Begin typing your search above and press return to search.

ధోనీ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ అదేనా..?

By:  Tupaki Desk   |   11 Oct 2022 4:25 AM GMT
ధోనీ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ అదేనా..?
X
భారత క్రికెట్ లో ఎన్నో మైలురాళ్లు సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్, మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోని.. త్వరలో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రెండేండ్ల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. అలానే పలు వ్యాపారాల్లో రాణిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.

దక్షిణాదిలో సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో 'ధోనీ ఎంటర్టైన్మెంట్' అనే పేరుతో ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించనున్నారని నివేదికలు వస్తున్నాయి. తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి మిస్టర్ కూల్ సన్నద్ధం అవుతున్నారని సెలబ్రిటీ అప్ డేట్స్ ఇచ్చే ముఫద్దల్ వోహ్రా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అంతేకాదు ధోని ఎంటరైన్‌మెంట్‌ వ్యవహారాలు చూసుకునేందుకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు సన్నిహితుడైన ఓ వ్యక్తిని ధోని నియమించుకున్నట్లు రూమర్స్ వ్యాపిస్తున్నాయి. ఇదే క్రమంలో ధోనీ ప్రొడక్షన్ లో చేయబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

దక్షిణాది అగ్ర కథానాయిక, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో ధోనీ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్న నయన్.. ధోనీ నిర్మాణంలో సినిమా చేయనుందనే వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్న విషయం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తెలుస్తుంది.

ఇదిలా ఉంటే గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియో రూపకల్పనలో నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్‌.. ధోనితో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నయన్‌ - విఘ్నేష్‌ దంపతులు.. ఇటీవల కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ధోనీ విషయానికొస్తే.. గతంలో తన భార్య సాక్షి సింగ్ తో కలిసి 'రోర్ ఆఫ్ ది లయన్' 'బ్లేజ్ టు గ్లోరీ' 'ది హిడెన్ హిందు' వంటి చిన్న తరహా చిత్రాలు డాక్యుమెంటరీలను నిర్మించారు. ఈ క్రమంలో ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతగా మారి, సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడని అంటున్నారు. మరి ఫీల్డ్ లో కూల్ గా విజయాలు సాధించే ధోనీ.. సినీ ఫీల్డ్ లో ఎంతవరకు రాణించగలడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.