Begin typing your search above and press return to search.

ఫ్లెక్సీ ప్ర‌మాదం గుణ‌పాఠం మ‌రిచారా?

By:  Tupaki Desk   |   23 Oct 2019 9:36 AM GMT
ఫ్లెక్సీ ప్ర‌మాదం గుణ‌పాఠం మ‌రిచారా?
X
ఫ్లెక్సీ కూలి మీద ప‌డ్డాకే జ్ఞానం వ‌స్తుందా? అప్ప‌టివ‌ర‌కూ జాగ్ర‌త్త ప‌డ‌లేరా? ఫ‌్లెక్సీలు.. హోర్డింగులు రోడ్ల‌పై వెళ్లే వాళ్ల‌పై కుప్ప‌కూలుతున్న ఘ‌ట‌న‌ల‌కు కొద‌వేమీ లేదు. ర‌ద్ధీ కూడ‌ళ్లలో.. రోడ్ల‌కు ఇరువైపులా వీటి ఏర్పాటు వ‌ల్ల వాహ‌న‌చోద‌కులు సైతం పెను ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఆ క్ర‌మంలోనే కోర్టుల ప‌రిధిలో ఈ వ్య‌వ‌హారంపై ప‌లుమార్లు అక్షింత‌లు ప‌డ్డాయి. కానీ ఎవ‌రూ దానిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గుర్రాన్ని చేలో క‌ట్టేశాం అంటే గాడిదని తోలుకొచ్చే చ‌ట్టాలే మ‌న‌కు ఉన్నాయ‌న‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ అవ‌స‌రం లేదు.

నిరంత‌రం రోడ్ల‌కు ఇరువైపులా స్టార్ హీరోల సినిమాల‌కు సంబంధించిన‌వి.. అలాగే స్టార్ల క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ కు సంబంధించిన ఫ్లెక్సీలు.. హోర్డింగులు ద‌ర్శ‌న‌మిస్తూనే ఉన్నాయి. ఓవైపు స్టార్ హీరోలు ఇలాంటి వాటికి వ్య‌తిరేకం అంటూ ఉప‌న్యాసాలు దంచుతుంటారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నానికి తాము వ్య‌తిరేకం కాదు అంటూనే ఉంటారు. మ‌రోవైపు ఫ్లెక్సీలు.. హోర్డింగులు క‌డుతూనే ఉంటారు. క‌నీసం గాలివాన‌ల సీజ‌న్ అని కూడా చూడ‌రు. త‌మ సినిమాలు రిలీజ‌వుతుంటే పెద్ద ఎత్తున ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలి భావిస్తుంటారు.

ఈ దీపావ‌ళి కానుక‌గా త‌మిళ‌నాట అగ్ర హీరోల సినిమాలు రిలీజ‌వుతున్నాయి. త‌ళా అజిత్.. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన భారీ చిత్రాలు రిలీజ్ ల‌కు వ‌స్తున్నాయి. అయితే స‌ద‌రు హీరోలు.. వారి ఫ్యాన్స్ ఫ్లెక్సీలు.. హోర్డింగుల విష‌యంలో ఓ నిబ‌ద్ధ‌త‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు.. అభిమానుల‌కు హాని చేసే విధంగా వీటి ఏర్పాటును వ్య‌తిరేకించ‌డ‌మే గాక‌.. అలా ఖ‌ర్చు చేసే మొత్తాన్ని రోడ్ల కూడ‌ళ్ల‌లో సీసీ కెమెరాల ఏర్పాటు కోస‌మో.. లేక రోడ్ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలకో స‌ద్వినియోగం చేస్తున్నారు. ఇలా చేస్తుంటే ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. నాయ‌కులే వ‌చ్చి వీటికి ప్రారంభోత్స‌వాలు చేస్తుంటే సినిమాకి బోలెడంత ప్ర‌చారం ద‌క్కుతోంది. ఆ హీరోల‌పై గౌర‌వం పెరుగుతోంది.

ఇటీవలే తమిళనాట ఒక హోర్డింగ్ కూలి యువతి మరణించిన ఘ‌ట‌న అనంత‌రం మార్పు ఇది. అప్ప‌ట్లోనే హీరోలు విజ‌య్- అజిత్ ఆ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. త‌మ సినిమాలు రిలీజ్ ల‌కు వ‌స్తే ఫ్లెక్సీలు.. హోర్డింగులు పెట్ట‌నివ్వ‌మ‌ని ప్రామిస్ చేశారు. ఫ్యాన్స్ ఎవరూ తమ సినిమాల రిలీజ్ వేళ కానీ.. బర్త్ డే లకు కానీ ఫ్లెక్సీలు క‌ట్టొద్ద‌ని హెచ్చ‌రించారు.

అయితే ఈ రూల్ కేవ‌లం చెన్న‌య్- త‌మిళ‌నాడు వ‌ర‌కేనా? ఇటు హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్తించ‌దా? ఇక్క‌డ విజ‌య్ సినిమా రిలీజ‌వుతున్న థియేట‌ర్ల ముందు వ‌ర్తించ‌దా? అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. విజ‌య్ న‌టించిన విజిల్ (బిగిల్-త‌మిళ్‌) సినిమాకి తెలుగులో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌న్న త‌ప‌న‌తో ఇక్క‌డ నిర్మాత‌లు హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 50 అడుగుల క‌టౌట్ ని ఏర్పాటు చేస్తున్నార‌ని తెలిసింది. అయితే త‌మిళ‌నాడులో ఆచ‌రించిన దానిని ఇక్క‌డ ఆచ‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటో? సామాజిక బాధ్య‌త తంబీల‌కే కానీ మ‌న‌కు వ‌ర్తించ‌దా? అంటూ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. అయినా ఇలాంటి వాటిని తెలిసీ విజ‌య్ ఎంక‌రేజ్ చేస్తారా? తెలియ‌క‌నే ఇలా జ‌రిగిందా? ఇది తెలిస్తే సీరియ‌స్ అవుతారు క‌దా? అంటూ ఫిలింన‌గ‌ర్ లో మాటా మంతీ సాగుతోంది. ప్ర‌మాదాలు జ‌రిగేది త‌మిళ‌నాడు లోనేనా? తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్సీ ప్ర‌మాదాలేవీ జ‌ర‌గ‌వా? అంటూ నిల‌దీస్తున్నారు కొంద‌రైతే. వారికో రూలూ.. వీరికో రూలూనా? తెలిసీ ఎందుకిలా చేస్తున్నారు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.