Begin typing your search above and press return to search.

వైజాగ్ కి టాలీవుడ్ ని త‌ర‌లించాల‌ట‌!

By:  Tupaki Desk   |   30 Dec 2018 4:00 PM GMT
వైజాగ్ కి టాలీవుడ్ ని త‌ర‌లించాల‌ట‌!
X
మ‌ద్రాస్ నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ త‌రలి వ‌చ్చేప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఎక్క‌డ పెట్టాలి? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. అయితే ఆ టైమ్‌ లో రాజ‌కీయ నాయ‌కులు - సినీమేధావులు అంతా క‌లిసి బీచ్ సొగసుల విశాఖ న‌గ‌రంలో సినీప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పితే ఆ అందం ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని భావించారు. కానీ ర‌క‌ర‌కాల రాజ‌కీయ కార‌ణాల‌తో సినీప‌రిశ్ర‌మ‌ను హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయాల్సి వ‌చ్చింద‌ని ప‌లువురు సినీపెద్ద‌లు ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. అయితే అది ఎంత చారిత్ర‌క త‌ప్పిదమో రాష్ట్ర విభ‌జ‌న వేళ తెలిసొచ్చింద‌ని ఆవేద‌న చెందిన వాళ్లు ఉన్నారు. అయితే ఆ త‌ప్పిదం గ‌తం గ‌తః అనుకోవాలి. ప్ర‌స్తుతం ఏంటి అన్న‌దే ఇంపార్టెంట్.

ప‌రిశ్ర‌మ త‌ర‌లింపు ప‌ర్య‌వ‌సానం ఏదైనా కానీ, సినీప‌రిశ్ర‌మ వ‌ల్ల రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ గ్లామ‌ర్ తో తొణికిస‌లాడుతోంది. భార‌తీయ సినిమాకి 100ఏళ్ల చ‌రిత్ర ఉంటే, అందులో 88ఏళ్ల చ‌రిత్ర టాలీవుడ్ కి ఉంది. ఆ చ‌రిత్ర మొత్తం హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌తో ముడిప‌డి ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పి అభివృద్ధి చేయ‌డానికి ద‌శాబ్ధాలు ప‌ట్టింది. అయితే తెలంగాణ నుంచి ఏపీ విడిపోయాక ప‌రిశ్ర‌మ వైజాగ్ కి త‌ర‌లి వెళుతుంద‌న్న చ‌ర్చా సాగింది. కానీ అది ఇంత‌వ‌ర‌కూ సాధ్య‌ప‌డ‌లేదు. ఇక‌పోతే తెరాస ప్ర‌భుత్వం సినీపరిశ్ర‌మ ఎటూ వెళ్ల‌కుండా భ‌రోసా ఇవ్వ‌డంతో సినీపెద్ద‌లు చ‌ల్ల‌బ‌డ్డారు. ఇండ‌స్ట్రీని వైజాగ్ కి త‌ర‌లిస్తామంటూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌దే ప‌దే చెబుతున్నా ప్ర‌స్తుతం ఆ మాట‌ల్ని న‌మ్మేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేరు. అలాగే ఏపీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీ‌నివాస‌రావు ప‌దే ప‌దే వేదిక‌లు ఎక్కిన‌ప్పుడ‌ల్లా సినీప‌రిశ్ర‌మ వైజాగ్‌కి త‌ర‌లి రావాల‌ని కోరుతుంటారు. ఇక్క‌డ అభివృద్ధి చేసేస్తున్నామ‌ని చుక్క‌లు చూపిస్తుంటారు. కానీ ఏదీ నిజం కాద‌న్న‌ది జ‌నాల‌కే ఎరుక‌. ఆయ‌న ఎంత బ‌లంగా కోరుకుంటే చంద్ర‌బాబు అంత వెన‌క్కి త‌గ్గ‌డంపైనా ఇటీవ‌ల ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. అయినా నిన్నొద‌ల బొమ్మాళీ అన్న తీరుగా గంటా శ్రీ‌నివాస‌రావు మ‌రోసారి వైజాగ్ టాలీవుడ్ గురించి ప్ర‌స్థావించారు.

నేటి సాయంత్రం వైజాగ్ ఉత్స‌వ్‌-2018లో జ‌రుగుతున్న `ఎఫ్- 2` ఆడియో వేడుక‌లో గంటా శ్రీ‌నివాస‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ న‌గ‌రానికి సినీప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాల్సి ఉంది. ప‌రిశ్రమ ఇక్క‌డికి వెంట‌నే రావాలి. ఈ విష‌యంపై హీరో వెంక‌టేష్ బాబును అడిగాను. వారి నాన్న‌గారు నాయుడుగారిని అప్ప‌ట్లో అడిగాను. అంద‌రూ ఎంతో పాజిటివ్ గానే స్పందించారు. ఇప్పుడు వెంకీ కూడా అన్నారు. వైజాగ్ లోనే షూటింగులు ఎక్కువ జ‌రిగేలా చేస్తాన‌ని మాటిచ్చారు. నిర్మాత దిల్ రాజు ఇక్క‌డే త‌మ సినిమాల్లో కొంత భాగం తెర‌కెక్కిస్తామ‌ని అన్నారు. టాలీవుడ్ సినిమాల‌న్నీ ఇక్క‌డ తెర‌కెక్కించాలి. ఇప్ప‌టికే బోలెడ‌న్ని షూటింగులు జ‌రుగుతున్నందుకు ఆనందంగా ఉంది అని అన్నారు. అయితే గంటా ఆవేద‌న‌ను సినీపెద్ద‌లు అర్థం చేసుకుంటారా? దానికి రాజ‌కీయంగానూ చైత‌న్యం వ‌చ్చిన‌ప్పుడే ఏదైనా సాధ్యం. కానీ ఆ సీన్‌ ఏపీలో లేనేలేదు.