Begin typing your search above and press return to search.

పవన్ చెప్పిన లెక్కతో రెమ్యునరేషన్ ఎంతన్న దానిపై ఫుల్ క్లారిటీ

By:  Tupaki Desk   |   14 Jan 2023 3:30 PM GMT
పవన్ చెప్పిన లెక్కతో రెమ్యునరేషన్ ఎంతన్న దానిపై ఫుల్ క్లారిటీ
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయన్ను విభేదించేవారు సైతం సినిమాల విషయంలో ఆయన్ను ఎంతగా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో తెలిసిందే. పవన్ ను సినిమాలకు వేరుగా.. రాజకీయానికి వేరుగా చూసే వాళ్లు ఉంటారు. తెలుగు సినిమాకు సంబంధించిన మరే సినీ హీరోకు లేని ప్రత్యేక క్రేజ్ పవన్ సొంతంగా చెబుతారు. దీనికి నిదర్శనంగా.. పవన్ సినిమా విడుదలైన రోజున సింగిల్ థియేటర్ నుంచి మల్టీఫ్లెక్సు వరకు థియేటర్ ఏదైనా.. స్క్రీన్ మరేదైనా ఆయనకున్న ఇమేజ్ ఎంతన్న విషయం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

వకీల్ సాబ్ విడుదల వేళకు కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భయాందోళనలు పెరగటమే కాదు.. లాక్ డౌన్ పెట్టేస్తారన్న ప్రచారం భారీగా సాగుతోంది. ఇంట్లో నుంచి బయటకు రావటానికి చాలా ముఖ్యమైతేనే వచ్చే పరిస్థితి. బయటకు వెళ్లేందుకు చాలా భయపడే అలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ సినిమా విడుదల రోజున పలు మల్టీఫ్లెక్సుల్లోచంటి పిల్లల్ని భుజాన వేసుకొని.. వచ్చిన మోడ్రన్ తల్లుల్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయే పరిస్థితి. మొదటి రోజున పవన్ మూవీని చూసేందుకు వారు చూపిన ఆసక్తి అప్పట్లో వార్తాంశంగా మారింది. పవన్ కోసం.. ఆయన సినిమా కోసం తాము రిస్కు చేసేందుకు సైతం సిద్ధమన్న మాట వినిపించింది.

వకీల్ సాబ్ సినిమా విడుదల వేళలో థియేటర్ల వద్ద కనిపించిన సందడి మళ్లీ కనిపించిన మూవీ ఏదైనా ఉందంటే అది ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన మూవీ కావటం.. స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించటం.. అప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో ఒక రేంజ్ హడావుడిని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా పవన్ సినిమా విడుదలకు సమానంగా ఉండటం చూస్తే.. పవన్ రేంజ్ ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.
అలాంటి పవన్ కల్యాణ్ తన సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారన్నది ప్రశ్నగా ఉండేది.

ఎవరికి వారు వారికి అనిపించినంత.. ఇండస్ట్రీలో వినిపించే మాటలకు అనుగుణంగా మాట్లాడటమే తప్పించి.. అధికారికంగా చెప్పినోళ్లు కనిపించరు. అలాంటిది..రణస్థలం వేదికగా చేసుకొని నిర్వహించిన యువశక్తి బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. తన ప్రసంగంలో భాగంగా తన ఆదాయం గురించి ఆసక్తికర వ్యాఖ్య చేయటం తెలిసిందే.

తాను ఒక రోజు పని చేస్తే కోటి రూపాయిల వరకు వస్తుందన్న మాట చెప్పారు. ఈ లెక్కన చూస్తే.. ఒక సినిమాకు పవన్ ఇచ్చే కాల్షీట్లు 70-80 రోజులు ఇస్తుంటారు. కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. ఆయన సినిమాకు రెమ్యునరేషన్ కనీసం రూ.70 కోట్లకు తగ్గదని అర్థమవుతుంది. ఇది కాకుండా సినిమాకు తగ్గట్లు..

ఇతరాలు కలుపుకుంటే ఆయనకు వచ్చే రెమ్యునరేషన్ భారీగా ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. తన సినిమాకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారన్న దానికి ఇదో సుమారు లెక్కే కానీ.. ఇదే అసలు లెక్కగా చెప్పలేం. ఎందుకంటే.. పవన్ సినిమా మార్కెట్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా.. తొలిసారి పవన్ రెమ్యునరేషన్ ను అంచనా కట్టటానికి అధికారికంగా పవన్ చెప్పిన మాటలే అవకాశంగా మారటం విశేషంగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.