Begin typing your search above and press return to search.

మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిట‌ర్ల భేటీ

By:  Tupaki Desk   |   11 Nov 2021 4:06 AM GMT
మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిట‌ర్ల భేటీ
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ సేవల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ లతో సహా అన్ని థియేటర్లలో ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లు విక్రయించాలని ప్రతిపాదించారు. దీనిపై జగన్ సర్కార్ పై వేగంగా ముందుకెళ్తోంది. కొత్త టికెటింగ్ విధానం అమలు.. థియేటర్ల సహకారంపై ఎగ్జిబిటర్లతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.

ఏపీ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం మరియు థియేట‌ర్ల స‌మ‌స్యల‌పై ఎగ్జిబిట‌ర్లతో ఏపీ మంత్రి పేర్ని నాని బుధవారం స‌మావేశం అయ్యారు. ఇందులో పశ్చిమ గోదావరి - కృష్ణా - గుంటూరు జిల్లాల థియేటర్ యజమానులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏపీ సినీ ఎగ్జిబిట‌ర్లు ఆంధ్రప్రదేశ్‌ లో తీసుకొస్తున్న ఆన్‌ లైన్ టిక్కెట్ విధానాన్ని స్వాగ‌తించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికారు.

ఈ సందర్భంగా గతంలో కొన్ని ప్రైవేట్ యాప్‌ లతో సినిమా టికెట్ల బుకింగ్ కోసం మరో ఐదేళ్లు అగ్రిమెంట్ చేసుకున్న అంశాన్ని మంత్రి వద్ద ఎగ్జిబిటర్లు ప్రస్తావించారు. దీనికి న్యాయపరమైన సమస్యలు రాకుండా ఆయా సంస్థలతో కూడా మాట్లాడతామని పేర్ని నాని హామీ ఇచ్చారు. చిన్న పట్టణాల్లోనూ థియేటర్లకు గ్రేడింగ్‌ సిస్టమ్‌ పెట్టాలని థియేటర్‌ యజమానులకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ సూచించారని తెలుస్తోంది.

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు మరియు థియేట‌ర్ల గ్రేడింగ్ విధానం పై సీఎం జగన్ మోహన్ రెడ్డితో చ‌ర్చించిన త‌ర్వాత నిర్ణయం తీసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చార‌ని ఎగ్జిబిట‌ర్లు తెలిపారు. థియేటర్లు నుంచి ఎఫ్డీసీ వసూలు చేస్తున్న న్యూస్ రీల్స్ మీద రెంటల్ చార్జీలు కూడా రద్దు చేయడానికి కూడా సానుకూలంగా స్పందించారని వారు వెల్లడించారు.

ఇకపోతే త్వరలో మిగిలిన జిల్లాల ఎగ్జిబిటర్లతో కూడా మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు. దీని తర్వాత ఆన్‌ లైన్ టిక్కెట్ విధానంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. సినిమా టికెట్ రేట్ల విషయంలో ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

కాగా, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చే సినిమా టికెటింగ్ పోర్టల్.. రైల్వే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో సేవలు అందిస్తుందని తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుందని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన జీవోలో పేర్కొంది. ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి టాలీవుడ్ నిర్మాతలు ఇదివరకే అంగీకారం తెలిపిన సంగతి విధితమే.