Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రా ఎపిసోడ్ లో లక్స్ పాప.. లింకు లేదంటూ వీడియో రిలీజ్

By:  Tupaki Desk   |   28 July 2021 5:00 AM GMT
రాజ్ కుంద్రా ఎపిసోడ్ లో లక్స్ పాప.. లింకు లేదంటూ వీడియో రిలీజ్
X
బాలీవుడ్ ను షేక్ చేస్తున్న రాజ్ కుంద్రా వ్యవహారంలో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త పేరు ఫ్లోరా షైనీ. ఎవరీమె? అంటారా? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఆశా షైనీ.. అదేనండి మన లక్స్ పాప.. ఆమె బాలీవుడ్ కు వెళ్లేటప్పుడు ఆశా స్థానంలో ఫ్లోరా పేరును మార్చేసుకొని వెళ్లింది. నరసింహనాయుడు.. నువ్వు నాకు నచ్చావ్.. ఆ ఇంట్లో.. సర్దుకుపోదాం రండి.. లాంటి తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ఆమె తర్వాత బాలీవుడ్ కు వెళ్లింది. పలు సినిమాలతో పాటు ‘గందీ బాత్’ అనే శృంగారభరిత వెబ్ సిరీస్ లో నటించింది. ఇలాంటి ఆమెకు రాజ్ కుంద్రా ఎపిసోడ్ తో సంబంధం ఏమంటారా?

ఒక ప్రముఖ చానల్ లో ఆమె పేరుతో నడిచిన హడావుడికి ఒక్కసారిగా వణికిన ఫ్లోరా షైనీ ఏకంగా ఐదు నిమిషాల వీడియోను వివరణగా విడుదల చేసింది. రాజ్ కుంద్రా.. ఉమేశ్ కామత్ లు జరిపిన ఒక వాట్సాప్ చాటింగ్ లో ఫ్లోరా షైనీ ప్రస్తావన రావటంతో ఈ ఇష్యూ మొదలైనట్లుగా చెప్పాలి. రాజ్ కుంద్రా ఎపిసోడ్ ను నేషనల్ మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్ చుట్టూ వారు చాలానే సమయాన్ని నడిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతున్న ఈ ఎపిసోడ్ లో కొత్త యాంగిల్స్ కోసం ట్రై చేస్తున్న చానళ్ల హడావుడి పుణ్యమా అనే ఫ్లోరా షైనీ పేరు బయటకు వచ్చిందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా చానల్ చేస్తున్న హడావుడిలో రాజ్ కుంద్రా.. ఉమేశ్ కామత్ లు జరిపిన వ్యక్తిగత ఛాట్ లో తన పేరు ఒకసారి మాత్రమే వచ్చిందని.. అంత మాత్రానికే వారితో తనకు సంబంధం ఉందన్నట్లుగా కథనాలు ప్రసారం చేయటం సరికాదని వాపోతోంది ఫ్లోరా షైనీ. రాజ్ కుంద్రా సన్నిహితుడైన ఉమేశ్ కామత్ తో ఫ్లోరా షైనీకి స్నేహం ఉందంటూ వస్తున్న కథనాల్ని ఆమె తీవ్రంగా కొట్టి పారేస్తోంది.

‘నాకైతే రాజ్ కుంద్రాతో కానీ.. చానల్ లో ప్రచారం జరుగుతున్నట్లుగా ఉమేశ్ కామత్ తో కానీ ఎలాంటి సంబంధం లేదు. రాజ్ కుంద్రా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన సతీమణి శిల్పాశెట్టి కూడా నటినే. కాబట్టి ఆయనకు చాలామంది నటీనటులతో స్నేహం ఉండి ఉంటుంది. అంత మాత్రానికే వివాదంలోకి లాగుతారా?’ అని ప్రశ్నించింది. తనకైతే మాత్రం పరిచయం కూడా లేదని.. వారి నెంబరు కూడా తన వద్ద లేదని పేర్కొంది.

అనవసరంగా తన పేరును వివాదంలోకి లాగటం సరికాదని పేర్కొంది. చానల్ చేస్తున్న హడావుడితో కలత చెందానని.. అందుకే తాను స్వయంగా వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో వివరణ ఇచ్చానే తప్పించి మరే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ‘‘నన్ను సంప్రదించకుండా.. ఆ చాట్ నిజంగా జరిగిందా? లేదా? అన్నది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రసారం చేస్తే ఆ చానల్ కు వచ్చే లాభం ఏమిటో అర్థం కావట్లేదు? నాపై చెడు ప్రచారం జరుగుతోంది. అందుకే స్పందించాల్సి వచ్చింది’’ అని పేర్కొంది.

తనో నటినని.. ప్రపంచంలో ఎక్కడో ఏ మూలనో ఉన్న వ్యక్తుల గురించి ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘మీరు ప్రచారం చేసే వదంతులతో నాకు వచ్చే అవకాశాలు చేజారతాయి. దయచేసిన నన్నువివాదాల్లోకి లాగకండి’ అంటూ ఆమె తాజాగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. రాజ్ కుంద్రాకు అత్యంత సన్నిహితుడైన ఉమేశ్ కామత్ తో ఫ్లోరా షైనీకి సంబంధం ఉందంటూ ఒక చానల్ చేసిన ప్రచారంతో హడావుడితో ఖండన వివరణ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో ఆమె విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.