం థియేటర్లకు రావడం లేదంటుంటే.. ఇలా ఓటీటీలో ఎర్లీ స్ట్రీమింగ్ చేయటం వల్ల మొత్తానికే దూరం అయ్యే ప్రమాదముంది. ఇటీవల 50 రోజుల తరువాతే డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యాలని నిబంధనలు పెట్టుకున్నప్పుడు.. ఇంత త్వరగా ఎందుకు తీసుకొస్తున్నారనేది అర్ధం కావడం లేదు.

జూన్ ఒకటి తర్వాత డిజిటల్ అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలకు ఈ నిభందనలు వర్తిస్తాయని అనుకున్నారు. ఒకవేళ దాన్ని పాటించకపోతే పరిణామాలు ఏంటనేది తెలియదు. దాంట్లో మినహాయింపులు ఏంటనేది కూడా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదాపు సినిమాలన్నీ ఎర్లీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి దీనిపై అందరూ మరోసారి ఆలోచిస్తారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.