Begin typing your search above and press return to search.

ఒక్క నెలలో నలుగురు స్టార్‌ హీరోల సినిమాల జాతర

By:  Tupaki Desk   |   23 Aug 2022 2:30 PM GMT
ఒక్క నెలలో నలుగురు స్టార్‌ హీరోల సినిమాల జాతర
X
కరోనా ప్రభావం నుండి బాలీవుడ్ ఇంకా బయట పడలేదు.. కానీ టాలీవుడ్ మాత్రం పూర్తిగా కరోనా ప్రభావం నుండి బయట పడినట్లే అంటూ ఇటీవల విడుదల అయిన సినిమాల యొక్క వసూళ్లు చెప్పకనే చెబుతున్నాయి. బాలీవుడ్ లో విడుదల అయిన దాదాపు అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడుతున్న ఈ సమయంలో అక్కడ సినిమాల విడుదలకు స్టార్స్ భయపడుతున్నారు.

టాలీవుడ్‌ స్టార్స్ మాత్రం పోటీ పడుతూ బ్యాక్ టు బ్యాక్‌ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ దసరాకు పెద్ద ఎత్తున సినిమా ల హడావుడి ఉండబోతుంది. ఇక ఎప్పటిలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా స్టార్‌ హీరోల సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఈ సమయంలో 2023 ఏప్రిల్‌ నెలలో విడుదల కాబోతున్న సినిమాలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు స్టార్‌ హీరోల సినిమాలు 2023 ఏప్రిల్‌ నెలలో విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నెల మొత్తం సినిమాల జాతర ఖాయం అంటూ సినీ ప్రేమికులు ఇప్పటి నుండే ఉత్సాహం తో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల సినిమాలు కనిపించని ఈ సమయంలో టాలీవుడ్‌ హీరోల నాలుగు పెద్ద సినిమాలు ఒకే నెలలో విడుదల కావడం అనేది కచ్చితంగా విశేషం.

ఇక ఏప్రిల్‌ 2023 లో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే సూపర్ స్టార్‌ మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ ల కాంబోలో రూపొందబోతున్న సినిమా ను ఏప్రిల్‌ 28న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దని మహేష్ బాబు బలంగా కోరుకుంటున్నాడు. అది సెంటిమెంట్‌ డేట్‌ గా నమ్ముతున్నారు.

ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమాను ఏప్రిల్‌ 14వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా దర్శకుడు ప్రకటించాడు. భోళా శంకర్ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ముగింపు దశకు వచ్చింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్‌ 14వ తారీకున విడుదల చేయడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ రెండు సినిమాలు కాకుండా బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబో సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో విడుదల చేస్తామంటూ ప్రకటించారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ను కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే విడుదల చేస్తామంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ ప్రకటించాడు. అంటే మొత్తంగా నలుగురు సూపర్ స్టార్స్ ఒకే నెలలో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతున్నారు.