Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: గరం

By:  Tupaki Desk   |   12 Feb 2016 12:25 PM GMT
మూవీ రివ్యూ: గరం
X
చిత్రం: గరం

నటీనటులు: ఆది - ఆదా శర్మ - కబీర్ సింగ్ - సత్య ప్రకాష్ - కృష్ణచైతన్య - షకలక శంకర్ - మధునందన్ - బ్రహ్మానందం - పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: అగస్త్య
ఛాయాగ్రహణం: సురేందర్ రెడ్డి
కథ - మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి
నిర్మాత- సాయికుమార్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మదన్

ప్రేమ కావాలి - లవ్లీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సాయికుమార్ తనయుడు ఆది ఆ తర్వాత గాడి తప్పాడు. మరోవైపు పెళ్లైన కొత్తలో లాంటి క్లాస్ సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మదన్.. ‘ప్రవరాఖ్యుడు’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గరం’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం వాళ్లిద్దరికీ ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

వరం(ఆది) బాధ్యత తెలియకుండా ఆవారాగా తిరిగేసే కుర్రాడు. అతడి పక్కింట్లో ఉండే రవి (కృష్ణచైతన్య) మాత్రం బుద్ధిగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతాడు. రవితో పోల్చి తండ్రి తనను తిట్టిపోయడంతో అతడి మీద, అతడి కుటుంబం మీద పగ పెంచుకుంటాడు వరం. ఐతే వరాలు ఓ సందర్భంలో ఉన్నట్లుండి బుద్ధి తెచ్చుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్ బయల్దేరతాడు. అక్కడ ముస్లిం అమ్మాయి మీరా (ఆదా శర్మ)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి వెంట తిరుగుతూ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తన ఫ్రెండుకి యాక్సిడెంట్ అవుతుంది. అతణ్ని చేర్చిన హాస్పిటల్లోనే తన పక్కింటి రవి చావు బతుకుల మధ్య కనిపిస్తాడు. అతణ్ని రౌడీలు చంపేయబోతుంటే అడ్డుపడి వాళ్లను కొడతాడు వరం. అప్పుడే తెలుస్తుంది వరాలు సిటీకి వచ్చింది ఉద్యోగం కోసం కాదు, రవి కోసం అని. ఇంతకీ రవి ఎందుకలా అయ్యాడు.. అతడి గతమేంటి.. వరం సిటీకి రావడానికి కారణమేంటి.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘గరం’ కథకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఆల్రెడీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాతో దర్శకత్వ అరంగేట్రం కూడా చేసేశాడు. అందులో హీరో ‘‘సినిమాల్లో హీరోలు కూడా ఫస్టాఫ్ అంతా నాలాగే ఖాళీగా తిరిగేస్తుంటారు. సెకండాఫ్ లో బిజీ అయిపోతారు’’ అని డైలాగ్ చెబుతాడు. కమర్షియల్ తెలుగు సినిమాల్ని కాచి వడబోసి రాసిన డైలాగ్ ఇది. దర్శకుడిగా తన తొలి సినిమా తరహాలోనే శ్రీనివాస్ ‘గరం’కు కూడా ఫక్తు కమర్షియల్ ఫార్ములాను తూచా తప్పకుండా ఫాలో అయిపోయాడు.

హీరో అల్లరి చిల్లరిగా తిరిగేస్తుంటాడు. అందరూ అతణ్ని ఎందుకూ పనికి రాడని తిట్టిపోస్తుంటారు. అలాంటోడు ఉన్నట్లుండి సిటీకొచ్చి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఓ అమ్మాయి వెంటా పడతాడు. హీరో అల్లరి వేషాలు.. అతడి ఫ్రెండ్స్ బ్యాచ్ పంచులు.. రెండు ఫైట్లు.. ఒక ఇంట్రడక్షన్ సాంగ్.. ఇంకో డ్యూయెట్.. ఇలా ఫక్తు ఫార్ములా ప్రకారం సాగిపోతుంది ‘గరం’ కథ. ఇక ఇంటర్వెల్ దగ్గరికొచ్చేసరికి ఒక పెద్ద ఫైటు.. దాని వెంటే ఓ ట్విస్టు.. కట్ చేస్తే హీరో సిటీకి రావడం వెనుక ఓ పెద్ద కారణం.. దాని తాలూకు ఫ్లాష్ బ్యాక్.. ఆ తర్వాత విలన్ల ఆట కట్టించడానికి హీరో ప్లాన్స్.. చివర్లో ఓ భారీ క్లైమాక్స్. ఇదీ ‘గరం’ వరస.

