Begin typing your search above and press return to search.

ఫస్ట్ సింగిల్: ఖిలాడీకి 'ఇష్ట'మైన బ్యూటిఫుల్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   10 Sep 2021 5:49 AM GMT
ఫస్ట్ సింగిల్: ఖిలాడీకి ఇష్టమైన బ్యూటిఫుల్ మెలోడీ..!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఖిలాడి''. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌధ‌రి - డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు వినాయక చవితి సందర్భంగా మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో 'ఇష్టం' అనే ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

'ఇష్టం' పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విశేష స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ లిరికల్ వీడియో కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. ''చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం.. కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం.. బల్లోకెళ్లే వేళ రెండు జళ్ళు అంటే ఇష్టం..'' అంటూ సాగిన ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు.

ఓ అమ్మాయి తనకు ఇష్టమైన వాటి గురించి.. తన కోసం కష్టపడే అబ్బాయి మీద ఉండే ఫీలింగ్స్ ని చెప్పుకుంటూ ఈ పాట పాడుకుంటోంది. దీనికి గేయ రచయిత శ్రీమణి మంచి సాహిత్యం అందించగా.. హరి ప్రియ వినసొంపుగా ఆలపించారు. రవితేజ - డింపుల్ హ‌య‌తి మధ్య చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కూడా బాగుంది. యష్ మాస్టర్ కంపోజిషన్ లో హీరోహీరోయిన్లు వేసిన సింపుల్ స్టెప్స్ అలరిస్తున్నాయి.

'ఖిలాడి' చిత్రాన్ని జయంతీలాల్‌ గడ (పెన్ స్టూడియోస్‌) సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మాత సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గాంధీ న‌డికుడిక‌ర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా.. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు.

శ్రీ‌కాంత్ విస్సా మరియు దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ కలసి ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మరియు అన్బు-అరివు మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. 'ఖిలాడి' చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ - అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.