Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' సాంగ్‌ లో కనిపించిన జానపద కళాకారుడు ఎవరంటే..!

By:  Tupaki Desk   |   2 Sep 2021 11:30 PM GMT
భీమ్లా నాయక్ సాంగ్‌ లో కనిపించిన జానపద కళాకారుడు ఎవరంటే..!
X
పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ''భీమ్లా నాయక్'' టైటిల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో వ్యూస్ - లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. థమన్ సమకూర్చిన బాణీలకు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసిన మంచి సాహిత్యం అందించారు. దీనికి శివమణి డ్రమ్ములు వాయించగా.. రామ్ మిర్యాల - శ్రీకృష్ణ - పృథ్వీ చంద్ర కలిసి ఆలపించారు. అయితే ఈ పాట ప్రారంభంలో అద్భుతంగా సాకీ పాడిన వ్యక్తి ఎవరనే దానిపై అందరి దృష్టి పడింది. ఆయన ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు మొగులయ్య అని తెలుస్తోంది.

'సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన.. బెమ్మాజెముడు చెట్టున్నాది.. బెమ్మాజెముడూ చెట్టు కింద అమ్మా నెప్పులు పడతన్నాది.. ఎండా లేదు రేతిరిగాదు.. ఏగూసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులి పిల్ల..' అంటూ మొగులయ్య తనదైన శైలిలో పాడి శ్రోతలను ఆకట్టుకున్నాడు. మొగులయ్య గాత్రం - పదాల ఉచ్ఛరణ విధానం చూసి ఈయన ఎవరని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలు పట్టారు.

మొగులయ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన జానపద గాయకుడు.. 12 మెట్లు కిన్నెర వాద్య కళాకారుడు. పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం లింగాల గ్రామం ఆయన స్వస్థలం. 7 మెట్ల కిన్నెర వాయించే తన తండ్రి స్పూర్తితో.. సొరకాయ బుర్రలు - వెదురుబొంగుల సహాయంతో '12 మెట్ల కిన్నెర' ను తయారు చేశారు మొగులయ్య. దాదాపు అంతరించిపోయే దశలో ఉన్న ఈ పరికరం ఉపయోగించడం తెలిసిన చివరి వ్యక్తి కూడా మొగులయ్యే అని చెప్పుకుంటారు.

వీర గాథల ద్వారా 'పండుగ సాయన్న' గా గుర్తింపు తెచ్చుకున్న మొగులయ్య.. ప్రజలు ఇచ్చే కానుకలతోనే జీవనం సాగిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ స్కాలర్ ఒకరు మొగులయ్య కళను వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి తన కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని పలు రకాలుగా ఆదుకోవడమే కాకుండా.. నెలకు రూ.10 వేలు చొప్పున పెన్షన్ కూడా అందిస్తోంది. ఈ క్రమంలో మొగులయ్య గురించి తెలుసుకొని 'భీమ్లా నాయక్' టీమ్ సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు.

''భీమ్లా నాయక్'' సినిమా మలయాళంలో హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ అనే సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసిన మేకర్స్.. ఇందులో హీరో పాత్రను ఎలివేట్ చేసే పాటలో జానపదం ఉంటే బాగుంటుందని భావించారు. ఈ క్రమంలో మొగులయ్య గురించి తెలుసుకుని 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ సాకీ పాడే అవకాశం ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యంలో మొగులయ్య ఇన్ పుట్స్ కూడా ఉన్నాయట.

ఇది 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కె చంద్ర ఐడియానో లేదా రచయిత త్రివిక్రమ్ సలహానో తెలియదు కానీ.. మొగులయ్య వాయిస్ మాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట జానపద కళాకారుడికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా.. '12 మెట్ల కిన్నెర' గురించి అందరికి పరిచయం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సాకి పాడిన మొగులయ్య గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.