Begin typing your search above and press return to search.

బెల్లంకొండపై కేసును ఉపసంహరించుకున్న ఫైనాన్షియర్..!

By:  Tupaki Desk   |   16 March 2022 2:36 PM GMT
బెల్లంకొండపై కేసును ఉపసంహరించుకున్న ఫైనాన్షియర్..!
X
ఇటీవల టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు అతని కుమారుడు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఫైనాన్షియర్ వీఎల్ శ్రావణ్ కుమార్ వీరిద్దరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టారు. అయితే తాజాగా ఈ కేసు అనూహ్యంగా ముగిసింది. బెల్లంకొండ పై పెట్టిన కేసుని శ్రవణ్ బుధవారం ఉపసంహరించుకున్నారు.

కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా నిర్మాతను, ఆయన కుమారుడిని తప్పుగా అర్థం చేసుకున్నట్లు గ్రహించి కేసును ఉపసంహరించుకున్నట్లు శ్రవణ్ తెలిపారు. అకౌంట్స్ లో కొన్ని తప్పులు ఉన్నాయని.. ఇదే మొత్తం గందరగోళానికి దారితీసిందని అన్నారు. బెల్లంకొండ సురేష్ మరియు శ్రీనివాస్ లకు ఇబ్బంది కలిగించినందుకు శ్రవణ్ క్షమాపణలు చెప్పారు.

శ్రవణ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ''బెల్లంకొండ సురేష్ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నాను. లోక్ అదాలత్ ద్వారా కేసు కాంప్రమైజ్ చేసుకుంటాను. కొందరు పెద్దమనుషుల మధ్యవర్తిత్వం ప్రమేయం కారణంగా అకౌంట్లు క్లియర్ చేయబడ్డాయి. అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. గతంలో స్నేహితులుగా ఏ విధంగా కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాం'' అని తెలిపారు.

2018-19 మధ్య కాలంలో సినిమా నిర్మాణం కోసం బెల్లంకొండ సురేష్ - శ్రీనివాస్ లు రూ.85 లక్షలు తీసుకున్నారని, అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని శ్రవణ్ గత వారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరిగి చెల్లించమని అడిగితే వారు తనను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంల హైదరాబాద్ పోలీసులు బెల్లంకొండ మరియు ఆయన కుమారుడు శ్రీనివాస్ లపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 406 - 417 - 420 (మోసం) - 120 బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. దీంతో బెల్లంకొండ ప్రెస్ మీట్ పెట్టి తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసారు.

శ్రవణ్ అన్యాయంగా తమపై కేసు పెట్టాడని.. దీని వెనుక గుంటూరుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నారని బెల్లంకొండ ఆరోపించారు. శ్రవణ్ కుమార్ వెనుక ఉన్న రాజకీయ నేతను తగిన సమయంలో బయటపెడతానని బెల్లంకొండ అన్నారు.

ఇదే క్రమంలో తన డబ్బులివ్వకపోతే ఊరుకునేది లేదనే విధంగా శ్రవణ్ మాట్లాడారు. కానీ ఇంతలోనే అనూహ్యంగా శ్రవణ్ ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారని తెలుస్తోంది.