ఉద్యోగాలిచ్చే ఎన్జీవో పేరుతో విలన్ గ్యాంగ్ డబ్బులు దండుకోవడం నేపథ్యంలో శ్రీనివాస్ రాసిన లైన్ బాగానే ఉంది. కానీ ఈ లైన్ చుట్టూ రాసుకున్న కథనమే ‘గరం’ మూవీకి మైనస్ అయింది. క్లాస్ డైరెక్టర్ అయిన మదన్.. తనకు నప్పని మాస్ కథను ఆకళింపు చేసుకుని.. దాన్ని అనుకున్నట్లుగా తెరమీదికి తేవడంలో సక్సెస్ కాలేకపోయాడు. అసలు పాయింట్ బాగానే ఉన్నా.. దాన్ని చివరికి నెట్టేసి, అర్థం లేని కామెడీతో కథనాన్ని నడిపించడానికి ప్రయాస పడ్డాడు.
తొలి గంటలో అసలు కథే మొదలవదు. అక్కడక్కడా ఒకట్రెండు కామెడీ సన్నివేశాలు తప్పితే ఈ గంటలో చెప్పుకోవడానికేమీ లేదు. రొటీన్ పాటలు, రొటీన్ సన్నివేశాలతో కథనం భారంగా గడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర్నుంచి ఆసక్తి మొదలవుతుంది. ఎమోషనల్ గా సాగే ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదు. ఐతే ఆ తర్వాత హీరో స్నేహితుడికి అసలేం జరిగింది అనే విషయాన్ని బయటపెట్టకుండా మళ్లీ కామెడీ పేరుతో జత చేసిన చెత్త సన్నివేశాలు సినిమా మీద ఆసక్తి సన్నగిల్లిపోయేలా చేశాయి.

హీరో ఫ్రెండు, హీరోయిన్ కు సంబంధించిన గుట్టు విప్పేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ఫైట్.. ఫ్లాష్ బ్యాక్ బాగున్నా.. అప్పటికి చాలా ఆలస్యమైపోయింది. ఇలాంటి సినిమాలకు నిడివి సాధ్యమైనంత తక్కువ ఉంటే బాగుండేది. రెండు అర్ధాల్లోనూ అర్థం లేని కొన్ని సన్నివేశాల మూలంగా లాగ్ ఎక్కువైంది. కథాకథనాలన్నీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు సాగిపోవడం కూడా మైనస్. మాస్ జనాలకు నచ్చే హీరోయిజం, కొన్ని సన్నివేశాలు, ఫైట్లు ‘గరం’ సినిమాను బి, సి సెంటర్లలో నిలబెట్టవచ్చు. ఐతే కొత్తదనం కోరుకునే వాళ్లకు మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు:

ఆది హుషారుగా నటించాడు. డ్యాన్సులు - ఫైట్లలో ఈజ్ చూపించాడు. ఇంట్రడక్షన్ సాంగ్ లో డ్యాన్సులు బాగున్నాయి. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ లోనూ బాగా చేశాడు. మాస్ ఇమేజ్ కోసమో ఏమో అతణ్ని మరీ రఫ్ గెటప్ లో చూపించే ప్రయత్నం చేశారు. అదంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆదా శర్మకు ఓ దండం పెట్టేయాల్సిందే. సినిమా సినిమాకూ ఆమెలో హీరోయిన్ లక్షణాలు తగ్గిపోతున్నాయి. అందం - నటన రెండిట్లోనూ ఆమె ఆకట్టుకోలేదు. విలన్ కబీర్ సింగ్ పాత్ర నిడివి తక్కువ. అతను ప్రత్యేకంగా ఏదో చేసే ఛాన్స్ ఏమీ దక్కలేదు ఇందులో. నరేష్ చాలా బాగా నటించాడు. తనికెళ్ల భరణి కూడా బాగా చేశాడు. కృష్ణచైతన్య పాత్ర పరిధికి తగ్గట్లు నటించాడు. షకలక శంకర్ - మధునందన్ అక్కడక్కడా నవ్వించారు. బ్రహ్మానందం గురించి చెప్పడానికేమీ లేదు. పోసాని మామూలే.

సాంకేతిక వర్గం:

టెక్నీషియన్స్ అందరూ సినిమాకు తగ్గట్లే పని చేశారు. అగస్త్య పాటలు పర్వాలేదు. గుర్తుంచుకునే ట్యూన్లేమీ లేవు. ఏదో అలా నడిచిపోయాయంతే. నేపథ్య సంగీతం ఓకే. ఛాయాగ్రహణం కూడా సోసోగా అనిపిస్తుంది. ఎడిటింగ్ సినిమాకు మైనస్. అక్కడక్కడా కథనానికి సంబంధం లేని సన్నివేశాలు వచ్చిపడ్డాయి. జంప్ లు - జర్క్ లు ఇబ్బంది పెడతాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. కథకుడు శ్రీనివాసే డైలాగులు కూడా రాశాడు. 30 రోజుల్లో హిందీ భాష పుస్తకం చూసి.. రెండు కొంటే 15 రోజుల్లోనే భాష వచ్చేస్తుందంటుంది ఓ కామెడీ క్యారెక్టర్. ఇలాంటి వెంగళప్ప జోకుల్ని పెడితే జనాలు నవ్వేస్తారా? దర్శకుడు మదన్ మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ఏదో సినిమా చేశాడు కానీ.. ఇందులో ఎక్కడా అతడి ముద్ర లేదు. మాస్ సినిమాలు అతడికి నప్పవని చాలా స్పష్టంగా తెలియజెప్పింది ‘గరం’.

చివరగా: ఇది.. రొటీన్ ‘గరం’ మసాలానే.

రేటింగ్: 2.5/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre