Begin typing your search above and press return to search.

డెడ్ ఓపెనింగ్స్: ఈవారం బాక్సాఫీస్ వద్ద ఉసూరుమనిపించిన చిన్న సినిమాలు..!

By:  Tupaki Desk   |   25 Jun 2022 3:45 AM GMT
డెడ్ ఓపెనింగ్స్: ఈవారం బాక్సాఫీస్ వద్ద ఉసూరుమనిపించిన చిన్న సినిమాలు..!
X
సెలవులు పూర్తయ్యి స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి కాస్త తగ్గింది. సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాల హడావిడి ముగియడంతో.. ఇప్పుడు చిన్న సినిమాల సందడి మొదలైంది. భారీ సినిమాల నడుమ రావడం ఎందుకులే అని వేచి చూసిన చిత్రాలన్నీ.. ఇప్పుడు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఎనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిల్లో ఏ ఒక్కటి కూడా సరైన ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది.

'డర్టీ హరి' సినిమాతో డైరెక్టర్ గా రీఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''7 డేస్ 6 నైట్స్''. యువతకు కనెక్ట్ అయ్యేలా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ ని ఆకట్టుకుంది. అయితే రిలీజ్ తర్వాత మెజారిటీ సినీ అభిమానులు ఈ సినిమాపై పెదవి విరిచారు. బలహీనమైన కథ కథనం - స్లో నేరేషన్ తో ఆడియన్స్ ఓపికకు పరీక్ష పెట్టారని అంటున్నారు. దర్శకుడుగా ఎ.ఎస్. రాజు.. హీరోగా సుమంత్ అశ్విన్ కోరుకున్న హిట్ మాత్రం ఈ సినిమాతో దక్కకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం - చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే'. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఆసక్తి రేకెత్తించని కథనం - ఎమోషన్స్ పండక పోవడం ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గా చెబుతున్నారు. మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదనే అంటున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. బి.జీవన్ రెడ్డి దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా విభిన్న కథా కథనాలతో రూపొందిందని మేకర్స్ చెబుతూ వచ్చారు. అయితే తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రివ్యూలు కూడా అదే విధంగా వచ్చాయి. ఆకట్టుకోని కథ కథనం.. బోరింగ్ సీన్స్ తో ప్రేక్షకులసహనానికి పరీక్ష పెట్టారు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని అనుకున్న పూరీ కొడుక్కి నిరాశే ఎదురైందని చెప్పాలి.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ''కొండా''. వరంగల్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న కొండా మురళి - సురేఖ దంపతుల జీవితకథతో ఈ సినిమా రూపొందింది. మురళి పాత్రను త్రిగుణ్ పోషించగా.. సురేఖ పాత్రలో ఇద్రా మోర్ నటించింది. 1990 నుంచి 2000 వరకు జరిగే కథగా.. కొండా దంపతులు కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు జరిగిన ప్రయాణాన్ని ఇందులో చూపించారు. అయితే దీన్ని వెండితెరపై ఆకట్టుకునేలా వర్మ చెప్పలేదు. బలహీన మైన స్క్రీన్ ప్లేతో కథలో మలుపులు ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా తెరకెక్కించారు. మొత్తం మీద ఆర్జీవీ గతంలో తీసిన బయోపిక్స్ మాదిరిగా 'కొండా' సక్సెస్ అందుకోలేదని చెప్పాలి.

ఇషాన్ సూర్య దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా నటించిన చిత్రం 'గ్యాంగ్ స్టర్ గంగరాజు'. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 21న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇక జూన్ 24న 'సదా నన్ను నడిపే' 'కరణ్ అర్జున్' 'సాఫ్ట్ వేర్ బ్లూస్' వంటి మరో మూడు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఇవి రిలీజ్ అయ్యాయనే విషయమే జనాలకు తెలియలేదు. దీంతో ఆడియన్స్ వీటిని పట్టించుకోలేదు.

ఇలా జూన్ చివరి వారం బాక్సాఫీస్ వద్దకు వచ్చిన చిత్రాల్లో ఒక్కటి కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. అన్ని సినిమాలకు డెడ్ ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. ఈ వీకెండ్ లో కూడా ఈ సినిమాలకు పెద్దగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ వారంలో 40 కోట్ల రూపాయల మేర నష్టం వాటిళ్లనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.