Begin typing your search above and press return to search.

‘ఊపిరి’ని వాళ్లూ గుర్తించారండోయ్...

By:  Tupaki Desk   |   1 April 2016 3:44 AM GMT
‘ఊపిరి’ని వాళ్లూ గుర్తించారండోయ్...
X
ఓ ఇంటర్నేషనల్ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని.. అధికారికంగా రీమేక్ చేసి సౌత్ ఇండియన్ సినిమా గౌరవాన్ని కాపాడింది పీవీపీ సంస్థ. అంతర్జాతీయ సినిమాల్ని ఇప్పటివరకు ఫ్రీమేక్ చేయడమే చూశాం కానీ.. ఇలా అధికారికంగా హక్కులు తీసుకుని రీమేక్ చేయడం అన్నది జరగలేదు. ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’ను చక్కగా మన నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసుకుని.. తెలుగు - తమిళ ప్రేక్షకుల్ని మెప్పించాడు వంశీ పైడిపల్లి. రెండు భాషల్లోనూ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. చాలామంది సెలబ్రెటీలు కూడా సినిమా చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ప్రశంస దక్కింది.

‘ఊపిరి’ మాతృక ‘ది ఇన్ టచబుల్స్’ను నిర్మించిన గౌమాంట్ సంస్థ ప్రతినిధులు ఈ సినిమా తెలుగు - తమిళ భాషల్లో ఇంత మంచివిజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏదో రీమేక్ రైట్స్ ఇచ్చేశాం.. అని ఊరుకోకుండా ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటున్నారట ఆ సంస్థ ప్రతినిధులు. ఇండియాతో పాటు విదేశాల్లో సైతం ‘ఊపిరి’కి మంచి స్పందన వస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది గౌమాంట్ సంస్థ,. ‘‘ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థ గౌమాంట్. మేం నిర్మించిన ‘ది ఇన్ టచబుల్స్’ ఫ్రెంచ్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్. మా దేశం నుంచి ఇండియాలో తొలిసారి రీమేక్ అయిన సినిమా పెద్ద విజయం సాధించడం మాకు చాలా సంతోషం. పీవీపీ సంస్థతో కలిసి పని చేయడం మాకు గర్వకారణం. చాలా తక్కువ సమయంలో ఈ చిత్రాన్ని గొప్పగా తీశారు. ఊపిరి టీంకు మా అభినందనలు’’ అని గౌమాంట్ సంస్థ ప్రకటనలో తెలిపింది.