Begin typing your search above and press return to search.

2019లో సౌండ్ అన్న‌దే లేని శుక్ర‌వారం

By:  Tupaki Desk   |   29 Sep 2019 1:30 AM GMT
2019లో సౌండ్ అన్న‌దే లేని శుక్ర‌వారం
X
2019 చివ‌రి క్వార్ట‌ర్ లోకి వ‌చ్చేశాం. అక్టోబ‌ర్ - న‌వంబ‌ర్- డిసెంబ‌ర్ మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఈ మూడు నెల‌ల్లో తెలుగు సినిమా స‌న్నివేశం ఎలా ఉండ‌బోతోంది అన్న‌దే త‌దుప‌రి కొత్త సంవ‌త్స‌రానికి బూస్ట్ ఇవ్వ‌నుంది. ఇక‌పోతే వారం వారం య‌థావిధిగా రెండు మూడు సినిమాల మ‌ధ్య పోటీ ప్రతిసారీ త‌ప్ప‌నిస‌రిగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల రిలీజైన సినిమాలు చూస్తే... ఎవ‌రు-ర‌ణ‌రంగం- నానీస్ గ్యాంగ్ లీడ‌ర్- గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ఇలా కొన్ని పేర్లు పెద్ద సౌండ్ తో వినిపించాయి. సాహో లాంటి భారీ చిత్రం గురించి వారం పైగా బాగానే మాట్లాడుకున్నారు. సాహో త‌ర్వాత డైరెక్టుగా సైరా గురించి మాట్లాడుకుంటున్నారు కానీ మ‌ధ్య‌లో ఒక శుక్ర‌వారం ఉంద‌న్న‌దే మరిచారు జ‌నం.

అదేంటో ఈ శుక్ర‌వారం మాత్రం అస్స‌లు సౌండ్ వినిపించ‌లేదు. అస‌లు ఈ వారంలో ఏదైనా సినిమా ఏదైనా రిలీజైందా లేదా? అంటూ ఆరాలు తీయాల్సిన ప‌రిస్థితి దాపురించింది. అలా ఆరా తీస్తే ప్ర‌తి శుక్ర‌వారం లానే ఓ మూడు సినిమాలు రిలీజ‌య్యాయ‌ట‌. ఇక ఈ మూడు సినిమాల‌కు అస‌లు రివ్యూలు రాసేవాళ్లే క‌రువ‌య్యారు. పైపెచ్చు ఎవ‌రైనా పొర‌పాటున‌ రివ్యూ రాసినా .. కొత్త‌ద‌నం లేని పాత వైన్ బాటిల్ అనో లేక అంత‌గా ఆక‌ట్టుకోని ప్రేమ‌క‌థ అనో లేక ఇంట్రస్ట్ గా సాగని రొటీన్ బోరింగ్ లవ్ స్టోరి అనో ఇలా ఆ మూడు సినిమాల‌కు గొప్ప ట్యాగ్ లు ఇచ్చారు. దీంతో మొత్తానికి ఏవో వ‌చ్చాయిలే మ‌మ అనిపించేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

అస‌లు ఏ సౌండ్ లేకుండా వ‌చ్చిన ఆ సినిమాల పేర్లేవి అన్న‌ది వెతికితే .. రామ చక్కని సీత- రాయలసీమ లవ్ స్టోరీ- నిన్ను తలచి ఇలా ఓ మూడు సినిమాల పేర్లు క‌నిపించాయి. స‌రైన ప్ర‌మోష‌న్ లేని సినిమాల ప‌రిస్థితి ఇంతే మ‌రి. సినిమా బ‌డ్జెట్ ఎంత కేటాయిస్తే.. అంత బ‌డ్జెట్ కేటాయించి ప్ర‌చారం చేయాల‌ని చాలా మంది నిపుణులు హెచ్చ‌రిస్తున్నా అది ప‌ట్టించుకోక‌పోతే ఇలానే ఉంటుంది. అలాగే స‌రైన రిలీజ్ తేదీ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతుంటారు. రిలీజ్ ముందే స‌రైన బ‌జ్ తేలేక‌పోయినా ఇక వాటి గురించి జ‌నాలు థియేట‌ర్ల వ‌ర‌కూ వ‌చ్చేది ఉండ‌దు. మ‌రి ఈ శుక్ర‌వారం రిలీజ్ లు అస‌లు థియేట‌ర్ల‌లో సీనేంటో ట్రేడ్ మాటేమిటో తేలాల్సి ఉంది.