Begin typing your search above and press return to search.

మాయాబజార్ తర్వాత రంగస్థలమే

By:  Tupaki Desk   |   3 March 2019 4:43 AM GMT
మాయాబజార్ తర్వాత రంగస్థలమే
X
తెలుగు సినిమా మార్కెట్ ఎంత విస్తృతంగా పెరిగినా కొన్ని బాషలలో ఇంకా అడుగు పెట్టలేని పరిస్థితి నేటికి ఉంది. ముఖ్యంగా కన్నడలో ఇతర బాషా సినిమాలను డబ్బింగ్ చేసే అవకాశం లేదన్న సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా ఇది శాండల్ వుడ్ లో అమలు చేస్తున్నారు. రీమేక్ చేసుకోవచ్చు కాని డబ్బింగ్ మాత్రం కుదరదు. అందుకే ఎంత డిమాండ్ ఉన్నా స్ట్రెయిట్ రిలీజ్ చేయడం తప్ప ఇంకే ఆప్షన్ లేక మనవాళ్ళు మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ ఆంక్షలు వీడాయి.

డబ్బింగ్ కు సంబంధించి కన్నడ పరిశ్రమలో నిబంధనలు సడలించారు. కొంత కాలం క్రితం అజిత్ వివేగంని కమెండో పేరుతో డబ్ చేసి దీనికి శ్రీకారం చుట్టారు. విశ్వాసం కూడా జగమల్ల అంటూ వదిలారు. వీటికి ఆదరణ కూడా బాగుంది. అయితే తెలుగు సినిమాలకు మాత్రం ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఆ దిశగా మొదటి అడుగు రామ్ చరణ్ రంగస్థలంతో పడబోతోంది

ఇప్పటిదాకా కన్నడ లో డబ్ అయిన తెలుగు స్ట్రెయిట్ మూవీ అలనాటి మాయాబజార్ ఒక్కటే. ఆ తర్వాత ఏదీ ఆ బాషలోకి వెళ్ళలేదు. ఇన్ని దశాబ్దాల తర్వాత రంగస్థలం రూపంలో కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. రంగస్థలం కన్నడ వెర్షన్ రంగస్థలను త్వరలో విడుదల చేయబోతున్నట్టు పబ్లిసిటీ కూడా మొదలైంది. నిజానికి వినయ విధేయ రామతోనే ఇది చేద్దాం అనుకున్నారు కాని టైం తక్కువగా ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.

రంగస్థల సక్సెస్ అయితే ఇక నేరుగా ఒకే తేదికి రెండు వెర్షన్లు విడుదల చేసుకునే అవకాశం దక్కుతుంది. రెండేళ్ళ క్రితం బాహుబలి 2ని కన్నడలో డబ్ చేసేందుకు ఆర్కా సంస్థ విశ్వప్రయత్నం చేసింది. కాని అక్కడి నిర్మాతల సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది. ఇప్పుడు రంగస్థలతో రూటు క్లియరయ్యింది కాబట్టి హ్యాపీగా మనవి కూడా కన్నడ బాషలో వచ్చేస్తాయన్న మాట