Begin typing your search above and press return to search.

తగ్గేదేలే.. 'పుష్ప' మేకర్స్ పై గరికపాటి ఫైర్..!

By:  Tupaki Desk   |   3 Feb 2022 5:30 AM GMT
తగ్గేదేలే.. పుష్ప మేకర్స్ పై గరికపాటి ఫైర్..!
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టింది. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనే ఈ సినిమా మొదటి భాగం కథాంశం. పుష్పరాజ్ గా బన్నీ నటనకు సినీ అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. ఇందులో 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అనే డైలాగ్ మరియు 'తగ్గేదే లే' అంటూ బన్నీ మ్యానరిజం ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు తాజాగా పుష్పరాజ్ సృష్టికర్తలపై ఫైర్ అయ్యారు.

గరికపాటి సాధారణంగా రామాయణం - మహాభారతం మరియు భగవద్గీతలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. దేవుళ్లను హీరోలుగా ఎలివేట్ చేస్తూ.. ప్రజలను ముఖ్యంగా యువతను రోల్ మోడల్‌ గా తీసుకునేలా ప్రభావితం చేస్తుంటారు. తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రవచనకర్త మాట్లాడుతూ.. సత్కారాల కోసం ప్రవచనాలు చేయనని అన్నారు. తన ప్రసంగాలు మార్పు కోసమే అని.. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమాల గురించి మాట్లాడుతూ 'పుష్ప' పై మండిపడ్డారు.

''సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ - ఇడియట్.. నిన్నగాక మొన్న వచ్చిన ‘పుష్ప’.. ఇందులో హీరోను ఒక స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో చివర్లో ఇప్పుడు ఐదు నిమిషాలు మంచి చూపిస్తాము.. లేదా ఎప్పుడో నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాం అంటారు. మీరు రెండు మూడు భాగాలు తీసే లోపు సమాజం చెడిపోవాలా?. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా? అది ఈ రోజు ఒక పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది. ఇప్పుడు కుర్రాళ్ళు కూడా ఎవరినైనా గూబ మీద కొట్టి తగ్గేది లేదంటున్నారు. దీనికి ఎవరు కారణం?'' అని గరికపాటి ప్రశ్నించారు.

''జరిగింది చెడు కాబట్టి నాకు కోపం వస్తుంది. ఆ హీరోను గానీ, డైరెక్టర్ గాని సమాధానం చెప్పమనండి.. అక్కడే కడిగేస్తా వాళ్ళని. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. అసలు తగ్గేదే లే వంటి డైలాగ్ ను ఎవరు వాడాలి? శ్రీరాములు లాంటివారు వాడాలి.. హరిశ్చంద్రుడి వంటివారు వాడాలి. అంతేగాని ఒక స్మగ్లర్ అలాంటి డైలాగ్ వాడడం ఏంటండి? ఏది సంచలనం చేయాలో అది మానేసి.. దుర్మార్గాన్నిదొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం'' అని గరికపాటి నరసింహా రావు ఫైర్ అయ్యారు. మరి ప్రవచనకర్త వ్యాఖ్యలపై ‘పుష్ప’ చిత్ర బృందం ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలాఉంటే 'పుష్ప' రెండో భాగం 'పుష్ప: ది రూల్' ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.