Begin typing your search above and press return to search.

హైదరాబాద్ చరిత్రలో తొలిసారి.. నిద్రపోని మల్టీఫ్లెక్సులు

By:  Tupaki Desk   |   12 Jan 2023 10:30 AM GMT
హైదరాబాద్ చరిత్రలో తొలిసారి.. నిద్రపోని మల్టీఫ్లెక్సులు
X
అవును.. హైదరాబాద్ మహానగర చరిత్రలో ఇప్పటివరకు చోటు చేసుకోని ఒక కొత్త పరిణామానికి నిలువెత్తు సాక్ష్యంగా జనవరి 12వ తారీఖు నిలవనుంది. తెలుగు ప్రజల జీవితాల్లో భాగమైన సినిమా సరికొత్త కోణంలో హైదరాబాదీయులకు తాజాగా ఆవిష్క్రతమైంది.

సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోల సినిమాలు విడుదల కావటం తెలిసిందే. పండుగ పూట వరుస పెట్టి విడుదలయ్యే చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు చూపే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో తాజాగా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే రెండు చిత్రాల (వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య)కు సంబంధించి మొదటి రోజు ఆరు షోలు వేసుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల్ని జారీ చేసింది.

దీంతో.. విచిత్ర వాతావరణం నెలకొంది. మహానగరంలోని పలు మల్టీఫ్లెక్సుల్లో నాన్ స్టాప్ గా సినిమా ప్రదర్శన జరగటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. నగరంలోని మల్టీఫ్లెక్సులు నిర్విరామంగా పని చేయటంతో పాటు.. నగర జీవి నిద్ర పోనివ్వని రీతిలో షోలు వేయటం విశేషం.

జనవరి 11న అంటే బుధవారం రాత్రి మల్టీఫ్లెక్సుల్లో చివరి షో 11 గంటలకు మొదలై.. అర్థరాత్రి 2.15 గంటల వరకు సాగింది. మళ్లీ.. నాలుగు గంటల నుంచే థియేటర్లు పని చేయటం మొదలయ్యాయి. దీనికి కారణం వీరసింహారెడ్డి చిత్రాన్ని ఉదయం 4.30 గంటల షో వేయటమే.

దీంతో.. బుధవారం ఆఖరి ఆట తర్వాత ధియేటర్ నిర్వహణను చేపట్టిన కాసేపటికే తొలి షో వేసేందుకు సిద్ధం కావటంతో.. పలు మల్టీఫ్లెక్సులు నాన్ స్టాప్ గా నిలిచినట్లుగా మారింది. నగరంలోని హైటెక్ సిటీలో ఉన్న ఒక ప్రముఖ మల్టీఫ్లెక్సు విషయానికే వస్తే.. వీరసింహారెడ్డి మొదటి ఆట 4.30 గంటలకు మొదలై.. ప్రతి పదిహేను నిమిషాల గ్యాప్ తో ఒక్కో స్క్రీన్ పని చేయటం మొదలు పెట్టింది. వీలైనంత త్వరగా తమ అభిమాన కథానాయకుడి చిత్రాన్ని చూడాలన్న ఆసక్తితో పెద్ద ఎత్తున ప్రేక్షకులు సినిమాను వీక్షించారు.

సాధారణంగా అగ్రహీరోల చిత్రాలు విడుదలయ్యే రోజున.. తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో నగరంలో మొత్తంలో ఒక్క థియేటర్ లో ప్రత్యేక షో (బెనిఫిట్ షో/ ఫ్యాన్స్ షో)ను నిర్వహించటం తెలిసిందే. అందుకు భిన్నంగా మహానగరంలోని పలు మల్టీఫ్లెక్సుల్లో షోలు నిర్వహించటం.. శుక్రవారం విడుదలయ్యే చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీని కూడా ఇదే రీతిలో షోలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు మరెప్పుడూ లేదన్న మాట చిత్ర పరిశ్రమకు చెందిన వారు చెప్పటంతో పాటు.. రానున్న రోజుల్లో ఇదో ట్రెండ్ గా మారుతుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.