Begin typing your search above and press return to search.

సముద్రం మీదుగా పారిపోయిన ఆ నిర్మాత?

By:  Tupaki Desk   |   9 Dec 2017 8:34 AM GMT
సముద్రం మీదుగా పారిపోయిన ఆ నిర్మాత?
X
ప్రముఖ తమిళ దర్శకుడు.. నటుడు శశికుమార్ బావమరిది.. నిర్మాత అశోక్ కుమార్ కొన్ని రోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియర్ అన్బు చెళియన్ వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అతను లేఖ రాసి పెట్టి మరీ చనిపోయాడు. దీంతో అన్బు మీద తమిళ పరిశ్రమలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై కేసు కూడా నమోదైంది. ఐతే అశోక్ ఆత్మహత్య చేసుకుని 18 రోజులు అవుతున్నా.. పోలీసులు ఇప్పటిదాకా అన్బును పట్టుకోలేకపోయారు. అతడి ఆచూకీ దొరకట్లేదు. అతను చెన్నైలోనే ఉండి ఉంటే ఈపాటికి కచ్చితంగా పోలీసులకు దొరికిపోయేవాడే.

ఐతే అన్బు చెన్నైనే కాక తమిళనాడునే విడిచి వెళ్లిపోయాడని... అసలతను దేశంలోనే లేడని అంటున్నారు. ఐతే అన్బు ఫొటోను తమిళనాడులోని అన్ని విమానాశ్రయాలకూ పంపిన నేపథ్యంలో అతను సెక్యూరిటీని దాటి విదేశాలకు వెళ్లిపోయే అవకాశం లేదు. ఈ విషయంలో అన్బు తెలివిగా వ్యవహరించాడని చెబుతున్నారు. చెన్నై ఓడరేవు నుంచి షిప్ ఎక్కి సముద్రం మీదుగా అండమాన్ కు చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్బు మేనేజరుతో పాటు వ్యక్తిగత సహచరుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే అన్బు ఆచూకీ కనుక్కుంటామని పోలీసులు చెబుతున్నారు. కోలీవుడ్లో నంబర్ వన్ ఫైనాన్షియర్ అయిన అన్బు.. ‘గోపురం ఫిలిమ్స్’ అనే బేనర్ పెట్టి కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు.