Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : గాలి సంపత్

By:  Tupaki Desk   |   12 March 2021 3:47 AM GMT
మూవీ రివ్యూ : గాలి సంపత్
X
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్-శ్రీవిష్ణు-లవ్లీ సింగ్-తనికెళ్ల భరణి-సత్య-కృష్ణ భగవాన్-రఘుబాబు తదితరులు

సంగీతం: అచ్చు రాజమణి

ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్

స్క్రీన్ ప్లే-దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి

కథ-నిర్మాత: ఎస్.కృష్ణ

దర్శకత్వం: అనీష్ కృష్ణ

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన చిన్న సినిమా ‘గాలి సంపత్’ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించగలిగింది. రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మహా శివరాత్రి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్) ఓ ప్రమాదంలో భార్యతో పాటు తన గొంతునూ కోల్పోయి.. కొడుకు సూరి (శ్రీ విష్ణ)నే లోకంగా బతికే మధ్య తరగతి వ్యక్తి. అతడికి నాటకాలంటే పిచ్చి. మంచి నాటకం వేసి ప్రైజ్ గెలిచి డ్రైవర్ అయిన తన కొడుక్కి ట్రక్ కొని ఇవ్వాలన్నది అతడి కోరిక. కానీ అతడి ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి కొడుక్కి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతుంటాడు. ఒక సందర్భంలో సంపత్ చేసిన తప్పిదం వల్ల సూరి పెళ్లి చెడిపోతుంది. అతను ఆర్థికంగానూ దెబ్బ తింటాడు. దీంతో సూరికి విపరీతమైన కోపం వచ్చి తండ్రిని అసహ్యించుకుని ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతాడు. అదే సమయంలో సంపత్ పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాడు. మరి ఆ ప్రమాదం నుంచి సంపత్ ఎలా బయటపడ్డాడు.. ఈలోపు తండ్రి గురించి సూరికి నిజాలు తెలిసి ఎలా మారాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: కొడుకు మీద అతి ప్రేమ చూపించే తండ్రి.. ఆయన్ని అర్థం చేసుకోలేని కొడుకు. తన కోస తండ్రి తపిస్తుంటే ఆయన్ని అపార్థం చేసుకుని దూరం పెట్టిన కొడుకు.. తన విలువ తెలుసుకుని చేరువయ్యే కథతో ఇంతకముందే కొన్ని సినిమాలు చూశాం. వాటితో పోలిస్తే ‘గాలి సంపత్’ను భిన్నంగా నిలబెట్టేది ఇందులో రాజేంద్ర ప్రసాద్ పోషించిన లీడ్ రోల్. తన జీవనాధారం అయిన మాటనే కోల్పోయాక.. ఫఫాఫిఫీ అంటూ విచిత్రమైన భాష మాట్లాడుతూ అల్లరి చేసే రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆరంభంలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ పాత్రతో పాటు ప్రేక్షకుడు ప్రయాణం చేయగలిగేలా చేసి ఉంటే ‘గాలి సంపత్’ ఒక ప్రత్యేకైమన సినిమాగా నిలిచేదే. ఐతే కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిప్పినప్పటికీ.. ఆ క్యారెక్టర్లో సహజత్వం లోపించడం, సన్నివేశాలు కూడా చాలా వరకు కృత్రిమంగా అనిపించడం వల్లో ఏమో ప్రేక్షకులకు దానిపై అనుకున్నంతగా ఆపేక్ష కానీ.. సానుభూతి కానీ కలగవు. రాజేంద్ర ప్రసాద్ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించినప్పటికీ.. ఈ పాత్రలో ఆయన కృత్రిమంగా అనిపించడం కూడా ‘గాలి సంపత్’కు మైనస్ అయింది. ఈ పాత్రను ప్రేక్షకులకు చేరువ చేయడంలో చిత్ర బృందం విఫలం కావడంతో ఎమోషన్ పిండటానికి చేసిన ప్రయత్నం ఫలించక ‘గాలి సంపత్’ చాలా వరకు విసిగిస్తుంది.

‘గాలి సంపత్’లో అత్యంత కీలకమైన విషయంలో వేసిన ఓ తప్పటడుగు గురించి మాట్లాడుకుందాం. రాజేంద్ర ప్రసాద్ పాత్రకు ఇందులో మాటలు రావు. ప్రమాదంలో గొంతు పోతుంది. కానీ ఆయన్ని పూర్తిగా మూగవాడిగా చూపించకుండా.. తనకు ఫఫాఫిఫీ అంటూ ఒక భాష పెట్టారు. పదాలు సక్రమంగా పలకడు అన్న మాటే కానీ.. తాను చెప్పాలనుకున్న మాటను ఈ ‘ఫ’ భాషలో శుభ్రంగా చెప్పేస్తుంటాడాయన. ఇది ప్రథమార్ధంలో కామెడీ పండించడం కోసం చేసుకున్న ఏర్పాటు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నవ్వించారు కూడా. ఫిఫిఫీ అంటూ అంటూ ఆయన మీద ఒక పాట సైతం పెట్టారు. ఐతే సినిమా అంతా ఇలాగే నడిపించేస్తే వేరేలా ఉండేది. కానీ విరామ సమయానికి ఆయన అనుకోకుండా బావిలో పడిపోగానే (ఇదేమీ స్పాయిలర్ కాదు. ట్రైలర్లో చూపించిన విషయమే) ఆయన గొంతు లోంచి ఏ శబ్దం రాదు. ‘ఫ’ భాష అంతర్ధానం అయిపోతుంది. ఆ బావి పైనే అందరూ మాట్లాడుకుంటుంటే ఆయనకు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు గొంతు లేదు కాబట్టి మాట్లాడలేడు. ఆయన శబ్దం చేయగలిగితే ఈ సినిమాలో ద్వితీయార్ధం అన్నదే ఉండదు. ఇలా లాజిక్ ను పక్కన పెట్టేసి సౌకర్యవంతంగా ఆ పాత్రను నడిపించడంతో ప్రేక్షకులకు తర్వాత జరిగే వ్యవహారం అంతా కృత్రిమంగా అనిపిస్తుంది. ఆ పాత్ర మీద రావాల్సిన సానుభూతి రాదు. ద్వితీయార్దంలో సెంటిమెంటు వర్కవుట్ కాలేదు.

