Begin typing your search above and press return to search.

సిరివెన్నెల పారితోషికం పెంచిన తొలి నిర్మాత‌!

By:  Tupaki Desk   |   4 Dec 2021 1:30 AM GMT
సిరివెన్నెల పారితోషికం పెంచిన తొలి నిర్మాత‌!
X
`సిరివెన్నెల` సీతారామశాస్త్రి మ‌ర‌ణం టాలీవుడ్ లో విషాదం నింపింది. తెలుగు సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంతా ఆయ‌న‌తో అనుబంధాన్ని నెమ‌రు వేసుకుని ఆవేద‌న చెంద‌డ‌మేగాక‌.. ఆయ‌న‌ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. శాస్త్రి గారితో తన స్నేహం సినిమాలకు సంబంధం లేనిదని ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్.

రాజు తెలిపారు. తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు ఉందని ఆయన అన్నారు. తామిద్ద‌రం రెగ్యుల‌ర్ గా ట‌చ్‌లో ఉండేవాళ్ల‌మ‌ని, ఆయ‌న చివ‌రి చూపు ద‌క్క‌లేద‌నే బాధ‌లో ఉన్నాన‌ని ఆయన ఆవేదన చెందారు. సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ "సుమంత్ ఆర్ట్స్ సంస్థ స్థాపించక ముందు... అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో, నేనూ ఓ నిర్మాణ భాగస్వామిగా 'మనవడొస్తున్నాడు' సినిమా తీశా. అందులో 'సిరివెన్నెల' పాటలు రాశారు. అప్పుడే ఆయన పరిచయమయ్యారు. అందులో 'చెరుకు చేను చాటు ఉంటే...' అనే పాట రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది.

అప్పుడు నా వయసు 25- 26 ఏళ్లు ఉంటాయి. తర్వాత నేను సుమంత్ ఆర్ట్స్ స్థాపించాను. 'శత్రువు'లో 'పొద్దున్నే పుట్టిందీ చందమామ' పాట ఆయనే రాశారు. తర్వాత 'మనసంతా నువ్వే'కి రీ-కనెక్ట్ అయ్యాం. అందులో మొత్తం పాటలన్నీ ఆయనే రాశారు. అన్నీ అద్భుతమైన పాటలే. ఆ పాటలు రాసేటప్పుడు ఎన్నో రాత్రులు మేమిద్దరం కూర్చున్నాం.

నన్ను ఎదురుగా కూర్చోమనేవారు. నేను కూర్చుంటే... ఆలోచనల పక్షిలా ఎక్కడెక్కడికో ఎగురుతూ.. ప్రపంచం అంతా తిరిగొచ్చినట్టు వచ్చేసి పాటలా నాకు ఇచ్చేసేవారు. ఆ ఎక్స్ పీరియ‌న్స్ అంతా ఓ అద్భుతం. ఆయన విసుక్కోవడం నేను చూడలేదు. 'శాస్త్రిగారు... మరో వెర్షన్ కావాలి' అంటే వెంటనే రాసి ఇచ్చేవారు. ఏదో రాశామంటే రాశాం అన్నట్టు కాకుండా... నా ప్రతి సినిమా కథను షాట్ తో సహా వినేవారు. కథకు తగ్గట్టు భావం వచ్చేలా పాటలు రాసేవారు.

ఆయన రాసిన ప్రతి పాట శాశ్వతమే. అంత గొప్ప పాటలు రాసిన ఆయనకు అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ ఉండేది. ఆయన రెమ్యునరేషన్ పెంచింది కూడా నేనే. చాలా మంది అనవసరంగా పెంచుతున్నావని నన్ను అన్నారు. 'నేను ఇండస్ట్రీ బాగు కోసమే ప్రయత్నిస్తున్నా. అందుకే, ఇలా పెంచాను. పాట సృష్టికర్తను గౌరవించుకోవడం మన బాధ్యత' అని చెప్పాను. ఆయన ఎన్నో ఉన్నతమైన పాటలు రాశారు.. అని తెలిపారు.

శాస్త్రి గారు వ్యక్తిగానూ ఉన్నతమైన మనిషి. అటువంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారు. ఇప్పుడు ఆయన మనమధ్య లేరంటే ఎంతో బాధగా ఉంది. ఆయన చివరి చూపు దక్కలేదనే వెలితి ఉంది. కరోనా వల్ల ఈమధ్య కలకవలేకపోయా. మా అనుబంధం చాలా విలువైనది. నా మనసులో ఆయన స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు.

చిత్ర పరిశ్రమకూ ఆయన మరణం పెద్ద లోటు. చాలా కోల్పోయినట్టే. సిరివెన్నెల లాంటి వ్యక్తులు మళ్లీ పుట్టరని తెలుసు. కలవడమో... ఫోనులో మాట్లాడుకోవడమో... మేం రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్లం. సినిమాలకు సంబంధం లేని స్నేహం మాది. పాట కోసం రాత్రుళ్లు ఎందుకింత కష్టపడుతున్నారని నేను అంటే నవ్వేసేవారు.

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో 'ఆకాశం తాకేలా...' పాట ఉంది. ఆయన బిజీగా ఉండి రాయడం కుదరలేదు. 'నువ్వు షూట్ చేసుకుని వచ్చేయ్' అన్నారు. సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీకి అనుగుణంగా షూట్ చేసుకుని, ఎడిట్ చేసి ఆయన దగ్గరకు వెళితే... వెంటనే పాట రాసిచ్చారు.

'వర్షం' కథను విని... 'పాటల గురించి రెండు మూడు రోజుల్లో కూర్చుందాం' అని కారెక్కి వెళ్లిపోయారు. మళ్లీ ఫోన్ చేసి... 'హనీ! రెండు లైన్లు వచ్చాయి రాసుకో' అని 'ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా... ఎన్నాళ్లని దాక్కుంటావు పైన' అని చెప్పారు.

సిరివెన్నెల పాట గురించి ఎంత ఆలోచిస్తారు? మథనపడతారు? అనేది చెప్పడానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు" అని అన్నారు. ఉన్న‌ట్టుండి పారితోషికం పెంచేస్తే ఇత‌రుల నుంచి వ్య‌తిరేక‌త ఉంటుంది ప‌రిశ్ర‌మ‌లో. నిర్మాత ఎం.ఎస్.రాజు అలాంటి వెత‌ల్ని ఎదుర్కొన్నాన‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రం.