Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ రివ్యూ : గాలి వాన

By:  Tupaki Desk   |   17 April 2022 8:42 AM GMT
వెబ్ సిరీస్ రివ్యూ : గాలి వాన
X
వెబ్ సిరీస్ రివ్యూ : గాలి వాన

నటీనటులు: సాయికుమార్-రాధిక శరత్ కుమార్-చైతన్య కృష్ణ-చాందిని చౌదరి-శరణ్య ప్రదీప్-నందిని రాయ్-తాగుబోతు రమేష్-అశ్రిత వేముగంటి-శ్రీలక్ష్మి తదితరులు
సంగీతం: హరి గౌర
ఛాయాగ్రహణం: సుజాత సిద్దార్థ్
కథానుసరణ-మాటలు: చంద్ర పెమ్మరాజు
స్క్రీన్ ప్లే: చంద్ర పెమ్మరాజు-సిద్దార్థ్ హిర్వె-రియా పూజారి-అనూజ్ రజోరియా
నిర్మాతలు: శరత్ మరార్-సమీర్ గొగాటె
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి

గాలి వాన.. జీ5 ఓటీటీ కొత్తగా అందిస్తున్న వెబ్ సిరీస్. 'కాటమరాయుడు' నిర్మాత శరత్ మరార్ నిర్మాణంలో 'కిరాక్ పార్టీ'.. 'తిమ్మరసు' చిత్రాల దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ షోను రూపొందించాడు. ఆసక్తికర ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ థ్రిల్లర్ డ్రామా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గోదావరి ప్రాంతంలోని కొమర్రాజు లంకలో నివాసముండే ఊరి పెద్ద కొమర్రాజు (సాయికుమార్) కుటుంబంలో పెద్ద విషాదం చోటు చేసుకుంటుంది. పెళ్లయిన తొలి రాత్రే ఆయన కూతురు-అల్లుడు హత్యకు గురవుతారు. ఇది తెలిసి వియ్యంకురాలు సరస్వతి (రాధిక శరత్ కుమార్) కుటుంబం కొమర్రాజు ఇంటికి చేరుకుంటుంది. అదే సమయంలో కొమర్రాజు కూతురు-అల్లుడిని హత్య చేసిన శీను అనే వ్యక్తి వారి ఇంటి ముందుకే వచ్చి రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. అతడికి ప్రథమ చికిత్స చేయబోతుండగానే.. తనే జంట హత్యలకు కారణమని ఆ ఇంట్లోని వారికి తెలుస్తుంది. ఆ రాత్రే అతను కూడా హత్యకు గురవుతాడు. ఐతే శీనును ఎవరు చంపారో ఎవరికీ తెలియదు. ఈ లోపు పోలీసులు జంట హత్యల కేసు విచారణ కోసమని కొమర్రాజు ఇంటికి వస్తారు. వారి కంట పడకుండా కొమర్రాజు-సరస్వతి కుటుంబాలు శీను శవాన్ని మాయం చేస్తాయి. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆ శవం పోలీసులకు దొరుకుతుంది. ఈ జంట హత్యల వెనుక అసలు కారణాలేంటో కూడా వెల్లడవుతాయి. ఆ కారణాలేంటి.. ఆ హత్యలు చేయించిందెవరు.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'గాలి వాన' బీబీసీ స్టూడియోస్ వాళ్లు రూపొందించిన ఒక వెబ్ సిరీస్ కు తెలుగు అడాప్షన్. ఈ కాన్సెప్ట్ ను లోకలైజ్ చేసి.. మన నేటివిటీతో ఉన్నంతలో ఆసక్తికరంగానే తీర్చిదిద్దారు శరణ్ కొప్పిశెట్టి అండ్ టీం. కాకపోతే నాలుగ్గంటలకు పైగా నిడివితో ఏడు ఎపిసోడ్లుగా తీర్చిదిద్దేంత విషయం అయితే ఇందులో లేకపోయింది. ఆరంభంలో ఆసక్తికరంగా అనిపించినా.. చివరి ఎపిసోడ్లు ఉత్కంఠ రేకెత్తించినా.. మధ్యలో అనవసర పాత్రలు.. కథలో ఇమడని కొన్ని ఎపిసోడ్లు.. లాజిక్ కొరవడ్డ సన్నివేశాలు ఈ సిరీస్ గ్రాఫ్ ను తగ్గించాయి. కానీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసి.. థ్రిల్ చేసే చివరి ట్విస్ట్.. దాని చుట్టూ నడిపిన డ్రామా కోసం 'గాలి వాన'పై కచ్చితంగా ఒక లుక్కేయొచ్చు. కానీ అంతకంటే ముందు పడుతూ లేస్తూ సాగే ఎపిసోడ్లను కొంచెం ఓపిగ్గా చూస్తూ పోవాలి.

