Begin typing your search above and press return to search.

అందం కాదు, గట్స్ ఉన్న బ్యూటీ!

By:  Tupaki Desk   |   3 Nov 2016 5:30 AM GMT
అందం కాదు, గట్స్ ఉన్న బ్యూటీ!
X
అది 2002 సంవత్సరం... ఆమె సోదరుడు ఒక కుటుంబంతో గొడవ పడినందుకు కొందరు పెద్దలు ఆమెకు సామూహిక అత్యాచారం శిక్ష విధించారు. అలాంటి శిక్షలు కూడా ఉంటాయా? అనే అనుమానాం వలదు! ఇది పాకిస్థాన్ లో జరిగిన సంఘటన!! ఈ శిక్ష అనంతరం ఆమెను నగ్నంగా నడివీధిలో పరుగెత్తించారు. సాధారణంగా పాకిస్థాన్‌ లో ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు బాధిత మహిళలు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఒక మహిళ మాత్రం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడింది.. నాటినుంచి ఆమె మహిళా హక్కుల కార్యకర్తగా మారింది.. ఆమె కరాచీకి చెందిన "ముక్తార్ మాయి"!

ఈ అత్యాచార బాధితురాలు తాజాగా పాకిస్థాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ లో ర్యాంప్‌ వాక్‌ చేసి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. మూడు రోజుల పాటు జరిగిన పాకిస్థాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ లో 44 ఏళ్ల ముక్తార్‌ మాయి పాల్గొంది. రోజినా మునిబ్‌ డిజైన్‌ చేసిన బ్రైడల్‌ దుస్తులను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేసింది. సమస్యలను ఎదుర్కొనే స్థైర్యాన్ని మహిళల్లో నింపాలని భావించిన డిజైనర్‌ మునిబ్‌ ర్యాంప్‌ వాక్‌ చేయమని మాయిని కోరగా అందుకు ఆమె అంగీకరించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన మాయి... "నేను వేసిన ఒక్క ముందడుగు వల్ల ఒక్క మహిళకి మేలు జరిగినా చాలు.. అదే నాకు సంతోషం.. నా లాగా కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచి వారి తరపున మాట్లాడాలని అనుకుంటున్నాను.. మనం బలహీనులం కాదు, మనకి హృదయం, మెదడు ఉంది.. ఆలోచించే శక్తి ఉంది.. ఈ సందేశాన్ని నా సోదరీమణులకు ఇవ్వాలని ఆశిస్తున్నాను.. న్యాయం జరగనంత మాత్రాన నమ్మకాన్ని వదులుకోకూడదు.. ఏదో ఒక రోజు తప్పకుండా న్యాయం జరుగుతుంది.." అని పేర్కొంది. దీంతో అందం కాదు గట్స్ ఉన్న బ్యూటీ గా ఈమెను అంతర్జాతీయ మీడియా అభినందిస్తోంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/