Begin typing your search above and press return to search.

శాతకర్ణి.. రుణపడి ఉందాం!

By:  Tupaki Desk   |   12 Jan 2017 10:25 AM GMT
శాతకర్ణి.. రుణపడి ఉందాం!
X
ప్రతి తెలుగువాడూ గర్వపడి చూడాల్సిన సినిమా అంటూ పోస్టర్ మీద వేసి కొన్నాళ్లుగా ప్రచారం చేస్తోంది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బృందం. ఐతే గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి తగ్గట్లుగా ఉన్న సినిమాలు అరుదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మాత్రం కచ్చితంగా ఈ కోవకే చెందుతుంది. ‘బాహుబలి’ని చూసి ఎంతగా గర్వించామో.. ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని చూసి కూడా మనం అంతే గర్వించాలి.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కమర్షియల్ గా ఎంత పెద్ద విజయం సాధిస్తుంది.. ఎంత వసూళ్లు రాబడుతుంది.. ఈ సినిమాకు ఎలాంటి రేటింగ్స్ వచ్చాయి.. ఇలాంటి కొలమానాలన్నీ తర్వాత. ఇది ప్రతి సినీ ప్రేమికుడూ తప్పక చూడాల్సిన సినిమా. ఆ మాటకొస్తే సినిమాలపై ఆసక్తి లేని వాళ్లు కూడా చూసి తీరాల్సిన సినిమా. ఇలాంటి గొప్ప ప్రయత్నాలు.. సాహసోపేత సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటివి వచ్చినపుడు.. వాటిని వెండితెరపై వీక్షించడం ఒక బాధ్యత. ఇలాంటి సినిమాల్ని కూడా పైరసీలో చూసేద్దామనో.. టీవీల్లో వచ్చినపుడు చూసుకుందామనో అనుకుంటే మీరు నిజమైన సినిమా ప్రేమికుడు కానట్లే.

చారిత్రక కథలు తీసినా.. వాస్తవ గాథలు తెరకెక్కించినా.. కమర్షియల్ కోణంలో ఆలోచించి.. అదనపు హంగులు జోడించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మాత్రం ఆ కోవలోకి రాదు. తాను అనుకున్న పాయింట్ నుంచి ఎక్కడా పక్కదారి పట్టకుండా సిన్సియర్ గా.. అర్థవంతంగా శాతకర్ణి కథకు వెండితెర రూపం ఇచ్చాడు క్రిష్. ఇలాంటి భారీ సినిమాను అతను 79 రోజుల్లోనే తీశాడంటే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. కథాకథనాలు.. ప్రతి పాత్ర విషయంలో.. ప్రతి డైలాగ్.. ఇలా ప్రతి విషయంలోనూ అతడికి ఉన్న స్పష్టత తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. శాతకర్ణి పాలనకు సంబంధించి.. యుద్ధేతర విషయాల గురించి లోతుల్లోకి వెళ్లకపోవడం.. యుద్ధ సన్నివేశాల నిడివి ఎక్కువైపోవడం మినహాయిస్తే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో చెప్పుకోదగ్గ లోటుపాట్లు లేవు. బహుశా దానికి సంబంధించిన సమాచారం క్రిష్ కు దొరకలేదేమో. ఈ లోపాల గురించి పక్కనబెడితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కచ్చితంగా ఒక గొప్ప ప్రయత్నం అనడంలో సందేహం లేదు. సాహో.. శాతకర్ణి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/