కొత్తగా పెళ్లయిన జంట వారి తొలి రాత్రే హత్యకు గురైతే.. ఇరువురి కుటుంబాల్లో రేగే అలజడి.. ఈ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాకు తోడు.. ఆ హత్యల వెనుక ఎవరున్నారనే మిస్టరీ చుట్టూ 'గాలి వాన' నడుస్తుంది. ఐతే ఆరంభ ఎపిసోడ్లలో ఈ మిస్టరీ చుట్టూ పెద్దగా కథను నడిపించలేదు. ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్లు.. డ్రామా మీదే ఐదో ఎపిసోడ్ వరకు కథ నడిచింది. ఈ హత్యలకు అసలు కారణమేంటి.. దీని వెనుక ఏదైనా మిస్టరీ ఉందా అన్న సందేహాలు కూడా ప్రేక్షకులకు రాని విధంగా.. ఆ విషయాన్ని పక్కన పెట్టేశాడు దర్శకుడు. చివర్లో సర్ప్రైజ్ చేద్దామనుకున్నారో ఏమో కానీ.. దాన్నలా పక్కన పెట్టేసి ఫ్యామిలీ డ్రామా.. సెంటిమెంట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో మధ్యలో ఎపిసోడ్లు బోర్ కొట్టిస్తాయి. జంట హత్యలు చేసిన వ్యక్తి హత్యకు గురి కావడం.. అతణ్ని ఎవరు చంపారు.. దాన్ని కవరప్ చేయడానికి ఏం చేశారు.. ఇవి చూపించడానికే చాలా సమయం తీసుకున్నారు. చాలా సీన్లు సిల్లీగా.. లాజిక్ లెస్ గా.. ఆషామాషీగా లాగించేయడంతో ప్రేక్షకుల్లో క్రమంగా ఆసక్తి సన్నగిల్లిపోతుంది.

