Begin typing your search above and press return to search.

పెద్ద బ్యాన‌ర్ల‌కి ఫైనాన్స్ క‌ష్టాలు

By:  Tupaki Desk   |   12 Jan 2022 10:30 AM GMT
పెద్ద బ్యాన‌ర్ల‌కి ఫైనాన్స్ క‌ష్టాలు
X
గ‌త కొన్ని నెల‌ల క్రితం క‌రోరా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో థియేట‌ర్లు రీఓపెన్ అయిపోయాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు రీఓపెన్ కావ‌డంతో షూటింగ్ పూర్త‌యి రిలీజ్ కు సిద్ధంగా వున్న సినిమాల‌ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేశారు. అలా వ‌చ్చిన ఉప్పెన‌, క్రాక్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించ‌డ‌మే కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీ వున్నా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి రికార్డులు సాధించాయి.

`క్రాక్‌` మాస్ రాజా ర‌వితేజ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచి మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఇక ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌లోకి సంద‌డి చేసిన `ఉప్పెన‌` ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని షాక్ కు గురిచేసింది. ఈ రెండు చిత్రాలు 50 శాతం ఆక్యుపెన్సీ కే ఓ రేంజ్ లో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో వ‌రుస‌గా భారీ చిత్రాల నిర్మాణం టాలీవుడ్ లో ఊపందుకుంది.

ప‌రిస్థితులు అనుకూలంగా వున్నాయ‌ని చాలా వ‌ర‌కు అగ్ర నిర్మాణ సంస్థ‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ని బ్యాక్ టు బ్యాక్ లైన్ లో పెట్టాయి. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు చిత్రాలు సెట్స్ పైకి వ‌చ్చేశాయి. కొంత వ‌ర‌కు షూటింగ్ ని కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఇప్పుడు అప్పుల‌ ఊబిలో కూరుకుపోతున్నాయ‌ని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ ల‌తో సినిమాల‌ని ప్రారంభించి స‌గం వ‌ర‌కు పూర్తి చేసిన అగ్ర నిర్మాణ సంస్థ‌లు మ‌ధ్య‌లో సినిమాల‌ని వ‌దిలేయ‌లేక‌... న‌డ్డివిరుస్తున్న వ‌డ్డీ రేట్ల‌ని భ‌రించ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాయ‌ట‌. అంతే కాకుండా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో డ‌బ్బు పుట్ట‌క పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని చెబుతున్నారు. అయితే అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఎదుర్కొంటున్న‌ ప్ర‌స్తుత ప‌రిస్థితిని ఆస‌రాగా తీసుకుంటున్న ఫైనాన్షియ‌ర్ లు మాత్రం 10 శాతం వ‌డ్డీని డిమాండ్ చేస్తున్నార‌ట‌. ఇది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.