Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు : హీరోయిన్ల వెంట్రుకలు వెనక్కి.. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..?

By:  Tupaki Desk   |   3 Oct 2020 12:30 PM GMT
డ్రగ్స్ కేసు : హీరోయిన్ల వెంట్రుకలు వెనక్కి.. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..?
X
శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్లు రాగిణి ద్వివేది - సంజనా గల్రానీలను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(సీసీబీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీబీ అధికారులు రాగిణి - సంజనలకు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు - మూత్రం - తల వెంట్రుకలను సేకరించారు. డ్రగ్స్ సేవించారో లేదో అని నిర్ధారించడం కోసం హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షలు చేయించడానికి వారి వెంట్రుకలను పంపించారు. అయితే రాగిణి - సంజనాల తల వెంట్రుకల శ్యాంపిల్స్ వెనక్కి వచ్చాయని తెలుస్తోంది.

కాగా, హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో వారి తల వెంట్రుకలను అక్కడి నిపుణులు పరీక్షించారని తెలిసింది. హీరోయిన్లు రాగిణి - సంజనాల తల వెంట్రుకలను సేకరించిన విధానం సక్రమంగా లేదని.. వాటిని పరీక్షించడానికి సమస్యలు ఎదురౌతున్నాయని.. వీటిని పరీక్షించి డ్రగ్స్ సేకరించారా లేదా అనే విషయం కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులకు తెలిపారని సమాచారం. దీంతో మరోసారి వారి తల వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని సీసీబీ అధికారులు సిద్ధం అవుతున్నారని తెలిసింది.

అయితే సాంకేతిక లోపం కారణంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది - సంజనా గల్రానీల తల వెంట్రుకలు వెనక్కి వచ్చాయని.. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోవడానికి చర్యలు తీసుకుంటున్నామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా హీరోయిన్లు రాగిణి - సంజన గల్రాని విదేశీ డ్రగ్ పెడ్లర్లతో చాటింగ్‌ చేసినట్లు సీసీబీ ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా లూమ్‌ సెప్పర్‌ నుంచి నేరుగా వీరు డ్రగ్స్‌ కొనుగోలు చేసి.. బెంగుళూరులోని రిసార్ట్స్ కి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని సమాచారం.