ఓ వైపు పోలీస్ అధికారిగా నందిని రాయ్ తన కేసు విషయంలో చాలా సిన్సియర్ గా పని చేస్తూ.. ఇంకో వైపు డ్రగ్ రాకెట్లో భాగం అయ్యేట్లు సమాంతరంగా ఒక ఎపిసోడ్ చూపించారిందులో. ఈ షోకు ఆ ఎపిసోడ్ అవసరం ఏంటో.. దాని ద్వారా ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాదు. ఈ విషయంలో నందిని పాత్రకు సరైన జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అలాగే కృష్ణచైతన్య భార్య.. తన మొదటి భర్త వల్ల కలిగిన పాప కస్టడీ కోసం ప్రయత్నించే ఎపిసోడ్.. చాందిని చౌదరికి ఆమె పని చేసే ఆసుపత్రితో ఒక పేషెంట్ తో నడిచే ట్రాక్.. ఇవేవీ కూడా ఈ కథకు అవసరం అనిపించవు. వాటిలో ఏ ప్రత్యేకతా లేదు. ఇవన్నీ అసలు కథ నుంచి ప్రేక్షకులను డీవియేట్ చేసి ఆసక్తి సన్నగిల్లేలా చేస్తాయి. వీటిని కుదించి.. ఏడు ఎపిసోడ్లను నాలుగైదుకు తగ్గించి.. ప్రధానంగా జంట హత్యల మర్డర్ మిస్టరీ చుట్టూ కథను నడిపి ఉంటే ఇంపాక్ట్ వేరుగా ఉండేదేమో. ఐతే ఈ బలహీనతల గురించి పక్కన పెడితే.. చివరి రెండు ఎపిసోడ్లలో మాత్రం 'గాలి వాన' ఊపందుకుంటుంది. హత్యల వెనుక అసలు మిస్టరీ వీడే క్రమంలో వచ్చే పెద్ద ట్విస్ట్ ఈ షోకు మేజర్ హైలైట్. ఇది ప్రేక్షకుల ఊహకు అందనిది. ఆ ట్విస్ట్ చుట్టూ నడిపిన డ్రామా ఆకట్టుకుంటుంది. థ్రిల్లింగ్ గా అనిపించే పతాక సన్నివేశాలతో షో మీద ఇంప్రెషన్ మారుతుంది. మధ్యలో ఎపిసోడ్లను కొంచెం ఓపికతో చూడగలిగితే ఆఖరి రెండు ఎపిసోడ్లతో సంతృప్తి చెందొచ్చు. ఓవరాల్ గా చూస్తే 'గాలి వాన' మరీ గొప్పగా అనిపించదు. తీసిపడేసేలా ఉండదు. కాలక్షేపానికి ఓకే.

నటీనటులు:

సాయికుమార్ 'గాలి వాన'కు అతి పెద్ద బలం. ఆయన ఈ షోను తన భుజాల మీద మోశాడని చెప్పాలి. ఒక దశ వరకు ఈ పాత్ర మామూలుగా అనిపించినా.. చివర్లో వేసే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. సినిమాల్లో మాదిరి కాకుండా.. తన పాత్రకు అవసరమైన మేర కూల్ గా నటించారాయన. ఆయనలో కొత్త కోణం కనిపిస్తుందీ షోలో. రాధిక శరత్ కుమార్ తెలుగులో చాన్నాళ్లకు మంచి పాత్ర చేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన అనుభవాన్ని చూపించింది. చాందిని చౌదరి కీలకమైన పాత్రలో రాణించింది. ఆమెకు ఇందులో నటించడానికి బాగానే స్కోప్ దొరికింది. మార్తాండ్ పాత్రలో కృష్ణచైతన్య కూడా ఆకట్టుకున్నాడు. శరణ్య ప్రదీప్ బాగా చేసింది. పోలీస్ పాత్రలో నందిని రాయ్ కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది. ఆమె లుక్.. మేకప్ బాగా లేదు. నటన కూడా అంతంతమాత్రమే. ఆమె సహాయ పాత్రలో తాగుబోతు రమేష్ ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'గాలి వాన' మంచి ప్రమాణాలతోనే సాగింది. హరి గౌర నేపథ్య సంగీతం బాగుంది. కెమెరామన్ సుజాత సిద్దార్థ్ ఎంచుకున్న కలర్ ప్యాటెర్న్.. తన విజువల్స్.. ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. నిర్మాణ విలువలు ఓకే. రచయిత చంద్ర పెమ్మరాజు తన పనితనం చూపించాడు. 'తిమ్మరసు' తర్వాత దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి థ్రిల్లర్ కథాంశాన్ని డీల్ చేయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటాడు. కానీ ఫ్యామిలీ డ్రామా.. మిగతా ఎపిసోడ్ల విషయంలో అతను సాధారణంగా కనిపించాడు.

చివరగా: గాలి వాన.. కొన్ని మెరుపుల కోసం

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre