Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఫ్యాన్స్.. మళ్లీ ఫ్లెక్సీల గొడవ

By:  Tupaki Desk   |   5 Sep 2017 12:41 PM GMT
టాలీవుడ్ ఫ్యాన్స్.. మళ్లీ ఫ్లెక్సీల గొడవ
X
తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పంటూ అభిమానులు హద్దులు దాటడం ఈ మధ్య మామూలైపోతోంది. ఈ క్రమంలో అవతలి హీరోల మీద ద్వేషం చూపించడం.. ఆ హీరోల అభిమానులతో గొడవ పడటం.. లాంటి సంఘటనలు ఇప్పటికే చాలా చూశాం. హీరోల్ని అభిమానించే విషయంలో కులం కూడా కీలక పాత్ర పోషిస్తుండటమూ గమనిస్తున్నాం. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు అభిమానుల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై గొడవలు చెలరేగాయి.

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోనలోని సుబ్రహ్మణ్యస్వామి గుడి ఎదుట ఏర్పాటుచేసిన చవితి మండపం ఎదుట మహేష్‌ బాబు అభిమానులు.. తమ హీరోతో పాటు కొందరు రాజకీయ నాయకులకు చెందిన రెండు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై మరో సామాజిక వర్గానికి చెందిన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని తొలగించారు. ఇక్కడ ఫ్లెక్సీల ఏర్పాటుపై ముందు నుంచే రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతకుముందే పెట్టిన మహేష్ ఫ్లెక్సీల్ని కూడా తొలగించారు. అయినా మళ్లీ ఫ్లెక్సీల ఏర్పాటు జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల్ని తొలగించాలంటూ మరో సామాజిక వర్గం నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. దీనిపై అధికారులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

సినిమాలు చూసి ఎంటర్టైన్ కావచ్చు.. హీరోల నటన.. వారి స్టైల్.. ఇంకోదో చూసి అభిమానించవచ్చు.. వారిని ఆరాధించవచ్చు.. వారి పేర్లతో మంచి పనులు చేయొచ్చు.. అంతే కానీ హీరో కులాన్ని బట్టి అభిమానులుగా మారడం.. దాని ఆధారంగా గొడవలకు దిగడం.. ఫ్లెక్సీల దగ్గర నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? సినిమా అంటే వినోదం. మధ్యలో ఈ కులాల గొడవలేంటో? తమ హీరో మీద అభిమానం ఉంటే ఓకే కానీ.. అది అవతలి హీరో మీద ద్వేషంగా మారడమే అభ్యంతకరకరం. ఈ దురభిమానం వల్ల ఏం సాధిస్తారన్నది అభిమానులకే తెలియాలి. కులం.. మతం.. లాంటి అంశాల ఆధారంగా హీరోల్ని అభిమానించడమంటే ఎటు వైపు వెళ్తున్నారో కూడా ఆలోచించాలి.