ప్రథమార్ధంలో కథ మలుపు తిరిగే వరకైనా ‘గాలి సంపత్’ ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తుంది. మొదట్నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది రాజేంద్ర ప్రసాద్ పాత్ర.. దాంతో ముడిపడ్డ సన్నివేశాలు మాత్రమే. అది కాకుండా హీరో ప్రేమాయణం.. బ్యాంక్ మేనేజర్ ఎపిసోడ్ లాంటివి అయితే మరీ కృతకంగా ఉండి ప్రేక్షకులను విసిగిస్తాయి. హాలీవుడ్లో వచ్చిన ‘సర్వైవల్’ మూవీస్ టైపులో ద్వితీయార్ధాన్ని నడిపించారు కానీ.. అదంతా కూడా కన్వీనియంట్ గా ఉంటుంది తప్ప అక్కడ కూడా సహజత్వం లోపించింది. ఊరికే సన్నివేశాలను సాగదీస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప ఏ సన్నివేశాలూ సహజంగా సాగవు. రాజేంద్ర ప్రసాద్ పాత్రకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ను ఒకేసారి చూపించేయకుండా.. అక్కడక్కడా కట్ చేసి చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలబెట్టాలని చూశారు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో పెద్దగా విషయం లేకపోవడంతో ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ సైతం పని చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ తో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు.. కొన్ని సన్నివేశాల్లో ఆయన అద్భుత నటన మినహాయిస్తే ‘గాలి సంపత్’లో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు.

నటీనటులు: ‘గాలి సంపత్’లో రాజేంద్రప్రసాద్ కోసమే తీసిన సినిమా అనిపిస్తుంది. సినిమాలో ఆయనది వన్ మ్యాన్ షో. కెరీర్లో ఈ దశలో ఆయనకు ఇంత కీలకమైన పాత్ర దక్కడం విశేషమే. మాటలే లేకుండా కేవలం హావభావాలతో పండించాల్సిన సంపత్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ రాణించారు. ఇంటర్వెల్ ముంగిట మైమ్ షోలో రాజేంద్ర ప్రసాద్ కేవలం హావభావాలతో ఐదు నిమిషాల సన్నివేశాన్ని ఆయన పండించిన విధానం ఆకట్టుకుంటుంది. ఐతే సినిమాకు రాజేంద్ర ప్రసాద్ కొంతమేర మైనస్ కూడా అయ్యారు. గాలి సంపత్ పాత్రలో ఆయన నటన ఓవర్ ద టాప్ అనిపిస్తుంది. సటిల్ గా చేయాల్సిన పాత్రలో ‘అతి’గా నటించేయడం వల్ల ఆ పాత్ర దెబ్బ తింది. ఇక సూరి పాత్రను శ్రీ విష్ణు తనకు అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయాడు. అతను స్పెషల్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సిన స్థాయిలో ఆ పాత్ర లేదు. హీరోయిన్ లవ్లీ సింగ్ ప్రత్యేకత ఏమీ కనిపించదు. రాజేంద్ర ప్రసాద్ పక్కనే ఉండే పాత్రలో సత్య రాణించాడు. కొంత మేర నవ్వించాడు. తనికెళ్ల భరణి తన స్థాయికి తగ్గ హుందా పాత్రలో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్ నటన అతిగా అనిపిస్తుంది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం: అచ్చు రాజమణి సంగీతం సోసోగా అనిపిస్తుంది. ఫీఫీఫీ పాట ఒకటి కొంచెం భిన్నంగా సాగుతుంది. మిగతా పాటలన్నీ మామూలే. నేపథ్య సంగీతం పర్వాలేదు. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. అరకు ప్రాంతాన్ని అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు ఏమంత గొప్పగా అనిపించవు. ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం వేసిన సెట్ నే ఈ సినిమాకు కూడా వాడేసుకున్నారు. అది అసహజంగా అనిపిస్తుంది. ఓవైపు హీరో ఆర్థిక ఇబ్బందులు చూపిస్తూ.. లంకంత ఆ కొంపలో ఉంటున్నట్లు చూపించడం బాగా అనిపించదు. ఈ చిత్ర నిర్మాత కృష్ణనే అందించిన కథలో విషయం ఉంది. కానీ దాన్ని తెరపై సరిగా ప్రెజెంట్ చేయలేకపోయారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే.. మాటలు రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. కానీ అతడి నైపుణ్యం ఏమీ ఇందులో కనిపించదు. ఈ టైపు సినిమాలు అతడికి నప్పవనిపిస్తుంది. స్క్రీన్ ప్లేనే ఈ సినిమాకు అతి పెద్ద మైనస్. దర్శకుడిగా అనీష్ కృష్ణ చేసిందేమీ కూడా లేదు. సహజత్వంతో హృద్యంగా తీయాల్సిన సినిమాను లౌడ్ గా చేసి చెడగొట్టేశారు.

చివరగా: గాలి సంపత్.. గాడి తప్పాడు

రేటింగ్- 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre