Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: దబాంగ్ + పోకిరి = రాధే??

By:  Tupaki Desk   |   19 Oct 2019 5:28 AM GMT
ఫస్ట్ లుక్: దబాంగ్ + పోకిరి = రాధే??
X
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'దబాంగ్ 3'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 'దబాంగ్' సీరీస్ లో మూడవది. ఈ సినిమా క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో 'ఇన్షా అల్లా' సినిమాలో నటించేందుకు సల్మాన్ రెడీ అయ్యాడు కానీ ఆ సినిమాను ఏవో కొన్నికారణాల వల్ల పక్కన పెట్టారు. రద్దుకాకుండా ఉంటే నెక్స్ట్ ఈద్ కు రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. ఈ సినిమా క్యాన్సిల్ కావడంతో సల్మాన్ నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో ఆసక్తి నెలకొంది.

తాజాగా సల్మాన్ నెక్స్ట్ సినిమా ప్రకటన వచ్చేసింది. 'దబాంగ్ 3' తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవాతో పనిచేస్తున్నాడు. 'రాధే' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు క్యాప్షన్ 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. వచ్చే ఏడాది ఈద్ కు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించడం ఇది మూడవసారి. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో అసలు స్టోరీ ఉంటుందా ఉండదా అనే సెటైర్లు అప్పుడే సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

ప్రభుదేవా - సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా 'వాంటెడ్'. ఇది మహేష్ బాబు - పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పోకిరి' కి రీమేక్. హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత 'దబాంగ్ 3' చేస్తున్నారు. 'దబాంగ్' బాగానే ఉంటుంది కానీ సల్మాన్ తమ్ముడు అర్బాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దబాంగ్ 2' నిరాశపరిచింది. స్టొరీ లేకుండా చుల్ బుల్ పాండే పాత్రతో మ్యాజిక్ చేద్దామనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 'దబాంగ్ 3' ప్రకటించినప్పుడు కూడా కొందరు ప్రేక్షకుల్లో ఇదే అనుమానం. కథ లేకుండా ఒక హీరో పాత్రతో ఎలా నెట్టుకొస్తారో అని అన్నారు.

ఈ కొత్త సినిమా టైటిల్ 'రాధే'. క్యాప్షన్.. 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఈ రాధే 'హాఫ్ గుడ్.. ఫుల్లీ మ్యాడ్' అని పాత్ర గురించి కొంత ఇంట్రో ఇచ్చారు. ఈ వాలకం చూస్తుంటే 'దబాంగ్' ను 'పోకిరి'ని మిక్సీలో వేసి మరో భాయ్ 'రాధే' ను ప్రభుదేవా బయటకు తీసినట్టుగా అనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ మసాలాల మధ్య కాసింతయినా కథ ఉంటే అదే మహా భాగ్యం. లేకపోతే ప్రేక్షకుల పరిస్థితి హాఫ్ బ్యాడ్.. ఫుల్లీ మ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.