Begin typing your search above and press return to search.

గాంధీ విగ్ర‌హాన్ని కాల్వ‌లో ప‌డేశారు

By:  Tupaki Desk   |   5 Aug 2016 3:56 PM GMT
గాంధీ విగ్ర‌హాన్ని కాల్వ‌లో ప‌డేశారు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో వివాదంలో చిక్కుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విగ్ర‌హాల తొల‌గింపు విష‌యంలో అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇపుడు జాతిపిత‌ను ఘోరంగా అవ‌మానించిన సంఘ‌ట‌న‌లో ఇరుకున ప‌డింది. విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్ వ‌ద్ద‌నున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొల‌గించిన విష‌యంలో వివాదం రేగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ విగ్ర‌హం కాలువ‌లో తేల‌డం ఉద్రిక్త‌త‌కు దారితీసింది.

దాదాపుగా 30 ఏళ్ల నుంచి సెంట‌ర్ వ‌ద్ద‌నున్న గాంధీజీ విగ్ర‌హాన్ని తొల‌గించేందుకు ప్ర‌య‌త్నాలు సాగిన‌ప్ప‌టికీ అవి విఫ‌లం అయ్యాయి. అయితే తాజాగా శుక్ర‌వారం తెల్లవారు స‌మ‌యంలో జాతిపిత విగ్ర‌హం తొల‌గించ‌డం వివాదం పాల‌యింది. దీనిపై చెల‌రేగిన ఆగ్ర‌హావేశాలు చ‌ల్లార‌క ముందే గాంధీజీ విగ్ర‌హాన్ని స‌మీపంలోని బుడ‌మేరు కాలువ‌లో ప‌డేశార‌ని వార్త‌లు వెలువ‌డ‌టం క‌ల‌క‌లం సృష్టించింది. స్థానికులు ప‌లువురు ఈ వార్త‌ను తెలుసుకొని కాలువ‌లోని జాతిపిత విగ్ర‌హానికి చెందిన ముక్క‌లు తీసుకొని వ‌చ్చారు. గాంధీజి విగ్ర‌హాన్ని పాత స్థ‌లంలోనే ప్ర‌తిష్టించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప‌లువురు రాష్ట్ర ప్ర‌భుత్వం - అధికారుల తీరును నిర‌సిస్తూ న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న తెలిపారు.